logo

Vijayawada: ఆర్‌పీలకు కుక్కర్లు.. చీరలు

విజయవాడ మధ్య నియోజకవర్గంలో ఎమ్మెల్యే వెలంపల్లి తాయిలాల పరంపర కొనసాగుతోంది. ఇంటింటికీ ఎన్నికల ప్రచారం ముసుగులో తాయిలాలను విచ్చలవిడిగా పంచుతున్నారు.

Updated : 16 Feb 2024 09:24 IST

కొనసాగుతున్న వెలంపల్లి తాయిలాల పంపిణీ

 డ్వాక్రా గ్రూపులే లక్ష్యంగా పన్నాగం

 ఓటర్లను ప్రభావితం చేసే ఉద్యోగులందరికీ ఎర

 

పాయకాపురంలో కుక్కర్లు తీసుకుని వెళ్తున్న వాలంటీర్లు (పాతచిత్రం)

ఈనాడు, అమరావతి, గవర్నర్‌పేట, న్యూస్‌టుడే: విజయవాడ మధ్య నియోజకవర్గంలో ఎమ్మెల్యే వెలంపల్లి తాయిలాల పరంపర కొనసాగుతోంది. ఇంటింటికీ ఎన్నికల ప్రచారం ముసుగులో తాయిలాలను విచ్చలవిడిగా పంచుతున్నారు. ఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గ పరిధిలో ఓటర్లను ప్రభావితం చేయగలిగే.. ప్రతి ఉద్యోగికి గృహోపకరణాలు, చీరలు లాంటివి ఎరవేస్తున్నారు. ఇప్పటికే సచివాలయ సిబ్బంది, వలంటీర్లకు కుక్కర్లను పంచుతూ అడ్డంగా దొరికారు. తాజాగా డ్వాక్రా మహిళా గ్రూపులను పర్యవేక్షించే రిసోర్స్‌పర్సన్‌(ఆర్‌పీ)లకు తాయిలాలను ఎరవేస్తున్నారు. మధ్య నియోజకవర్గ పరిధిలో 400 మంది ఆర్‌పీలు ఉండగా ప్రతి ఒక్కరికీ కుక్కరు, చీర పంపిణీ ఆరంభించారు. డివిజన్ల వారీగా పంపిణీ బాధ్యతలను కొంత మంది కార్పొరేటర్లు, వైకాపా నేతలకు అప్పగించారు. గుట్టుచప్పుడు కాకుండా అర్ధరాత్రి సమయంలో ఈ పంపిణీ జరుగుతున్నట్టు సమాచారం. కొందరు కార్పొరేటర్లకు సంబంధించిన కార్యాలయాలు, ఎవరికీ అనుమానం రాని కొన్ని ఇళ్లలో ఈ తాయిలాలను ఉంచి అక్కడి నుంచి ఒక్కొక్కరికీ అందిస్తున్నారు. సింగ్‌నగర్‌లోని 59, 61, 64 డివిజన్లలోని ఆర్‌పీలకు గురువారం తాయిలాలు అందజేసినట్టు సమాచారం.

మధ్య నియోజకవర్గంలో 96 సచివాలయాలు ఉండగా వాటిలో వెయ్యి మందికి పైగా సిబ్బంది పని చేస్తున్నారు. మరో 1500 మంది వలంటీర్లున్నారు. వీళ్లందరికీ కుక్కర్లను పంపిణీ చేశారు. వారితో సమావేశాలను నిర్వహించి రూ.1500కు పైగా విలువ చేసే కుక్కర్లను మినీ వ్యాన్లలో తీసుకొచ్చి మరీ పంచారు. ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో నియోజకవర్గ ఎన్నికల అధికారిగా ఉన్న విజయవాడ మున్సిపల్‌ కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ స్పందించి.. దీనిపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలంటూ కొద్దిరోజుల కిందట నగర పోలీసు కమిషనర్‌కు లేఖ రాశారు. తెదేపా ఆధ్వర్యంలోనూ సత్యనారాయణపురం,  నున్న పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదు చేసినా తీసుకోలేదు. దీంతో రిజిస్టర్‌ పోస్టులో ఫిర్యాదు పంపించారు. కానీ పోలీసులు ఇప్పటికీ దీనిపై ఒక్కచోట కూడా కేసు నమోదు చేయలేదు. తాయిలాల వ్యవహారం ఫొటోలతో సహా బయటకొచ్చినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ప్రస్తుతం మరింత బరితెగించి కుక్కర్లతో పాటు చీరలను కూడా ఆర్‌పీలకు పంచుతున్నట్టు తెలుస్తోంది. కానీ ఎక్కడా విషయం బయటకు రాకుండా గుట్టుచప్పుడు కాకుండా వ్యవహారాన్ని చక్కబెడుతున్నారు.

రహస్య ప్రదేశాల్లో దాచి..

మధ్య నియోజకవర్గంలోని వేల మంది డ్వాక్రా గ్రూపు సభ్యులే లక్ష్యంగా తాజాగా తాయిలాలను ఎరవేస్తున్నారు. డ్వాక్రా మహిళలకు రుణాలు ఇప్పించడం, వారి వ్యవహారాలన్నింటినీ పర్యవేక్షించడంలో బుక్‌ కీపర్లుగా వ్యవహరించేది రిసోర్స్‌పర్సన్‌లే. అధికార పార్టీ సభలు, సమావేశాలకు డ్వాక్రా మహిళలను సమీకరించడంలోనూ ఆర్‌పీలే కీలకంగా ఉంటారు. వీరిని చెప్పు చేతల్లో ఉంచుకుంటే వేల మంది డ్వాక్రా మహిళలను ప్రభావితం చేయొచ్చు. అందుకే ఆర్‌పీలే లక్ష్యంగా తాజాగా వెలంపల్లి వర్గం తాయిలాలను పంపిణీ చేస్తున్నట్లు తెలిసింది. ముందుగా ఆర్‌పీలకు ఇచ్చాక, వారి ద్వారా డ్వాక్రా మహిళలందరికీ తాయిలాలు ఎరవేయాలని పన్నాగం పన్నుతున్నట్లు తెలిసింది. వన్‌టౌన్‌లోని కొన్ని హోల్‌సేల్‌ దుకాణాల నుంచి వీటిని పెద్దఎత్తున కొనుగోలు చేసి మధ్య నియోజకవర్గంలోని రహస్య ప్రదేశాల్లో దాచి ఉంచి పంచుతున్నట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు