logo

అమ్మతోడు.. అడ్డగోలేచూడు!

‘‘విజయవాడ దుర్గామల్లేశ్వర దేవస్థానానికి చెందిన రూ.150 కోట్లకు పైగా విలువైన చుండూరు వెంకటరెడ్డి (సి.వి.రెడ్డి) ఛారిటీస్‌ స్థలం, భవనాలను అన్యాక్రాంతం చేసేలా అడుగులు పడుతున్నాయి.

Updated : 28 Mar 2024 09:15 IST

రూ.150 కోట్ల దుర్గమ్మ ఆస్తికి ఎసరు?
ప్రత్యేక ఈవో నియామకంపై అనుమానాలు
సి.వి.రెడ్డి ఛారిటీస్‌ స్థలం మళ్లించే యత్నం

ఈనాడు - అమరావతి: ‘‘విజయవాడ దుర్గామల్లేశ్వర దేవస్థానానికి చెందిన రూ.150 కోట్లకు పైగా విలువైన చుండూరు వెంకటరెడ్డి (సి.వి.రెడ్డి) ఛారిటీస్‌ స్థలం, భవనాలను అన్యాక్రాంతం చేసేలా అడుగులు పడుతున్నాయి. 2014లో దుర్గమ్మ దేవస్థానంలో విలీనం చేసిన అత్యంత విలువైన ఈ ఆస్తిని.. తిరిగి వెనక్కి మళ్లించే యత్నమిది. తాజాగా దేవస్థానం నుంచి వేరుచేస్తూ.. ఈ ఆస్తికి దేవాదాయ శాఖ ప్రత్యేకంగా ఓ ఈవోను నియమించడం అనుమానాలు రేకెత్తిస్తోంది. పైగా.. ఈ ఆస్తిని తమకు వెనక్కి ఇచ్చేయాలని సి.వి.రెడ్డి వారసుల పేరుతో న్యాయస్థానంలో నాలుగేళ్ల కిందటే పిటిషన్‌ దాఖలైంది. కానీ.. ఇప్పటివరకూ ఈ పిటిషన్‌కు కనీసం దేవస్థానం నుంచి సమాధానం చెప్పకపోవడం, కాపాడుకునేందుకు ఓ కౌంటర్‌ దాఖలు చేయడం వంటివేవీ జరగలేదు. దీనిపై తాజాగా న్యాయస్థానం కూడా దుర్గగుడి అధికారులకు మొట్టికాయలు వేసింది. కచ్చితంగా న్యాయస్థానానికి వచ్చి సమాధానం చెప్పాలని ఆదేశించడం గమనార్హం.’’

సీఎం హామీ హుళక్కే

దుర్గమ్మ సన్నిధికి వచ్చే భక్తులకు సౌకర్యాల కల్పనలో విఫలమైన వైకాపా పాలకులు.. భక్తులు సమర్పించే కానుకలు, ఆదాయాన్ని మాత్రం.. విచ్చలవిడిగా పక్కదారి పట్టిస్తున్నారు. కాటేజీలు, అన్నదాన భవనం, ప్రసాదంపోటు, కేశఖండనశాల.. ఒక్కటి కూడా కట్టింది లేదు. పైగా ఉన్నవి కూలగొడుతూ.. కొండపై భవనాలన్నీ తుడిచిపెట్టేశారు. ముఖ్యమంత్రి జగన్‌ కూడా ఆలయానికి వచ్చి.. రూ.70 కోట్లు ఇస్తా, సమస్యలన్నీ పరిష్కరిస్తానని హామీ ఇచ్చి వెళ్లారు. కనీసం పది శాతం నిధులు కూడా విడుదల చేసింది లేదు. కానీ.. అమ్మవారికి దశాబ్దాలుగా కూడబెడుతూ వచ్చిన ఆస్తులను మాత్రం కరిగిస్తున్నారు. సి.వి.రెడ్డి ఛారిటీస్‌ నుంచి దశాబ్దం కిందట దేవస్థానంలో విలీనం అయిన ఆస్తులను కూడా లేకుండా చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. విజయవాడ రైల్వేస్టేషన్‌ ఆనుకుని మూడు ఎకరాలకు పైగా ఉన్న సి.వి.రెడ్డి ఛారిటీస్‌ స్థలంలో ఎనిమిదేళ్ల కిందట రూ.10 కోట్లకు పైగా దుర్గగుడి నిధులు వెచ్చించి కాటేజీలు నిర్మించారు. సామాన్య భక్తులు బస చేసేందుకు అందుబాటులో ఉన్న ఏకైక కాటేజీలు ఇవే.

సి.వి.రెడ్డి ఛారిటీస్‌ స్థలంలో దేవస్థానానికి చెందిన కాటేజీలు

అన్నీ సందేహాలే..

దుర్గగుడి ఈవో పరిధిలో ఈ ఆస్తులను వేరు చేసి.. వాటికి ప్రత్యేకంగా ఈవోను నియమించడమేంటి?. అదికూడా నెలల వ్యవధిలో.. వెంట వెంటనే ఇద్దరు ఈవోలను మార్చడమెందుకు? తొలుత డి.సాయిబాబాను సి.వి.రెడ్డి ఛారిటీస్‌కు ఈవోగా నియమిస్తూ దేవాదాయ శాఖ ఆదేశాలు జారీ చేసింది. మళ్లీ సాయిబాబాను మారుస్తూ.. ఆయన స్థానంలో ఆర్‌.జి.శ్రీదేవిని ఈవోగా నియమిస్తూ ఈనెల 14న ఆదేశాలు జారీ చేశారు. దుర్గగుడిలో విలీనం చేశాక ప్రత్యేకంగా మళ్లీ ఈవోలను.. ఇలా వెనువెంటనే ఎందుకు మార్చారు.? ఈ ప్రాంతంలో చదరపు గజం రూ.లక్షకు పైమాటే. ఈ లెక్కన మూడు ఎకరాలు రూ.150 కోట్లకు పైమాటే. ఇంత విలువైన స్థలం విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా ఎందుకున్నారు? ఈ స్థలం దుర్గగుడికి దక్కకపోతే.. భారీ నష్టమని తెలిసినా.. కనీసం కౌంటర్‌ దాఖలు చేయకపోవడం ఏంటి.?, ఇదంతా చూస్తుంటే.. తెరవెనుక పెద్ద లాబీయింగ్‌ జరుగుతున్నట్టు అర్థమవుతోంది. తొలుత దుర్గగుడి నుంచి వేరుచేసి.. ఆ తర్వాత దానిని తెరవెనుక ఉన్న ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేయాలని చూస్తున్నట్టు సమాచారం.

ఇప్పటికే భారీగా వెచ్చించారు..

సి.వి.రెడ్డి.ఛారిటీస్‌ను దుర్గగుడిలో విలీనం చేశాక రూ.కోట్లు వెచ్చించి ఆ స్థలంలో పురాతన గోదాములు తొలగించి, కాటేజీలు కట్టారు. 2007 ఆగస్టు 3న దుర్గగుడి తొలుత ఛారిటీస్‌ను దత్తత తీసుకుంది. ఆపై 2014 మార్చి 19న పూర్తిగా సంస్థను దేవస్థానంలో విలీనం చేశారు. సంస్థలోని కొందరు సిబ్బందికి కూడా శాశ్వత ప్రాతిపదికన దుర్గగుడిలో కొలువులు ఇచ్చారు. వాళ్లలో సూపరింటెండెంట్‌ రాజు, అటెండర్‌ వీరబాబులు ఇప్పటికీ దుర్గగుడిలో పనిచేస్తున్నారు. వీరికి జీతాలు దేవస్థానం నుంచే చెల్లిస్తున్నారు. పైగా సి.వి.రెడ్డి ఛారిటీస్‌ స్థలంలో రూ.10 కోట్లుపైగా వెచ్చించి షెడ్లు, గదులు కట్టారు. ప్రతినెలా రూ.5 లక్షలకు పైనే విద్యుత్తు ఛార్జీలు ఏళ్లుగా కడుతున్నారు. ఇంత విలువైన స్థలాన్ని దేవస్థానానికి అప్పగించినా.. ప్రణాళికా లోపంతో.. సరిగా సద్వినియోగం చేసుకోకుండా కేవలం కొన్ని కాటేజీలు కట్టేసి వదిలేశారు. వాస్తవంగా.. ఇక్కడ కల్యాణ మండపాలు, భక్తుల కోసం అధునాతన కాటేజీలు కడతామని గత ఈవోలు ప్రణాళికలు వేసి వదిలేశారు. రైల్వేస్టేషన్‌, బస్టేషన్‌కు సమీపంలో అత్యంత రద్దీ ప్రాంతంలో దేవస్థానానికి ఆదాయం వచ్చేలా.. వాణిజ్య భవనాలనూ నిర్మించొచ్చు. కానీ.. ఇంతటి విలువైన స్థలాన్ని పూర్తిగా దేవస్థానానికి లేకుండా చేసేందుకు ప్రయత్నాలు చేయడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని