logo

రుణాలు ఇవ్వం.. పథకాలు ఆపేస్తాం!

‘మేమంతా గుంతకల్లులో నివసిస్తున్నాం. పొదుపు సంఘంలో ఉన్నాం. చెత్తపన్ను కట్టాలని ఒత్తిడి తెస్తున్నారు.

Updated : 16 Dec 2022 05:05 IST

* బలవంతంగా చెత్తపన్ను వసూలు

* చెల్లించకపోతే బెదిరింపులు

‘మేమంతా గుంతకల్లులో నివసిస్తున్నాం. పొదుపు సంఘంలో ఉన్నాం. చెత్తపన్ను కట్టాలని ఒత్తిడి తెస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయని చెబుతున్నారు. కూలీ చేసుకుని జీవనం సాగించేవాళ్లం. ఇప్పటికే నిత్యావసరాలు పెరిగి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పుడు చెత్తపన్ను రూ.60 చెల్లించడం అదనపు భారం అవుతుంది. పన్ను చెల్లించకపోతే పొదుపు సంఘంలో ఉండొద్దని చెబుతున్నారు. రుణాలు రావని బెదిరిస్తున్నారు.

ఈనాడు డిజిటల్‌, అనంతపురం: పట్టణవాసుల నుంచి చెత్త పన్ను ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. చెల్లించని కుటుంబాలను గుర్తించి సంక్షేమ పథకాలు రద్దు చేస్తామని బెదిరిస్తున్నారు. కొన్నిచోట్ల ఇంకాస్త ముందుకెళ్లి సామాజిక పింఛన్లలో కోత విధించి పంపిణీ చేస్తున్నారు. మెప్మాలోని సభ్యులకు చెత్తపన్ను కడితేనే రుణాలు మంజూరు చేస్తామని తేల్చి చెబుతున్నారు. ఎక్కడికక్కడ సమావేశాలు ఏర్పాటు చేసి తీర్మానాలు సిద్ధం చేస్తున్నారు. ఈనెల 12 నుంచి 17 వరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అన్ని మున్సిపాలిటీల్లో వంద శాతం చెత్తపన్ను వసూలయ్యేలా చర్యలు తీసుకోవాలని కిందిస్థాయి సిబ్బందిపై ఒత్తిడి తెస్తున్నారు. మరోవైపు పలు వార్డులు, డివిజన్లలో అధికారపార్టీ నాయకులు అడ్డుకుంటున్నారు. తమకు రాజకీయంగా నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో సిబ్బందిని రానివ్వడం లేదు.

సాధారణ నిధుల నుంచి ..జగనన్న స్వచ్ఛ సంకల్పం పథకంలో భాగంగా అనంత నగరపాలికతోపాటు ఉమ్మడి జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు చెత్త సేకరణ వాహనాలను పంపిణీ చేశారు. ఒక్కో వార్డు సచివాలయ పరిధిలో ఒక వాహనం వినియోగించేలా ప్రణాళికలు వేశారు. ఇంకా కొన్ని వార్డులకు వాహనాలను పంపిణీ చేయాల్సి ఉంది. ఇప్పటివరకు పంపిణీ చేసిన వార్డుల్లో చెత్తపన్ను వసూలు చేస్తున్నారు. ఆ డబ్బుల నుంచే వాహనాల ఈఎంఐ చెల్లించాలని మున్సిపల్‌ శాఖ ఆదేశించింది. ప్రతినెలా ఒక్కో వాహనానికి రూ.62 వేలు చెల్లించాలి. ఒకవేళ ఈఎంఐకు సరిపడా చెత్తపన్ను వసూలు కాకపోతే సాధారణ నిధుల నుంచి చెల్లించాలి. అసలే నిధుల్లేక మున్సిపాలిటీలు ఇబ్బందులు పడుతున్నాయి.

వ్యతిరేకత వస్తున్నా..

చెత్తపన్నుపై అన్ని ప్రాంతాల నుంచి వ్యతిరేకత వస్తోంది. కొన్నిచోట్ల కౌన్సిలర్లు, కార్పొరేటర్లు కూడా తమ ప్రాంతంలో పన్ను వసూలు చేయవద్దంటూ అధికారుల్ని అడ్డుకుంటున్నారు. ఒకవైపు ప్రభుత్వం నుంచి లక్ష్యాలు, మరోవైపు స్థానిక నాయకుల నుంచి వ్యతిరేకత వస్తుండటంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. చేసేదిలేక వాలంటీర్లు, మెప్మా, ఆర్పీలతో బలవంతపు వసూళ్లకు పూనుకుంటున్నారు. అయినా ప్రజల నుంచి సానుకూలత రాకపోవడంతో సంక్షేమ పథకాలు రద్దు చేస్తామని బెదిరింపులకు దిగుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

పట్టణ పేదలపై భారం

ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరిస్తున్నందుకు నెలకు వినియోగ ఛార్జీల కింద రూ.60 వసూలు చేస్తున్నారు. మురికివాడల్లో మాత్రం రూ.30 పన్ను చెల్లించాలి. అపార్ట్‌మెంట్లలో స్థాయిని బట్టి రూ.200, హోటళ్ల నుంచి రూ.300 నుంచి రూ.1,000 వరకు చెల్లించాల్సి ఉంది. ఇప్పటికే పట్టణ ప్రజలపై వివిధ రూపాల్లో ఆర్థిక భారం ఎక్కువైంది. గ్యాస్‌ సిలిండర్‌, నిత్యావసరాల ధరలు, పెట్రోలు, డీజిల్‌, వంటనూనె ఇలా అన్ని రకాల వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. గతంతో పోలిస్తే నెలవారీ ఖర్చు వందశాతం పెరిగింది. వీటికితోడు ప్రభుత్వం చెత్తపన్ను భారం వేసిందని పట్టణవాసులు వాపోతున్నారు. ఏడాదికి రూ.720 నుంచి రూ.1,200 వరకు చెల్లించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పింఛను సొమ్ములో కోత

చెత్తపన్ను కడితేనే పింఛను ఇస్తామని చెబుతున్నారు. గత నెల రూ.60 వాలంటీరుకు చెల్లించా. పన్ను కడితేనే పొదుపు రుణాలు వస్తాయని చెబుతున్నారు. ప్రతి నెలా సొమ్ము కట్టించుకుంటున్నా పారిశుద్ధ్యం మాత్రం అధ్వానంగా ఉంది. ఇప్పటికే పెరిగిన ధరలతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాం. మాలాంటి పేదలు ఎలా బతకాలి. ప్రభుత్వం పునరాలోచించాలి. - సరోజమ్మ, మొదినాబాదు

పన్ను చెల్లించాల్సిందే

చెత్తపన్ను చెల్లించకపోతే పథకాలు రద్దు చేస్తామని చెబుతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదు. గత నెలలోనే విషయం మా దృష్టికి వచ్చినప్పుడు విచారణ జరిపాం. క్షేత్రస్థాయిలో మున్సిపల్‌ సిబ్బంది, వాలంటీర్లు బలవంతం చేయడం లేదు. నిబంధనల మేరకు చెత్త సేకరణ జరుగుతున్న కాలనీవాసులు పన్ను చెల్లించాల్సిందే.

 నాగరాజు, మున్సిపల్‌ ఆర్డీ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని