logo

తిరునాళ్లలో ఆశీల దోపిడీ

పట్టణంలో నిర్వహిస్తున్న వీరమ్మతల్లి తిరునాళ్లలో గుత్తేదారు ఆశీల దోపిడీకి అడ్డు లేకుండాపోతోంది.

Published : 05 Feb 2023 05:28 IST

ఉయ్యూరు, న్యూస్‌టుడే: పట్టణంలో నిర్వహిస్తున్న వీరమ్మతల్లి తిరునాళ్లలో గుత్తేదారు ఆశీల దోపిడీకి అడ్డు లేకుండాపోతోంది. చిరువ్యాపారులు, దుకాణదారుల నుంచి నిబంధనలకు విరుద్ధంగా ఇష్టారాజ్యంగా వసూలు చేస్తుండటంతో ఆయా వర్గాల వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా నగర పంచాయతీ ఆశీలు వసూలుపై వేలంపాట నిర్వహించి గుత్తేదారుడికి అప్పగించాలి. నియమావళికి అనుగుణంగా కేటాయించిన కాలపరిమితిలో ఆశీలు వసూలు చేయాల్సి ఉంటుంది. తిరునాళ్లలో ఎక్కువ దుకాణాలు, నాలుగు చక్రాల బళ్లపై వ్యాపారులు ఎక్కువగా ఉంటారు. నాలుగు చక్రాల బళ్లకు రూ.30, దుకాణానికి రూ.50 వసూలు చేయాలి. కానీ సంబంధిత గుత్తేదారుడు అంతకు రెట్టింపు మొత్తాన్ని వసూలు చేస్తున్నట్లు వ్యాపారులు గగ్గోలు పెడుతున్నారు. నాలుగు చక్రాల బండికి రూ.50 నుంచి రూ.70 వరకు, దుకాణదారుడి నుంచి రూ.80 నుంచి రూ.వంద వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఇంతజరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకునే స్థితిలో లేరు. ఉయ్యూరు కూడలి నుంచి తిరునాళ్ల వరకు సుమారు వంద బండ్లు, మరో వంద వరకు దుకాణాలున్నాయి. వసూలుదారులు వైకాపా వర్గీయులు కావడంతో అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఈ విషయాన్ని కమిషనర్‌ వెంకటేశ్వరరావు వద్ద ప్రస్తావించగా.. గెజిట్‌కు అనుగుణంగానే ఆశీలు వసూలు చేయాలని, ఈ విషయంలో తగిన పరిశీలన చేసి చర్యలు తీసుకుంటామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని