logo

నిబంధనలతో మిథ్య!

రాష్ట్ర ప్రభుత్వం పునఃప్రారంభించిన జగనన్న విదేశీ విద్య పథకం కొందరికే పరిమితమవుతోంది. పథకంలో భాగంగా విదేశాల్లో చదివే వారికి భారీ సాయం అందిస్తున్నట్లు ప్రభుత్వం చెబుతున్నా నిబంధన పేరుతో అర్హుల జాబితాలో కోత విధించారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Updated : 05 Feb 2023 05:07 IST

ఉమ్మడి జిల్లాలో ఐదుగురే ఎంపిక

పేద విద్యార్థులకు దక్కని అవకాశం

ఈనాడు డిజిటల్‌, అనంతపురం న్యూస్‌టుడే, రాణినగర్‌: రాష్ట్ర ప్రభుత్వం పునఃప్రారంభించిన జగనన్న విదేశీ విద్య పథకం కొందరికే పరిమితమవుతోంది. పథకంలో భాగంగా విదేశాల్లో చదివే వారికి భారీ సాయం అందిస్తున్నట్లు ప్రభుత్వం చెబుతున్నా నిబంధన పేరుతో అర్హుల జాబితాలో కోత విధించారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రపంచ ర్యాంకింగ్‌ కలిగిన విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం పొందిన వారికే పథకం వర్తిస్తుందన్న నిబంధనతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. దీంతో అనంతపురం నుంచి ఇద్దరు, శ్రీసత్యసాయి జిల్లా నుంచి ముగ్గురే ఎంపికయ్యారు. ఇందులో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వారు ఒక్కరూ లేకపోవడం గమనార్హం. గత ప్రభుత్వ హయాంలో పథకం ద్వారా విద్యార్థులకు రూ.కోట్లల్లో బకాయిలు చెల్లించాల్సి ఉంది. 2018-19, 2019-20 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి మూడు విడతల నిధుల్ని వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత పెండింగ్‌లో పెట్టింది. మూడున్నరేళ్ల అనంతరం విదేశీ విద్య పథకాన్ని తిరిగి ప్రారంభించినప్పటికీ బకాయిల విషయంపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.

రూ.2.50 కోట్ల బకాయి...

ఉమ్మడి అనంతపురం జిల్లాలో 2018-19లో 120 మంది విద్యార్థులకు పథకం వర్తింపజేశారు. ఇందులో ఎస్సీలు 16, ఎస్టీలు 25, బీసీలు 64, మైనారిటీలు 15 మంది ఉన్నారు. వీరితోపాటు అదే ఏడాది ఈబీసీ విద్యార్థులను ఎంపిక చేశారు. వీరికి గత ప్రభుత్వంలోనే విడతల వారీగా కొంత చెల్లించగా.. వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా నిలిపివేశారు. మైనారిటీలకు 2018-19లో రూ.75 లక్షలు, 2019-20లో రూ.35 లక్షలు చెల్లించాల్సి ఉంది. ఎస్సీలకు రూ.15 లక్షలు, ఎస్టీలకు రూ.10 లక్షలు, బీసీలకు రూ.1.15కోట్లు పెండింగ్‌లో ఉంచారు. మొత్తంగా ఉమ్మడి జిల్లా విద్యార్థులకు రూ.2.50 కోట్లు మేర మంజూరు చేయాల్సి ఉంది.

సడలిస్తేనే మేలు..

జగనన్న విదేశీ విద్య పథకంలో ప్రపంచ వ్యాప్తంగా ఒకటి నుంచి 200లోపు క్యూఎస్‌ ర్యాంకు కలిగిన విశ్వవిద్యాలయాల్లో సీటు సాధించిన విద్యార్థులకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుంది. ఒకటి నుంచి వంద లోపు ర్యాంకు ఉన్న విశ్వవిద్యాలయంలో ప్రవేశం పొందిన వారికి గరిష్ఠంగా రూ.కోటి వరకు వంద శాతం ఫీజు రీయింబర్స్‌ చేస్తారు. 101 నుంచి 200 వరకు ర్యాంకు కలిగిన వర్సిటీల్లో సీటు తెచ్చుకుంటే రూ.50 లక్షల అందిస్తారు. ఈ నిబంధన కారణంగా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన విద్యార్థులు అర్హత కోల్పోతున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఒకటి నుంచి 500 విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం పొందిన వారికి పథకాన్ని వర్తింపజేయాలనే డిమాండ్‌ వినిపిస్తోంది. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ వర్గాల్లోని పేద విద్యార్థులకు విదేశీ విద్య అందించాలనేది పథకం ఉద్దేశం. ఈ నేపథ్యంలో నిబంధనను సడలించి ఎక్కువ మంది అవకాశం కల్పించాలని విద్యార్థులు కోరుతున్నారు. తెదేపా ప్రభుత్వ హయాంలో అంబేడ్కర్‌ విదేశీ విద్య పథకం ఉండేది. ఏ విశ్వవిద్యాలయంలో చదివినా పథకాన్ని వర్తింపజేశారు. ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి దాదాపు 150 మంది దాకా విద్యార్థులు లబ్ధి పొందారు.

అప్పు తెచ్చి ఫీజు చెల్లించా..

మా అమ్మాయి రోషిత విదేశీ విద్య పథకం కింద కజకిస్తాన్‌లో ఎంబీబీఎస్‌ మూడో సంవత్సరం చదువుతోంది. ప్రభుత్వం ఇప్పటి దాకా ఒక్క రూపాయి ఇవ్వలేదు. ఫీజు చెల్లిస్తేనే భోజనం, పరీక్షకు అనుమతి ఇస్తున్నారు. పరీక్షలకు అనుమతి ఇవ్వకుండా చాలా ఇబ్బంది పెట్టారు. ఇప్పటి దాకా రూ.15లక్షల వరకు వడ్డీలకు తెచ్చి చెల్లించా. ఇంకా రూ.20లక్షలకు పైగానే అవుతుంది. ఫీజు ఇవ్వకుంటే వెళ్లిపోవాలంటూ బెదిరిస్తుండటంతో చదువు మధ్యలో ఆపేయాల్సి వస్తుందేమోననే భయం వెంటాడుతోంది. ఏమి చేయాలో పాలుపోవడం లేదు.

ఎమ్‌.ఆనందం, విద్యార్థిని తండ్రి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని