logo

టింకరింగ్‌ చేస్తేనే..

వీరు సోమల మండలం కందూరు జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు వారంలో రెండ్రోజులు అటల్‌ టింకరింగ్‌ ల్యాబ్‌ను ఉపయోగించుకుంటున్నారు.

Published : 29 Nov 2022 02:16 IST

టీచర్లకు శిక్షణ కరవు
అటల్‌ ల్యాబ్‌లను వీడని గ్రహణం

పాఠశాల స్థాయి నుంచి విద్యార్థులను రేపటి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నీతి ఆయోగ్‌లో భాగంగా అటల్‌ టింకరింగ్‌ ల్యాబ్‌ల(ఏటీఎల్‌)ను ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఏర్పాటు చేసింది.. 21వ శతాబ్దపు నైపుణ్యాలతో సృజనాత్మక ఆవిష్కరణలను సాంకేతిక సహకారంతో రూపొందించి యువతను శక్తిమంతులను చేయడమే ఈ ఏటీఎల్‌ ముఖ్యోద్దోశం.. అయితే ఉపాధ్యాయులకు సరైన శిక్షణ నేటికీ ఇవ్వకపోవడంతో విద్యార్థులకు మార్గదర్శనం చేసేవారు కరవయ్యారు.. తుదిగా ఎంతో ఉన్నత ఆశయానికి అడుగుడుగునా తూట్లుపడుతున్నాయి.

చిత్తూరు పీసీఆర్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రోబో తయారుచేసి

విద్యార్థులకు ప్రయోగాత్మకంగా వివరిస్తున్న ఉపాధ్యాయుడు

వీరు సోమల మండలం కందూరు జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు వారంలో రెండ్రోజులు అటల్‌ టింకరింగ్‌ ల్యాబ్‌ను ఉపయోగించుకుంటున్నారు. వారి ఆలోచనలకు ఉపాధ్యాయుల సహకారం తోడై కొత్త ఆవిష్కరణలు రూపుదిద్దుకుంటున్నాయి. కార్యాలయాలు, గృహాలో గేటు తెరవడానికి అక్కడికి వెళ్లకుండా సెన్సార్‌ పరికరాన్ని వీరు రూపొందించారు. గృహాల్లో లైట్లు, ఫ్యాన్‌ సౌండ్‌ సిస్టమ్‌తో ఆఫ్‌ చేయడం తదితర పరికరాలు అందుబాటులోకి తెచ్చారు.

చిత్తూరు విద్య, న్యూస్‌టుడే: జిల్లాలోని 31 మండలాల్లో 20 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 2020లో అటల్‌ టింకరింగ్‌ ల్యాబ్‌లు ఏర్పాటు చేశారు. కొవిడ్‌ అనంతరం వీటిని ఇప్పుడిప్పుడే వినియోగిస్తు న్నారు. విద్యార్థులచే ప్రయోగాలు చేయిస్తూ నాలెడ్జ్‌ ఎకానమీగా ఎదిగేలా చేయాలనేది లక్ష్యం. చక్కటి వాతావరణంలో పనిచేయడానికి, నేర్చుకోవడానికి అనువుగా వీటిని రూపొందించారు. సైన్స్‌ ప్రయోగ శాలలు, డీసీఆర్‌, వీసీఆర్‌లను వినియోగంలోకి తెచ్చి నిర్దేశిత ప్రణాళిక ప్రకారం విద్యార్థులకు మార్గ దర్శనం చేయాలి. జిల్లా హబ్‌గా చిత్తూరు పీసీˆఆర్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఏర్పాటు చేయగా.. స్పోక్‌ ఏటీఎల్‌-1 గా జడ్పీ ఉన్నత పాఠశాల కందూరు(సోమల మండలం), స్పోక్‌ ఏటీఎల్‌-2గా శ్రీపరమహంస యోగానంద పాఠశాల(శాంతిపురం), స్పోక్‌ ఏటీఎల్‌-3గా జడ్పీ ఉన్నత పాఠశాల (కీలపట్ల, గంగవరం మండలం), స్పోక్‌ ఏటీఎల్‌-4గా ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ బాలికల పాఠశాల (గంగాధరనెల్లూరు), స్పోక్‌ ఏటీఎల్‌-5గా ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ బాలికల పాఠశాల(పూతలపట్టు) వ్యవహరి స్తున్నాయి. వీటిని మరింత బలోపేతం చేసేలా ప్రణాళిక రూపొందించారు.

శిక్షణ ఎన్నటికీ?

ల్యాబ్‌ వినియోగం, విద్యార్థులకు ప్రయోగాత్మకంగా బోధించాల్సిన ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడంలో నిర్లక్ష్యం కనిపిస్తోంది. కొవిడ్‌ కారణంగా రెండేళ్లు మూతపడిన ఇవి ఈ ఏడాది జులై నుంచి అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటివరకు సైన్స్‌ టీచర్లకు గాని ఇతర సబ్జెక్టు ఉపాధ్యాయులకు వీటి వినియోగం, బోధనపై శిక్షణ ఇవ్వలేదు. వారంలో రెండు, మూడ్రోజులు ఈ ల్యాబ్‌లోకి వెళ్లి విద్యార్థులు ప్రయోగం చేయాలి. ఆ సమయంలో సందేహాలు వస్తే ఉపాధ్యాయులు నివృత్తి చేయాలి. విద్యార్థులు ఉత్సాహంగా ల్యాబ్‌కి వెళ్లి వినూత్న ప్రయోగాలు చేస్తున్నారు. అయితే ఆధునిక సాంకేతికతతో రూపొందించిన ప్రయోగాలేవీ ఇక్కడ కనిపించడం లేదు. వీటిని రూపొందించాలంటే ఉపాధ్యాయులకు విధిగా శిక్షణ అవసరం. ఇందుకు ఎస్‌సీఈఆర్‌టీ ఆధ్వర్యంలో నిష్ణాతులచే ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాలి. అసలు శిక్షణ లేకపోవడంతో భావి శాస్త్రవేత్తలను తీర్చిదిద్దటం సాధ్యమేనా అనే సందేహం కలగకమానదు.

ఉపాధ్యాయులకు శిక్షణ ఇప్పిస్తాం..

అటల్‌ టింకరింగ్‌ ల్యాబ్‌లను ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. దేశానికి అవసరమైన శాస్త్రవేత్తలను పాఠశాల స్థాయి నుంచే తయారు చేసేందుకు టైం టేబుల్‌ రూపొందించుకుని ప్రయోగత్మకంగా బోధించేందుకు ఇవి ఉపకరిస్తాయి. త్వరలో ఉపాధ్యాయులకు శిక్షణ తప్పక ఇప్పిస్తాం.

విజయేంద్రరావు, డీఈవో

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని