logo

నాడు ఆశల కేంద్రం.. నేడు విధ్వంసానికి నిలయం

రాష్ట్ర విభజన తర్వాత తుళ్లూరు మండలంలో ప్రజా రాజధాని అమరావతి నిర్మాణానికి అంకురార్పణ జరిగింది.

Published : 18 Apr 2024 05:07 IST

అమరావతిపై కక్షగట్టిన వైకాపా ప్రభుత్వం
నమూనాలనూ వదలని అరాచక మూకలు

ఈనాడు, అమరావతి, న్యూస్‌టుడే, తుళ్లూరు: రాష్ట్ర విభజన తర్వాత తుళ్లూరు మండలంలో ప్రజా రాజధాని అమరావతి నిర్మాణానికి అంకురార్పణ జరిగింది. గత తెదేపా ప్రభుత్వంలో రాత్రీ పగలు తేడా లేకుండా వేల మంది కార్మికులతో కళకళలాడిన అమరావతి వైకాపా పాలనలో విధ్వంసానికి చిరునామాగా మారింది. అమరావతిపై కక్షగట్టిన వైకాపా ప్రభుత్వం అప్పటివరకు జరిగిన అభివృద్ధిని కొనసాగించకపోగా అర్ధంతరంగా ఆపేసింది. రూ.వేల కోట్ల విలువైన ప్రజల ఆస్తిని నిరుపయోగంగా మార్చింది. వేల మంది కార్మికులు పనిచేసిన ప్రాంతం పిచ్చిమొక్కలు, ముళ్లపొదలతో కళావిహీనంగా మారింది. వైకాపా అధికారంలోకి వచ్చిన తొలినాళ్ల నుంచే అమరావతిపై విషం కక్కింది. అయిదేళ్లుగా వైకాపా నాయకులు అమరావతిపై దమన కాండ సాగిస్తూనే ఉన్నారు.


నిరంతరం కుట్రలు..  కుతంత్రాలే..

అమరావతిని కాపాడుకోవడానికి రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన అన్నదాతలు పోరాటానికి దిగారు. రైతులు, మహిళలపై అక్రమ కేసులు, నిర్బంధాలతో హింసించారు. వారికి ఇవాల్సిన వార్షిక కౌలును సైతం సకాలంలో ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేశారు. రాజధాని బృహత్తర ప్రణాళికను విచ్ఛిన్నం చేయడానికి ముందస్తు ప్రణాళికతో వివిధ నగరాల అభివృద్ధికి కేటాయించిన భూములను ఇతర అవసరాలకు మళ్లించి దుర్మార్గానికి ఒడిగట్టింది. పేదలకు ఇళ్ల స్థలాల పేరుతో రాజధాని ప్రణాళికను విచ్ఛిన్నం చేసే కుట్రకు తెరలేపింది. రాజధాని రైతులు న్యాయస్థానాలకు వెళ్లి అడ్డుకోవాల్సి వచ్చింది. రాజధాని నిర్మాణానికి అవసరమైన భూముల సేకరణకు ఇచ్చిన ప్రకటనను వెనక్కి తీసుకోవడాన్ని రాజధాని రైతులు తప్పు పడుతున్నారు.


ఆస్తుల ధ్వంసం...  దోపిడీ

రాజధాని ప్రాంతంలో రూ.వేల కోట్లతో పనులు జరుగుతున్న సమయంలో రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అమరావతి పనులను అర్ధంతరంగా ఆపేయడంతో గుత్తేదారులు వెళ్లిపోయారు. అప్పటివరకు జరిగిన పనులు, తెచ్చిన సామగ్రిని అలాగే వదిలేసిపోవడం వైకాపా కార్యకర్తలు, నేతలకు వరంగా మారింది. ఇసుక, కంకర, ఇనుము, పైపులు, ఎలక్ట్రికల్‌ తీగలు ఇలా అన్ని రకాల సామగ్రిని దోపిడీ చేసి తీసుకెళ్లిపోయారు. అక్కడితో ఆగకుండా రోడ్డు తవ్వి మరీ కంకర, ఇతర సామగ్రి తరలించడం వారి అరాచకానికి నిదర్శనం. దీనిపై రైతులు పలుమార్లు ఫిర్యాదులు చేస్తే కేసుల నమోదుతోనే అధికార యంత్రాంగం సరిపెట్టింది.


జీర్ణించుకోలేక వికృత చేష్టలు..

రాజధాని ఎంత నాశనమైతే అంత కావాలన్నట్లు వైకాపా ప్రభుత్వం వ్యవహరించింది. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, వైకాపా నేతలు అనేక ఆరోపణలు చేశారు. సందర్భానుసారం అమరావతి రైతులను కించపరచడమే లక్ష్యంగా మాటల తూటాలు వదిలారు. ప్రభుత్వం ఎంత దారుణంగా వ్యవహరించినా రాజధాని ప్రాంత రైతులు అమరావతే తమ రాజధాని అని నినదించడాన్ని వైకాపా నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో ఎప్పటికప్పుడు రాజధానిలో ఏదో ఒక విధ్వంసానికి పాల్పడుతూ కక్ష తీర్చుకుంటున్నారు. ఇందులో భాగంగానే అమరావతి నమూనాలతో ఏర్పాటు చేసిన మినియేచర్‌ మ్యూజియాన్ని ధ్వంసం చేశారు. అక్కడ సామగ్రిని ధ్వంసం చేసిన తీరు చూస్తే వారు కక్షతో ఎంతగా రగిలిపోతున్నారో అక్కడి దృశ్యాలు నిదర్శనంగా నిలుస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని