logo

YSRCP: బరిలో నిలిచేదెవరు? బలయ్యేదెవరు?.. వైకాపా ఎమ్మెల్యేల్లో గుబులు

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. క్షేత్రస్థాయిలో తీవ్ర ప్రజావ్యతిరేకతను మూటగట్టుకున్న అధికార వైకాపా నష్ట నివారణ చర్యలకు దిగుతున్నట్లు తెలుస్తోంది.

Updated : 13 Dec 2023 08:41 IST

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. క్షేత్రస్థాయిలో తీవ్ర ప్రజావ్యతిరేకతను మూటగట్టుకున్న అధికార వైకాపా నష్ట నివారణ చర్యలకు దిగుతున్నట్లు తెలుస్తోంది. సిట్టింగులను మార్చడం ద్వారా సొంత పార్టీ నాయకులు, కార్యకర్తల్లో ఉన్న వ్యతిరేకతను తగ్గించుకునే ప్రయత్నం చేస్తోంది. ఈక్రమంలో ఉమ్మడి అనంతపురం జిల్లాలోనూ ఆరుగురు ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో టికెట్‌ ఇవ్వకపోవడం.. లేదంటే మరో స్థానాన్ని కేటాయిస్తారన్న చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతోంది. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పనితీరు ఆధారంగానే టికెట్లు కేటాయిస్తామని గతేడాది ఎమ్మెల్యేల సమావేశంలో సీఎం జగన్‌ స్పష్టం చేశారు. ప్రస్తుతం పార్టీలో జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే ఎన్నికల్లో ఎంతమేరకు ఖర్చు పెట్టుకోగలరనే అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటున్నారనే ప్రచారం సాగుతోంది. సిట్టింగులకు విజయావకాశాలు లేవని ఐప్యాక్‌ ఇచ్చిన సర్వే ఆధారంగా మరికొందరిని మార్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.


సొంతపార్టీ వారే తిరుగుబాటు

మడకశిర ఎమ్మెల్యే తిప్పేస్వామికి వచ్చే ఎన్నికల్లో టికెట్‌ ఇవ్వొద్దని సొంత పార్టీ నాయకులే డిమాండ్‌ చేస్తున్నారు. మళ్లీ ఆయన్నే బరిలోకి దింపితే ఓడిపోవడం ఖాయమని అధిష్ఠానానికి తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేపై సొంతపార్టీ ప్రజాప్రతినిధులే తిరుగుబాటు చేయడంతో నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి నానాటికి దిగజారుతూ వస్తోంది. వైకాపా నాయకులే ఎమ్మెల్యేపై ఆవినీతి ఆరోపణలు చేయడం గమనార్హం. ఈ నేపథ్యంలో మరో వ్యక్తికి టికెట్‌ కేటాయించాలని పార్టీ పెద్దలు నిర్ణయం తీసుకున్నట్లు వైకాపాకు చెందిన కొందరు చెబుతున్నారు. తిప్పేస్వామిని బుజ్జగించడానికి ఇటీవల తితిదే పాలక మండలి సభ్యుడిగా నియమించారనే చర్చ నియోజకవర్గంలో జోరుగా జరుగుతోంది.


సిద్ధారెడ్డికి అనుమానమే..

కదిరి నియోజకవర్గంలో ముస్లిం ఓటర్లు అత్యధిక సంఖ్యలో ఉండటంతో ఆ వర్గానికే టికెట్‌ కేటాయించాలనే యోచనలో వైకాపా పెద్దలు ఉన్నారనే ప్రచారం సాగుతోంది. ఎమ్మెల్యే సిద్ధారెడ్డి నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్న పూల శ్రీనివాస్‌రెడ్డి టికెట్‌ ఆశిస్తున్నారు. హిందూపురంలో ఇక్బాల్‌ను మార్చడంతో వైకాపా నుంచి జిల్లాలో ముస్లింలకు ప్రాతినిథ్యం లేకుండా పోయింది. ఈనేపథ్యంలో ముస్లింలకు కేటాయిస్తారనే చర్చ నడుస్తోంది.


శింగనమలలో పోలీసు అధికారి?

ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతికి వచ్చే ఎన్నికల్లో టికెట్‌ కష్టమే అనే చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యే భర్త, రాష్ట్ర ప్రభుత్వ విద్యాసలహాదారు ఆలూరి సాంబశివారెడ్డి నియోజకవర్గంలో అంతా తానై వ్యవహరిస్తుండటం, సొంత సామాజికవర్గానికే ప్రాధాన్యత ఇవ్వడం వంటి కారణాలతో ప్రజల్లో అసంతృప్తి నెలకొంది. యల్లనూరు, పుట్లూరు మండలాల్లో సొంతపార్టీ నాయకుల నుంచే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈక్రమంలో ఈసారి కొత్తవారికి టికెట్‌ కేటాయించాలని అధిష్ఠానం భావిస్తోంది. చిత్తూరు జిల్లాలో పనిచేస్తున్న ఓ డీఎస్పీకి శింగనమల టికెట్‌ ఇస్తారనే ప్రచారం జోరందుకుంది.


శంకరనారాయణకు స్థానచలనం?

మాజీ మంత్రి, పెనుకొండ ఎమ్మెల్యే శంకరనారాయణను నియోజకవర్గంలోని ఓ సామాజికవర్గం నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. స్థానికేతరుడు కావడంతో ఆయనకు వచ్చే ఎన్నికల్లో టికెట్‌ ఇవ్వొద్దనే డిమాండ్‌ ఎక్కువగా వినిపిస్తోంది. ఎమ్మెల్యే సోదరులపై అవినీతి ఆరోపణల కారణంగా గోరంట్ల, పరిగి మండలాల్లో పరిస్థితి మరింత దిగజారిపోయింది. పెనుకొండ నుంచి కాకుండా హిందూపురం ఎంపీగా బరిలోకి దింపుతారని తెలుస్తోంది. ప్రస్తుత ఎంపీ గోరంట్ల మాధవ్‌ వ్యవహారశైలి కారణంగా ఆయనకు మళ్లీ అవకాశం ఇవ్వకపోవచ్చనే అభిప్రాయం పార్టీ వర్గాల నుంచే వస్తోంది.


రాయదుర్గం రంగయ్యకేనా..

రాష్ట్ర ప్రభుత్వ విప్‌, రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డికి ఈసారి టికెట్‌ ఇచ్చే అవకాశాలు కనిపించడం లేదు. వైకాపాలో వర్గపోరు, ఎమ్మెల్యే కుటుంబ సభ్యులపై అవినీతి ఆరోపణలు ఉన్న నేపథ్యంలో కొత్త వ్యక్తిని బరిలోకి దింపాలని అధిష్ఠానం ఆలోచిస్తోంది. రాయదుర్గంలో వాల్మీకులు అధిక సంఖ్యలో ఉండటంతో ఎంపీ రంగయ్యను అక్కడికి పంపాలనే ప్రతిపాదనల్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈనేపథ్యంలో కాపు రామచంద్రారెడ్డి డి.హీరేహాళ్‌కు చెందిన ఓ వాల్మీకి నాయకుడి పేరును పార్టీ పెద్దల ముందు ఉంచగా తిరస్కరించినట్లు తెలుస్తోంది.


గుంతకల్లులో మార్పు తప్పదా..

ఎమ్మెల్యే వై.వెంకట్రామిరెడ్డి కుటుంబంలో ఇప్పటికే ఐదుగురికి పదవులు ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో గుంతకల్లు టికెట్‌ మరో సామాజికవర్గానికి కేటాయించాలనే ఆలోచనలో పార్టీ ఉన్నట్లు సమాచారం. ఎమ్మెల్యే మాత్రం తన కుమార్తె నైరుతిరెడ్డికి టికెట్‌ ఇవ్వాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్యకాలంలో ఆమె రాజకీయ కార్యక్రమాలకు హాజరవుతుండటం గమనార్హం.

- ఈనాడు డిజిటల్‌, అనంతపురం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని