logo

Crime News: భర్తను కేసులో ఇరికించాలని అమాయకురాలి హత్య

పెనమలూరు మండలం కానూరులోని వ్యవసాయబోరు షెడ్డులో జరిగిన గరిగల నాగమణి(32) హత్య కేసును పెనమలూరు పోలీసులు 24 గంటల్లో ఛేదించారు.

Updated : 17 Jan 2024 10:28 IST

ప్రియుడితో కలిసి ప్రియురాలి దురాగతం

పెనమలూరు, న్యూస్‌టుడే: ఎన్టీఆర్‌ జిల్లా పెనమలూరు మండలం కానూరులోని వ్యవసాయబోరు షెడ్డులో జరిగిన గరిగల నాగమణి(32) హత్య కేసును పెనమలూరు పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను సినీ ఫక్కీలో హత్య కేసులో ఇరికించి జైలుకు పంపాలని ప్రియుడు, ప్రియురాలు పన్నిన పన్నాగం వికటించి చివరకు వారే కటకటాల పాలయ్యారు. గన్నవరం డీఎస్పీ జయసూర్య, పెనమలూరు సీఐ టీవీవీ రామారావులు మంగళవారం పెనమలూరు పోలీస్‌ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఈ కేసు వివరాలను వెల్లడించారు. వారి కథనం మేరకు..

ఎన్టీఆర్‌ జిల్లా ప్రసాదంపాడుకు చెందిన ఐతాబత్తుల మృధులాదేవి, రవీంద్రలు ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులున్నారు. రవీంద్ర ఓ ప్రైవేటు కంపెనీలో డిప్యూటీ మేనేజరు కాగా.. మృధులాదేవి ఓ బాడీకేర్‌ సెంటర్‌లో ఉద్యోగం చేస్తోంది. ఈ బాడీకేర్‌ సెంటర్‌కు తరచూ వచ్చే కృష్ణలంకకు చెందిన పోలాసి సాయిప్రవీణ్‌ అనే యువకుడుతో ఏర్పడిన పరిచయం ఇద్దరి మధ్య అక్రమ సంబంధానికి దారి తీసింది. రెండేళ్ల నుంచి  సాయిప్రవీణ్‌, మృధులాదేవిలు ఇతర ప్రాంతాలకు పరారవడం, తిరిగి మృధుల భర్త వద్దకు చేరుకోవడం జరుగుతుండేది. ఎప్పటికప్పుడు  తాను మారిపోయాయని, క్షమించాలని భర్త రవీంద్రకు మాయమాటలు చెబుతూ మృధుల నమ్మకంగా భర్త వద్దకు అప్పుడప్పుడు వచ్చి  ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు, నగదు తీసుకొని మళ్లీ పరారయ్యేది.

ఈ నేపథ్యంలో తల్లి దూరమవడంతో నాలుగో తరగతి చదువుతున్న మృధులాదేవి చిన్నకుమారుడు తీవ్ర మానసికాందోళనతో మధుమేహానికి గురయ్యాడు. దీంతో భర్త రవీంద్ర భార్య మృధులాదేవికి ఫోన్‌ చేసి కుమారుడి అనారోగ్య పరిస్థితిని తెలిపాడు. అప్పట్నించి ఆమె ఆలోచన మరింత క్రూరంగా మారింది. ఇక నుంచి భర్త తనను ఇంటికి రమ్మంటాడని, ప్రియుడు సాయిప్రవీణ్‌కు దూరమవ్వాల్సి ఉంటుందని భావించి ఎలాగైనా భర్త అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో మృధులాదేవి, సాయిప్రవీణ్‌లు చర్చించుకుని భర్త రవీంద్రను ఏదైనా హత్య కేసులో ఇరికించి జైలుకు పంపాలని, ఈ కేసును చూపించి భర్త నుంచి   సులువుగా విడాకులు పొందవచ్చని భావించారు.

ఈ వ్యూహాన్ని అమలు చేసేందుకు ప్రియుడు సాయిప్రవీణ్‌కు గతంలో తన ఇంట్లో అద్దెకున్న గరిగెల నాగమణిని హత్య చేసి ఈ నేరాన్ని రవీంద్రపైకి నెట్టేయాలనే ఆలోచనతో గతేడాది డిసెంబర్‌ నుంచి సాయిప్రవీణ్‌ నెమ్మదిగా నాగమణితో మాట్లాడుతూ నమ్మకంగా నటించడం మొదలు పెట్టాడు. మరోవైపు మృధులాదేవి తన భర్త వద్దకు చేరుకొని తాను మారిపోయినట్టు నటించడం చేయసాగింది. సాయిప్రవీణ్‌ పలుసార్లు నాగమణిని తనను, తన ప్రియురాలిని ఎలాగైనా కలపాలని, సహాయపడాలని ప్రాధేయపడడంతో నాగమణి అంగీకరించింది.

ఇదే అదనుగా భావించి..

ఈ నెల 13వ తేదీన నాగమణి భర్త కిరణ్‌గోపాల్‌ ఏలూరు వెళ్తున్నట్టు తెలుసుకున్న సాయిప్రవీణ్‌.. తన పథకం అమలు చేయడానికి ఇదే అదనుగా భావించాడు. నాగమణిని ఎనికేపాడు రప్పించాడు. మృధులాదేవి భర్తకు సంబంధించిన కొన్ని మాటలను రికార్డు చేయాలని ఈమెను కానూరు వందడుగుల రహదారిలోని ఓ వ్యవసాయబావి షెడ్డు వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ మృధులాదేవితో ఆమె సెల్‌ఫోన్‌లోనే రవీంద్ర తనను మోసం చేశాడని, తనను శారీరకంగా వాడుకుని తన బంగారం కూడా తాకట్టు పెట్టుకున్నాడని తనకు ఏదైనా హాని జరిగితే రవీంద్రే కారణమంటూ ఆమెతోనే మాట్లాడించి వాయిస్‌ రికార్డు చేయించాడు. వాయిస్‌ రికార్డు పూర్తవగానే ఒక్కసారిగా ఈమెపై సాయిప్రవీణ్‌ దాడి చేసి చున్నీని పీకకు బిగించి చంపేశాడు.

నిందితులను పట్టించిన వాయిస్‌ మెసేజ్‌లు.. నాగమణి చనిపోయిందని నిర్ధారించుకున్న సాయిప్రవీణ్‌ ఈమె సెల్‌ఫోన్‌ తీసుకున్నాడు. రాత్రి 9 గంటల సమయంలో ఆమె భర్త కిరణ్‌గోపాల్‌కు, ప్రియురాలు మృధులాదేవికు రికార్డు చేసిన వాయిస్‌ మెసేజ్‌లు పంపాడు. వీటిని అడ్డుపెట్టి భర్తను బెదిరించాలని మృధులాదేవికి తెలిపాడు. ఈ విషయాలను పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో గుర్తించారు. మృధులాదేవి భర్త రవీంద్రను విచారించగా తన భార్య అక్రమ సంబంధం వ్యవహారాన్ని చెప్పాడు. దీంతో మృధులాదేవిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా చిక్కుముడి వీడింది. సాయిప్రవీణ్‌, మృధులాదేవి, వీరికి సహకరించిన కంకిపాడు మండలం వేల్పూరుకు చెందిన మూర్తిబాబులపై హత్య కేసు నమోదు చేశారు. మంగళవారం అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపర్చగా నిందితులకు రిమాండ్‌ విధించింది. అమాయకురాలైన నాగమణిని హత్య చేయగా ఈమెకు ఇద్దరు కుమారులు ఉన్నారు. కేసును 24 గంటల్లో ఛేదించిన సీఐ రామారావు, ఎస్‌ఐలు రమేష్‌, ఏసోబు, ఉషారాణి, ఫిరోజ్‌లను డీఎస్పీ జయసూర్య అభినందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని