logo

మరుగున మురుగు పారుదల వ్యవస్థ

పురపాలకలో డ్రైనేజీ వ్యవస్థ ప్రధానమైంది. అందుకే పారిశుద్ధ్యానికి ప్రాధాన్యమిస్తూ ప్రత్యేకంగా ప్రజారోగ్య విభాగంలో కార్మికుల ఏర్పాటుతో పరిసరాల శుభ్రతను పాటిస్తారు.

Published : 29 Mar 2024 04:14 IST

మంజూరు ప్రతిపాదనలకు మూడేళ్లు

సైదాపురంలోని ఓ వీధిలో కాలువ తీరు

కదిరి, న్యూస్‌టుడే: పురపాలకలో డ్రైనేజీ వ్యవస్థ ప్రధానమైంది. అందుకే పారిశుద్ధ్యానికి ప్రాధాన్యమిస్తూ ప్రత్యేకంగా ప్రజారోగ్య విభాగంలో కార్మికుల ఏర్పాటుతో పరిసరాల శుభ్రతను పాటిస్తారు. అందుకే ఎన్నికల్లో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేస్తాం. ఎక్కడా మురుగు కనిపించనివ్వం. దోమల సమస్య ఉండదు. సీజనల్‌ రోగాల సమస్య ఉండదు. తద్వారా ప్రజలకు ఆరోగ్యం, అందమైన పట్టణంగా మార్చుతామని ఎన్నికల అభ్యర్థులు వాగ్దానాలు చేయటం పరిపాటిగా మారింది. గత ఎన్నికల సందర్భంగా ప్రస్తుత శానససభ్యుడు సిద్ధారెడ్డి కూడా వాగ్దానం చేశారు. పట్టణంలోని అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ ఏర్పాటు చేస్తామని ప్రజలకు మాటిచ్చారు. ఏదో చేసేస్తామన్నట్లు హడావుడి చేశారు. పట్టణ వీధుల్లో భూగర్భంలో మురుగు కాల్వల నిర్మాణానికి ప్రైవేటు కంపెనీతో సర్వే చేయించారు. ఇప్పటికే మూడేళ్లు గడచిపోయింది. భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ ప్రతిపాదనలలోనే మురుగుతోంది. ప్రజలు మాత్రం ఎప్పట్లాగే మురుగు పారుతున్న వీధులు, దుర్వాసన, దోమల దాడితో రోగాల బారినపడి ఆర్థిక ఇబ్బందులు, అవస్థలతో కాలం గడుపుతున్నారు. ఐదేళ్లు అధికారమున్నా హామీలు పూర్తి చేయడంలో శ్రద్ధపెట్టని పాలకులు మళ్లీ ఎన్నికల్లో ఓట్ల కోసం వచ్చే అధికార పార్టీ అభ్యర్థిని నిలదీసేందుకు ప్రజలు సిద్ధమయ్యారు.

తప్పని తిప్పలు..

కదిరి పట్టణంలో మురుగు తీరని సమస్యగా మారింది. ఏటా అభ్యర్థులు ఎన్నికల వాగ్దానం చేయడం, హామీ అమలుకాకనే మళ్లీ ఎన్నికలు రావడం పరిపాటిగా మారింది. వాగ్దానం అమలు ప్రతిపాదనలతో మభ్యపెట్టారని ప్రజలు వాపోతున్నారు. మున్సిపాలిటీలో వలీసాబ్‌రోడ్డు, కల్లంగడి, జొన్నా, నల్లగుట్టవీధుల మీదుగా మురుగు ప్రధాన కాలువ ప్రవహిస్తోంది. వలీసాబ్‌రోడ్డులో డ్రైనేజీ రోడ్డుకు సమాంతరంగా మారింది. కల్లంగడివీధి, నల్లగుట్ట వీధుల్లోని కాల్వల్లో ప్లాస్టిక్‌, చెత్తాచెదారంతో తరచూ పొంగుతున్న పరిస్థితి. అంతేగాకుండా చిన్నపాటి వర్షం వచ్చినా ఇళ్లలోకి నీరుచేరి ఆయా ప్రాంతాల ప్రజలు అవస్థలు పడాల్సి వస్తోంది. ఇలాంటి సంఘటనలు పలుమార్లు జరిగి ఇబ్బందులు పడిన అనుభవం ప్రజలకు ఉంది. అందుకే భవిష్యత్తులో ఆ సమస్య మరోసారి ఎదురవకుండా పాలకులు దృష్టి సారించాలని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

పురపాలిక పరిధిలో..

లక్షమందికి పైగా జనాభా కలిగిన పట్టణంలో మురుగు సమస్య తీర్చేందుకు పురపాలిక అధికారులు మూడేళ్ల కిందటే శ్రీకారం చుట్టారు. 190 కి.మీ. మేర రూ.125 కోట్లతో భూగర్భ మురుగుకాల్వల నిర్మాణానికి అంచనాలు సిద్ధం చేశారు. దీంతో మంచి జరుగబోతోందని ప్రజలు సంతోషించారు. కానీ ప్రతిపాదనలు పంపామని చెప్పుకోవటం మినహా ఏమీ చేయలేకపోయారు. మున్సిపాలిటీకి వచ్చిన నిధులతో కాంట్రాక్టు పనులు చేసుకోవటానికే పరిమితమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వంతో కొట్లాడి నిధులు తీసుకురావడంలో కనీస ప్రయత్నం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు మూడేళ్లుగా మురుగుతూనే ఉంది. ఎన్నికల వాగ్దానంగా ఓటర్లను సొమ్ము చేసుకోవటం మినహా చిత్తశుద్ధి లోపించిందని ప్రజలు విమర్శిస్తున్నారు.


ప్రతిపాదనలు పంపాం

కదిరి మున్సిపాలిటీలో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ కోసం ప్రతిపాదనలు పంపాం. 190 కి.మీ.మేర రూ.125 కోట్లతో అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటుకు అంచనాలు పంపాం. పనులు మంజూరు చేయించి, నిధులు విడుదలపై ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లాం. ప్రస్తుతం సీడీఎంఏ వద్ద ప్రతిపాదనలకు పరిపాలనా అనుమతుల మంజూరు పెండింగ్‌లో ఉంది.  

విజయకుమార్‌, మున్సిపల్‌ డీఈఈ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని