logo

అరకొరగానే పాఠ్యపుస్తకాలు

విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నామని, విద్యార్థులు ఎటువంటి ఇబ్బందులకు గురికాకుండా విద్యా, వసతి దీవెనలు తల్లుల ఖాతాలకు జమచేస్తున్నామంటూ పదేపదే చెబుతున్న పాలకులు ఏటా ఇవ్వాల్సిన పాఠ్యపుస్తకాలు ఇవ్వకుండా వారి భవిష్యత్‌తో చెలగాటమాడుతున్నారు.

Published : 10 Jun 2023 05:34 IST

ఇంటర్‌ విద్యార్థులకు తప్పని అవస్థలు
కలెక్టరేట్‌(మచిలీపట్నం), న్యూస్‌టుడే

విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నామని, విద్యార్థులు ఎటువంటి ఇబ్బందులకు గురికాకుండా విద్యా, వసతి దీవెనలు తల్లుల ఖాతాలకు జమచేస్తున్నామంటూ పదేపదే చెబుతున్న పాలకులు ఏటా ఇవ్వాల్సిన పాఠ్యపుస్తకాలు ఇవ్వకుండా వారి భవిష్యత్‌తో చెలగాటమాడుతున్నారు.ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లోని విద్యార్థులకు క్రమం తప్పకుండా ప్రతి ఏడాది అందించాల్సిన పాఠ్యపుస్తకాల విషయాన్ని ప్రభుత్వం పూర్తిగా గాలికొదిలేసింది. గత సంవత్సరం పాఠ్యపుస్తకాలు లేకుండానే ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థులు పరీక్షలకు హాజరవ్వాల్సిన దుస్థితి నెలకొంది.

తెలుగు అకాడమీ ద్వారా ఏటా ప్రభుత్వ కళాశాలల్లో చదివే విద్యార్థులకు ఇంటర్‌ పాఠ్యపుస్తకాలను ఉచితంగా అందజేస్తూ వస్తున్నారు. కరోనా సమయంలో పుస్తకాల సరఫరాలో ఏర్పడిన ప్రతిష్ఠంభన ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వ కళాశాలల్లో అత్యధికశాతం మంది పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన వారే విద్యనభ్యసిస్తున్నారు. గతేడాది జిల్లాలోని ఎనిమిది జూనియర్‌ కళాశాలల్లో దాదాపు 1000 మంది పైగా విద్యార్థులు ఇంటర్‌ పరీక్షలకు హాజరయ్యారు. కొన్ని కళాశాలలో అధ్యాపకులే చొరవ తీసుకుని పూర్వ విద్యార్థుల నుంచి సేకరించిన వాటితో విద్యాబోధన సాగించారు. ప్రైవేటు కళాశాలల్లో ప్రత్యేకంగా స్టడీ మెటీరియల్‌ ఇచ్చి విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేస్తుండగా ప్రభుత్వ కళాశాలల్లో పాఠ్యపుస్తకాలే లేకపోవడం గమనార్హం. ప్రభుత్వం ఇవ్వాల్సిన పుస్తకాలు లేకుండానే ఇప్పటికి మూడు బ్యాచ్‌ల వరకూ పరీక్షల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాల్సి వచ్చింది. కళాశాలలు పునఃప్రారంభమయ్యే నాటికే అందుబాటులో ఉండాల్సిన పుస్తకాలు అతీగతీ లేకుండా పోయాయి.

ఆర్భాటానికే పరిమితమైన హైస్కూల్‌ ప్లస్‌

విద్యావ్యవస్థలో సంస్కరణల పేరుతో గత ఏడాది ప్రభుత్వం మండలానికి ఒక్కటి చొప్పున జిల్లాలో 24 చోట్ల హైస్కూల్‌ ప్లస్‌ ప్రారంభించారు. విద్యాశాఖాధికారుల ఒత్తిడితో పదో తరగతి ఉత్తీర్ణులైన వారిని బలవంతంగా ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో చేర్పించారు. వారికి విద్యాబోధన చేసేందుకు అనుభవజ్ఞలైన అధ్యాపకులు లేకపోగా పాఠ్యపుస్తకాలు సక్రమంగా వారికి అందలేదు. మొత్తం 221 మంది పరీక్షకు హాజరైతే కేవలం 31 మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. విద్యాసోపానానికి తొలిమెట్టుగా ఉండే ఇంటర్‌ విషయంలోనే విద్యార్థులకు అవసరమైన పుస్తకాలు ఇవ్వలేని ప్రభుత్వం వారి భవిష్యత్‌కు ఏమి భరోసా ఇవ్వగలదంటూ పలువురు తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.

తర్జన భర్జనలతో కాలయాపన

పాఠ్యపుస్తకాలు ఇవ్వకపోవడంపై రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇటీవలే జిల్లా వారీగా అరకొరగా పాఠ్యపుస్తకాలు పంపించారు. అధికారులు పెట్టిన ఇండెంట్‌ మేరకు మిగిలినవి ఎప్పుడు వస్తాయో తెలియదు. వచ్చిన వాటిని హైస్కూల్‌ ప్లస్‌ విద్యార్థులకు కేటాయించాలన్న సూచన మేరకు వాటిని ఎవరికీ ఇవ్వకుండా భద్రపర్చారు. ఇప్పటికే ఇంటర్‌ రెండో సంవత్సరం తరగతులు ప్రారంభమై పది రోజులు అవుతోంది. హైస్కూల్‌ ప్లస్‌లో ఎంతమంది విద్యార్థులు ఉంటారన్న విషయంలో నేటికీ స్పష్టత లేదు.ఇవన్నీ తేలేవరకూ వచ్చిన వాటిని పంపిణీ చేయరు. త్వరలో ప్రథమ సంవత్సర తరగతులు ప్రారంభం కానున్నాయి. వారికి సైతం పుస్తకాలు వస్తాయా రావా అన్న అనుమానాలే వ్యక్తమవుతున్నాయి. మొత్తం మీద ఈ విద్యాసంవత్సరంలోనూ విద్యార్థులకు ఏమేరకు పుస్తకాలు ఇస్తారన్న అంశం ప్రశ్నార్థకంగా నిలుస్తోంది. ఈ విషయమై విద్యాశాఖ అధికారులను ‘న్యూస్‌టుడే’ ప్రశ్నించగా గత ఏడాది సరఫరా లేదని, ప్రస్తుతం కొంత మేర వచ్చినా అవి ప్లస్‌ టూకు సర్దుబాటు చేయాల్సి ఉంటుందన్నారు. మిగిలినవి త్వరలో వచ్చే అవకాశం ఉందని స్పష్టం చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని