logo

ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా హ్యాక్‌ చేసి బాలికకు వేధింపులు

ఓ బాలికకు చెందిన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాను హ్యాక్‌చేసి అసభ్య పోస్టులతో వేధింపులకు గురిచేస్తున్న  ఇంజినీరింగ్‌ విద్యార్థిని రాచకొండ సైబర్‌క్రైమ్‌ పోలీసులు రిమాండుకు తరలించారు.

Published : 07 Feb 2023 03:26 IST

నిందితుడి అరెస్టు

హైదరాబాద్‌: ఓ బాలికకు చెందిన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాను హ్యాక్‌చేసి అసభ్య పోస్టులతో వేధింపులకు గురిచేస్తున్న  ఇంజినీరింగ్‌ విద్యార్థిని రాచకొండ సైబర్‌క్రైమ్‌ పోలీసులు రిమాండుకు తరలించారు. ఎన్‌టీఆర్‌ జిల్లాలోని ఇబ్రహీంపట్నంకు చెందిన గౌరనేని మనోజ్‌(27) మెకానికల్‌ ఇంజినీరింగ్‌ 3వ సంవత్సరం వరకు చదివాడు. చెడు తిరుగుళ్లకు అలవాటు పడటంతో పెద్దలు మధ్యలోనే మాన్పించేశారు. అయినా పోర్న్‌ సైట్లు చూస్తూ... తనకు తెలిసిన సాంకేతిక విద్యతో ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలను హ్యాక్‌ చేయడమెలాగో తెలుసుకున్నాడు. నకిలీ పేర్లతో అనేక ప్రొఫైల్స్‌ సృష్టించి యువతులకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌లు పంపేవాడు. 2021 డిసెంబరులో నగరానికి చెందిన ఓ ఇంటర్‌ విద్యార్థిని ఇతను పంపిన ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ను అంగీకరించింది. దీంతో ఆమెకు ఓ ఫిషింగ్‌ లింక్‌ను పంపాడు. అదేంటో తెలుసుకోకుండానే  ఓపెన్‌చేసిన సదరు బాలిక తన వివరాలన్నీ అందులో పొందుపరిచింది. తద్వారా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్‌నేమ్‌, పాస్‌వర్డ్‌ మనోజ్‌కు తెలిసిపోయాయి. ఆ ఖాతాను తన ఆధీనంలోకి తీసుకుని పాస్‌వర్డ్‌ను మార్చేసిన మనోజ్‌... ఆమె ఫొటోలు డౌన్‌లోడ్‌ చేసుకుని  వ్యభిచారిణిలా సృష్టిస్తూ ఆమె  ఖాతాలోనే అసభ్యంగా కామెంట్లు పెట్టి వేధించసాగాడు. వేరొక స్నేహితురాలి ప్రొఫైల్‌ నుంచి ఫోనుచేసి అతనిని నిలదీయగా... నగ్నంగా వీడియో కాల్‌ చేస్తే ఆ ఫొటోలను తొలగిస్తానని.. లేదంటే అసభ్యంగా మార్ఫింగ్‌ చేసిన  ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ చేస్తానంటూ బెదిరించాడు. బాలిక తండ్రి  ఫిర్యాదుతో  పోలీసులు కేసునమోదు చేశారు. ఇది తెలుసుకున్న మనోజ్‌ తన సెల్‌ఫోనుతోపాటు సిమ్‌కార్డులను కాల్చేశాడు.. సాంకేతిక ఆధారాలను సేకరించిన పోలీసులు అతడు హ్యాక్‌చేసిన ఐపీ నంబరును సంపాదించారు. సెల్‌ఫోను సిమ్‌ కార్డులను కాల్చేసినా.. నిందితుడి జాడను కనిపెట్టి అరెస్టు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని