logo

పుంగనూరు ఘటనలో ఇరువర్గాలపై కేసులు: డీఎస్పీ

స్థానిక కొత్తఇండ్లులోని పారిశ్రామికవేత్త రామచంద్రయాదవ్‌ ఇంటిపై ఆదివారం రాత్రి జరిగిన దాడికి సంబంధించి 19 మంది వైకాపా నాయకులపై కేసులు నమోదు చేశామని పలమనేరు డీఎస్పీ సుధాకర్‌రెడ్డి తెలిపారు.

Updated : 07 Dec 2022 05:24 IST

సమావేశంలో మాట్లాడుతున్న డీఎస్పీ సుధాకర్‌రెడ్డి, పక్కన సీఐలు గంగిరెడ్డి, మధుసూదనరెడ్డి

పుంగనూరు, న్యూస్‌టుడే: స్థానిక కొత్తఇండ్లులోని పారిశ్రామికవేత్త రామచంద్రయాదవ్‌ ఇంటిపై ఆదివారం రాత్రి జరిగిన దాడికి సంబంధించి 19 మంది వైకాపా నాయకులపై కేసులు నమోదు చేశామని పలమనేరు డీఎస్పీ సుధాకర్‌రెడ్డి తెలిపారు. మంగళవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. రామచంద్రయాదవ్‌ అనుమతి లేకుండా పట్టణంలో ర్యాలీ నిర్వహించడం, అంబేడ్కర్‌ కూడలిలో ప్రజలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడంతో కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు. విచారణలో లభించే ఆధారాలను బట్టి చర్యలు తీసుకుంటామని తెలిపారు. సదుంలో రైతు భేరికి అనుమతి ఇవ్వలేదనడం అవాస్తవమన్నారు. మొదట నవంబరు 28న సదుం బస్టాండులో రైతు భేరి పెట్టుకుంటామని దరఖాస్తు చేసుకోగా రద్దీగా ఉండే ప్రాంతం, పోలీస్‌ యాక్ట్‌ అమల్లో ఉందని.. ఈ నెల 4కు మార్చుకున్నారన్నారు. ఈ నెలాఖరు వరకు పోలీస్‌ యాక్ట్‌ అమల్లో ఉంటుందని తెలపడంతో వారు కోర్టుకు వెళ్లారన్నారు. కోర్టు ఆదేశాల మేరకు బస్టాండులో కాకుండా వేరే స్థలంలో పెట్టుకోవడానికి ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే ఎక్కడ పెట్టుకుంటారనేది స్పష్టంగా తెలపాలని సూచించామన్నారు. వారు కావమ్మ ఆలయ ఆవరణలో పెట్టుకుంటామని తమ దృష్టికి తెస్తే, ఆలయం తరఫునగాని, రెవెన్యూ అధికారుల నుంచి అనుమతి తీసుకొస్తే అంగీకరిస్తామని తెలిపామన్నారు. ఐతే వాటిని పాటించకుండా రామచంద్రయాదవ్‌ రైతు భేరి సదుంలోనే నిర్వహిస్తామని సెల్ఫీ వీడియో ద్వారా మీడియాకు సమాచారం ఇచ్చారన్నారు. జనాన్ని సమీకరించి సదుంకు బయలుదేరడానికి యత్నించడంతో శాంతిభద్రతల దృష్ట్యా ఇక్కడే ఆపామన్నారు. గంటపాటు కారులో కూర్చోని స్టార్ట్‌ చేయడం, హారన్‌ కొట్టడంతో ఆపేయాల్సి వచ్చిందన్నారు. తర్వాత అనుమతి లేకుండా అంబేడ్కర్‌ కూడలి వరకు ర్యాలీగా వచ్చారన్నారు. ఈ ఘటనల్లో సమగ్రంగా విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. రామచంద్రయాదవ్‌ ఇంటిపై దాడి జరుగుతున్నా పోలీసులు స్పందించడంలేదనడం అవాస్తవమన్నారు. స్థానిక ఎస్సై మోహన్‌కుమార్‌ నిమిషాల వ్యవధిలో ఘటన స్థలానికి చేరుకున్నారన్నారు. తర్వాత చౌడేపల్లె నుంచి సీఐ మధుసూదనరెడ్డి వచ్చి రామచంద్రయాదవ్‌ ఇంటి వద్ద గుంపును చెదరగొట్టారన్నారు. సమావేశంలో సీఐలు గంగిరెడ్డి, మధుసూదనరెడ్డి పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని