logo

కోర్టు వద్దన్నా.. కడతామంతే..!

అధికారం మాదే.. మేము అనుకున్నదే జరగాలి.. చట్టాలు.. రాజ్యాంగం ఏదీ అవసరం లేదు.. అన్నట్లు వైకాపా నాయకులు వ్యవహరిస్తున్నారు.

Updated : 31 May 2023 06:16 IST

ఇష్టారీతిన దేవాదాయ ఆస్తుల పంపకం
అనుమతి లేకుండా భవన నిర్మాణాలు

దేవస్థానం స్థలంలో నిర్మిస్తున్న భవనం

అధికారం మాదే.. మేము అనుకున్నదే జరగాలి.. చట్టాలు.. రాజ్యాంగం ఏదీ అవసరం లేదు.. అన్నట్లు వైకాపా నాయకులు వ్యవహరిస్తున్నారు. అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు.. అని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినా.. వాటిని లెక్క చేయకుండా నాడు-నేడు అని భవన నిర్మాణాలు చేపట్టారు. ఈ ఉదంతం..  ఎన్టీఆర్‌ జిల్లా వీరులపాడు మండలం పెద్దాపురంలో చోటు చేసుకుంది. ఆ దేవాలయానికి ఆదాయం అంతంతే. అలాంటిది ఆదాయం వచ్చే మార్గాలను అన్వేషించి ధూపదీప నైవేద్యాలను అందించేందుకు పాలకవర్గం చర్యలు తీసుకోవాలి. కానీ ఉన్న కొద్దిపాటి ఆస్తులను హారతి కర్పూరంలో కరిగిస్తున్నారు. నామినేటెడ్‌ పదవిలో కూర్చున్న వ్యక్తులు దేవస్థానం ఆస్తులు తమ సొంతం అన్నట్లు ఇష్టానుసారం పంచేస్తున్నారు. సుమారు 1.18 ఎకరాల దేవస్థానం భూమి పంపకాలు చేపట్టారు. అదేమిటంటే.. మాఇష్టం అని సమాధానం. న్యాయం చేయండి అని ఉన్నతాధికారులకు నివేదిస్తే.. తప్పుడు పత్రాలతో సమస్యను పరిష్కరించినట్లు స్పందనలో ముగించేశారు. కేవలం రాజకీయ ఒత్తిడితో అధికారులు సైతం పరిష్కరించేందుకు ముందుకు రావడం లేదని న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే.. వేసవి సెలవులు సాకుగా తీసుకుని కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘిస్తున్నారు.

శాఖ పరిధిలో ఉన్నప్పటికీ...

పెద్దాపురం గ్రామంలో దశాబ్దాల కిందటే శ్రీఆంజనేయ స్వామి ఆలయం ఉంది. దీనికి సర్వే నెంబరు 211లో 7.72 ఎకరాల మెట్ట భూమి, సర్వేనెంబరు 98/2లో 1.18 ఎకరాల స్థలం ఉంది. దేవాలయం సర్వేనెంబరు 125/3లో 4సెంట్ల స్థలంలో విస్తరించి ఉంది. దీనికి పూజారి ఉన్నారు. ప్రతి రోజు ధూపదీప నైవేద్యాలు అందిస్తున్నారు. సర్వే నెంబరు 98/2లో 1.18 ఎకరాలు గ్రామం మధ్యలో ఉంది. దీని విలువ రూ.లక్షల్లోనే ఉంది. గతంలో దాతల ద్వారా సంక్రమించిన ఈ స్థలాన్ని దేవస్థానానికి నామినేటెడ్‌ పదవిలో కూర్చున్న ఛైర్‌పర్సన్‌ వివిధ నిర్మాణాలకు స్థలాన్ని రాసిచ్చారు. గ్రామంలో రైతు భరోసా కేంద్రానికి... వెల్‌నెస్‌ సెంటర్‌ కోసం 10 సెంట్లు రాసిచ్చారు. తర్వాత అంగన్‌వాడీ కేంద్రానికి 2సెంట్లు రాసిచ్చారు. దీనిని గ్రామస్థులు తీవ్రంగా వ్యతిరేకించారు. దేవస్థానం భూమిని ఛైర్‌పర్సన్‌ రాసివ్వడం ఏంటని ప్రశ్నించారు. దేవదాయశాఖ  ఆమోదం లేదు. ఈ భూమి దేవాలయ ఆస్తుల రిజిస్టర్‌ 43లో నమోదైంది.

స్పందనలో ఫిర్యాదు చేస్తే..

దేవాదాయ శాఖ భూమిలో అక్రమంగా ప్రభుత్వమే నిర్మాణాలు చేస్తుందని వీటిని నిలుపుదల చేయాలని దేవదాయ శాఖ భూములను రక్షించాలని రాజేంద్రప్రసాద్‌ ఎన్టీఆర్‌ కలెక్టరేట్‌ స్పందనలో ఎన్టీఆర్‌ 202305081481 ఆర్జీ ఇచ్చారు. కొన్ని రోజులు తర్వాత ఈ ఆర్జీ పరిష్కారం కాకుండానే మూసేశారు. అదేమంటే.. సమస్య పరిష్కారమైందని చెబుతున్నారు. దీనిపై ఆరాతీస్తే.. తిరువూరు మండలం రాజుపేటకు చెందిన పమ్మి రామారావు అర్జీతో ముడిపెట్టి మూసివేశారు. అక్కడ జమ్మిచెట్టుకింద దుర్గమ్మ గుడి ఉంటే.. వెల్డింగ్‌ దుకాణం పెట్టి ఆక్రమించారనేది ఫిర్యాదు. ఆ కేసు విచారణలో ఉందనీ, ఆక్రమణ తొలగిస్తామని చెబుతూ రాజేంద్రప్రసాద్‌ అర్జీ మూసేశారు.

పట్టించుకోరేమండి..

ఎలాంటి అనుమతులు లేకుండానే ఆర్బీకేలు.. వెల్‌నెస్‌ సెంటర్‌, అంగన్‌వాడీ భవన నిర్మాణాలు ప్రారంభించారు. దీనిపై గ్రామస్థుడు నిమ్మల రాజేంద్రప్రసాద్‌ అధికారులకు, దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఏమాత్రం చలనం లేకపోవడంతో 2020లోనే న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దేవదాయ శాఖ స్థలం సర్వేనెంబరు 98/2లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు ఉన్నా.. నిర్మాణాలు ప్రారంభించారు. ఆర్బేకే భవనం, అంగన్‌వాడీ, వెల్‌నెస్‌ సెంటర్లు పూర్తి చేశారు. కొందరు వైకాపా నాయకులు వీటిని కాంట్రాక్టు తీసుకుని పూర్తి చేయడం విశేషం. తాజాగా నాడు-నేడు పేరుతో మిగిలి ఉన్న స్థలంలోనూ నిర్మాణాలు చేపట్టారు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఉన్నాయని గ్రామస్థుడు రాజేంద్రప్రసాద్‌ అధికారుల దృష్టికి తీసుకురాగా.. కనీసం పట్టించుకోలేదు. ప్రస్తుతం నాడు-నేడు కింద పాఠశాల భవనం నిర్మిస్తున్నారు.

 

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని