logo

భూగర్భ మురుగు కాలువ వ్యవస్థకు మోక్షమెన్నడు?

గుంతకల్లు మున్సిపాలిటీలో సమగ్ర భూగర్భ మురుగు కాలువల వ్యవస్థ ఏర్పాటుకు సంబంధించిన నివేదిక మూలనపడింది. పట్టణంలో రోడ్లు బాగున్నా.. సరైన కాలువలు లేకపోవడంతో మురుగు రోడ్లపై ప్రవహిస్తుంది.

Published : 28 Mar 2024 04:54 IST

ఐదేళ్ల వైకాపా పాలనలో గళమెత్తని పాలకులు
మూలనపడిన నివేదిక

గుంతకల్లు, గుత్తి, గుంతకల్లు గ్రామీణం, న్యూస్‌టుడే: గుంతకల్లు మున్సిపాలిటీలో సమగ్ర భూగర్భ మురుగు కాలువల వ్యవస్థ ఏర్పాటుకు సంబంధించిన నివేదిక మూలనపడింది. పట్టణంలో రోడ్లు బాగున్నా.. సరైన కాలువలు లేకపోవడంతో మురుగు రోడ్లపై ప్రవహిస్తుంది. కొన్నిచోట్ల కాలువలు సక్రమంగా లేకపోవడంతో రోడ్లు దెబ్బతింటున్నాయి. భూగర్భ మురుగు కాలువలు నిర్మించాలన్న లక్ష్యంతో తెదేపా ప్రభుత్వ హయాంలో రూ.50 లక్షల వరకు ఖర్చు పెట్టి ఇంజినీర్ల ద్వారా సర్వే చేయించి నివేదిక రూపొందించారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ నివేదిక మరుగునపడింది. ఐదేళ్లలో పాలకులు కనీసం గళమెత్తక పోవడం గమనార్హం.

రూ.283 కోట్లు అవసరం అని..

సమగ్ర మురుగు కాలువల నిర్మాణానికి రూ.283 కోట్లు ఖర్చు అవుతుందని ఇంజినీర్లు 2017 సంవత్సరంలో సర్వే చేసి నివేదిక రూపొందించారు. నిధులు కేటాయించాలని 2018లో మున్సిపల్‌ కౌన్సిల్‌లో తీర్మానాన్ని ఆమోదించి ప్రభుత్వానికి పంపారు. తరువాత తెదేపా ప్రభుత్వం అధికారాన్ని కోల్పోవడంతో నివేదిక మూలనపడింది. నిధులను ప్రభుత్వం నుంచి విడుదల చేయించుకోవడానికి తరువాత వచ్చిన మున్సిపల్‌ కౌన్సిల్‌ శ్రద్ధ చూపలేదు. చాలా కాలనీల్లో సరైన మురుగు కాలువలు లేని కారణంగా నీరు రోడ్లపై ప్రవహిస్తుంది. నీరు నిల్వ ఉంటుండటంతో ఒకవైపు దుర్వాసన.. మరోవైపు దోమల బెడదతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కాలువలను శుభ్రం చేయడానికి తగినంత మంది పారిశుద్ధ్య కార్మికులు లేని కారణంగా కొన్ని కాలువలు సంవత్సరాల తరబడి శుభ్రతకు నోచుకోలేక పోతున్నాయి.

  • కసాపురం గ్రామంలో రూ.2 కోట్లతో మురుగు కాలువలను నిర్మించి నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయానికి వచ్చే భక్తులు ఇబ్బందులు పడకుండా చూడాలని ప్రస్తుత ఎమ్మెల్యే రెండేళ్ల కిందట పనులకు భూమిపూజ చేశారు. ప్రభుత్వం నిధులు దారి మళ్లించడంతో పనులు చేపట్టలేదు.
  • గుత్తిలో సమగ్ర మురుగు కాలువల నిర్మాణం కోసం తెదేపా ప్రభుత్వ హయాంలో ఇంజినీర్లు సర్వే చేసి రూ.25 కోట్లకు నివేదికను ప్రభుత్వానికి పంపారు. తరువాత వచ్చిన ప్రభుత్వం నివేదికను గాలికొదిలేసింది.


నివేదిక బయటకు తీయిస్తాం

- భవానీ, మున్సిపల్‌ అధ్యక్షురాలు

సమగ్ర మురుగు కాలువల వ్యవస్థ ఏర్పాటుకు గతంలో ఇంజినీర్లు సర్వే చేసి నివేదికను ప్రభుత్వానికి పంపారనే విషయం తెలియదు. నివేదికను బయటకు తీస్తాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు మంజూరు చేయించుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకుంటాం. పట్టణంలో పూర్తిస్థాయిలో మురుగు కాలువలు నిర్మించాల్సిన అవసరం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని