logo

ఎర్రకట్ట విస్తరణ ఎప్పుడో?

పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది. నగరంలో రహదార్లు మాత్రం విస్తరణకు నోచుకోలేదు. వందలాది వాహనాల రాకపోకలతో ఎర్రకట్ట ప్రమాదాలకు నెలవుగా మారింది.

Updated : 28 Mar 2024 06:16 IST

విస్మరించిన పాలకులు
కార్యరూపం దాల్చితే అందరికీ మేలు

దెబ్బతిన్న రైల్వే వంతెన

చిట్టినగర్‌, న్యూస్‌టుడే: పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది. నగరంలో రహదార్లు మాత్రం విస్తరణకు నోచుకోలేదు. వందలాది వాహనాల రాకపోకలతో ఎర్రకట్ట ప్రమాదాలకు నెలవుగా మారింది. ఎందరో వాహన చోదకులు, ప్రయాణికుల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. హైదరాబాద్‌ నుంచి నగరంలోకి రాకపోకలు సాగించేందుకు గొల్లపూడి బైపాస్‌ నుంచి సొరంగం, ఎర్రకట్ట రహదారి సులువైన మార్గం. దీనిని విస్తరిస్తే నగరంలోకి ట్రాఫిక్‌ రద్దీ తగ్గుతుంది. పైగా ప్రమాదాల నివారణకు చెక్‌ పెట్టవచ్చు. తద్వారా 20 ఏళ్లుగా ఉన్న ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఇప్పటికైనా పాలకులు ఆ దిశగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

తెదేపా హయాంలో రూ.88 కోట్లతో అంచనా

రాష్ట్రం విడిపోయింది. అనంతరం 2014లో జరిగిన ఎన్నికల్లో తెదేపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అమరావతి రాజధానిగా రూపాంతరం చెందుతున్న తరుణంలో నగరానికి బాగా రద్దీ పెరిగింది. ఈ నేపథ్యంలో ఎర్రకట్ట రోడ్డును నాలుగు వరుసలుగా విస్తరించాలని తెదేపా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. అప్పటి కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. గొల్లపూడి బైపాస్‌ వై జంక్షన్‌ రోడ్డు నుంచి చిట్టినగర్‌ సొరంగం, ప్రైజర్‌పేట, ఎర్రకట్ట, కేదారేశ్వరపేట, బీఆర్టీఎస్‌ రోడ్డు వరకు నాలుగు వరుసల విస్తరణకు (సుమారు 5.50 కిలోమీటర్లకు) అయ్యే వ్యయం సుమారు రూ.88 కోట్లుగా 2017లో ఆర్‌అండ్‌బీ అధికారులు అంచనా వేశారు. రైల్వే, ఆర్‌అండ్‌బీ, నగరపాలక సంస్థ, నగర పోలీస్‌ కమిషనరేట్‌, గతంలో జిల్లా కలెక్టర్‌, మాజీ మంత్రి దేవినేని ఉమా, ఎంపీ కేశినేని నాని పరిశీలించారు.

తుంగలో తొక్కిన వైకాపా ప్రభుత్వం

ఈ మార్గం మధ్యలో దెబ్బతిన్న రైల్వే వంతెనను తొలగించి, దాని స్థానంలో నూతన వంతెన నిర్మాణానికి, 4 వరుసల రోడ్డు విస్తరణకు సౌత్‌ సెంట్రల్‌ రైల్వే అప్పటి ప్రిన్సిపల్‌ చీఫ్‌ ఇంజినీర్‌, సికింద్రాబాద్‌ నుంచి కూడా సుముఖతం వ్యక్తమైంది. ఈ రోడ్డు పశ్చిమ, మధ్యనగరం నియోజకవర్గాలను కలుపుతుంది. ప్రజలకు నగరంలోకి సులువైన మార్గంగా ఏర్పడుతుంది. ట్రాఫిక్‌ తగ్గుతుంది. సుమారు 1,50,000 మందికి పైగా ప్రయోజనం చేకూరుతుంది. ప్రమాదాలు జరగకుండా అరికట్టవచ్చు. ఈ నేపథ్యంల ఎర్రకట్ట మార్గంలో పాత రాజరాజేశ్వరీపేట అంచున విస్తరణకు అడ్డుగా ఉన్న 29 ఇళ్లను కూడా అప్పట్లో తొలగించారు. అంతే ఈలోగా 2019 ఎన్నికలు వచ్చాయి. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం పూర్తిగా తుంగలో తొక్కితే, స్థానిక ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావులు ఈ విస్తరణ అంశాన్ని గాలికొదిలేశారు. దీంతో అభివృద్ధి పూర్తిగా పడకేసింది. అభివృద్ధిని కాంక్షించే నాయకులను ఎన్నుకునేలా ప్రజలు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని