logo

నేడే.. ఈనాడే..

2024 సాధారణ ఎన్నికలకు సంబంధించి కీలకమైన నామినేషన్ల దాఖల ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభం కానుంది.

Published : 18 Apr 2024 05:31 IST

ఎన్నికల ప్రకటన వెలువరింపు
హోరాహోరీకి ప్రధాన పార్టీల సై
నేటి నుంచి నామపత్రాల స్వీకరణ

కలెక్టరేట్‌(మచిలీపట్నం), న్యూస్‌టుడే: 2024 సాధారణ ఎన్నికలకు సంబంధించి కీలకమైన నామినేషన్ల దాఖల ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభం కానుంది. భారత ఎన్నికల సంఘం సాధారణ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్‌ మార్చి 16న విడుదల చేసినప్పటి నుంచి ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది. ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లాకు సంబంధించి ఎన్నికల ఫిర్యాదులు, మీడియా సర్టిఫికేషన్‌-మానిటరింగ్‌, మీడియా, వ్యయ నియంత్రణ, సువిధ అనుమతులకు సంబంధించిన విభాగాలు కలెక్టరేట్‌ ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. ఎన్నికలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసినట్లు కలెక్టర్‌ డీకే బాలాజీ ,జిల్లా ఎస్పీ నయీమ్‌ అస్మి తెలిపారు. 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటలతో నామినేషన్ల ప్రక్రియ పూర్తవుతుందని స్పష్టం చేశారు.

అభ్యర్థులూ.. జాగ్రత్త

పార్లమెంట్‌కు పోటీ చేసే అభ్యర్థులు ఫారం-2ఎ, అసెంబ్లీకి పోటీచేసే వారు ఫారం-2బి ద్వారా నామినేషన్లు దాఖలు చేయాలి. అభ్యర్థులందరూ నవీకరించిన ఫారం-26 అఫిడవిట్‌ను ఖాళీలు లేకుండా పూర్తి చేసి నామినేషన్‌ ప్రతంతో సమర్పించాలి. పోటీ చేసే అభ్యర్థి లేదా అతని ప్రతిపాదకుడు నామినేషన్‌ దాఖలు చేయవచ్చు. పార్లమెంట్‌కు పోటీ చేసే వారు రూ.25,000, అసెంబ్లీకి రూ.10,000 సెక్యూరిటీ డిపాజిట్‌ చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు తమ కులధ్రువీకరణ పత్రాల రుజువుతో పార్లమెంట్‌కు రూ.12,500, అసెంబ్లీకి రూ.5,000 డిపాజిట్‌ కట్టాలి. ఒక అభ్యర్థి గరిష్ఠంగా నాలుగు సెట్ల నామినేషన్‌ పత్రాలను ఒక్కసారి లేదా వేర్వేరుగా అందజేయవచ్చు. నామినేషన్‌ సమర్పించే ముందు రోజు అభ్యర్థి లేదా అతని ఏజెంట్‌ పేరు.. తెరిచిన బ్యాంకు ఖాతా వివరాలతో పాటు అభ్యర్థికి సంబంధించిన తాజా పాస్‌పోర్టు ఫొటోలు 10, స్టాంప్‌సైజ్‌ ఫొటోలు 5 అందజేయాలి. నామినేషన్ల ప్రక్రియ ముగిసే లోపు గుర్తించిన రాజకీయ పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు ఫారం-ఎ, ఫారం-బిలు ఇవ్వాలి. రిటర్నింగ్‌ అధికారి కార్యాలయాలకు 100 మీటర్ల పరిధి వరకూ మూడు వాహనాలు, కార్యాలయంలోకి ఐదుగురు అధీకృత వ్యక్తులను మాత్రమే అనుమతిస్తారు.

పార్లమెంట్‌, అసెంబ్లీ నియోజకవర్గాలకు గురువారం ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేస్తారు. అనంతరం ఫారం-1 ద్వారా ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేయడంతో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థ్ధులు 18వ తేదీ నుంచి ఈనెల 25వ తేదీ వరకూ సెలవు దినాల్లో మినహా మిగిలిన రోజుల్లో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 వరకూ నామినేషన్లు దాఖలు చేయాలి.

హెల్ప్‌డెస్క్‌లు..

నామినేషన్‌ పత్రాల స్వీకరణ సందర్భంగా అభ్యర్థులకు తగు సహాయ సహకారాలు అందించేందుకు వీలుగా హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేశారు. మచిలీపట్నం పార్లమెంట్‌ నియోజకవర్గానికి సంబంధించి కలెక్టరేట్‌లో, అసెంబ్లీ నియోజకవర్గాల పరంగా మచిలీపట్నానికి బందరు ఆర్డీవో కార్యాలయం, గుడివాడ ఆర్డీవో కార్యాలయం, అవనిగడ్డ, పెడన, పామర్రు, గన్నవరం, పెనమలూరులకు సంబంధిత తహసీల్దార్‌ కార్యాలయాల్లో హెల్ప్‌డెస్క్‌లు అందుబాటులో ఉంచారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని