logo

విద్యార్థిని మిస్బా మృతి కేసులో అధికారుల అలసత్వం

పట్టణంలోని ప్రైవేటు పాఠశాల విద్యార్థి మిస్బా ఆత్మహత్య కేసులో అధికారులు అలసత్వం ప్రదర్శించారని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఫరూక్‌ షుబ్‌లి ఆరోపించారు.

Published : 29 Jan 2023 04:41 IST

మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడి ఆరోపణ

పలమనేరు, న్యూస్‌టుడే: పట్టణంలోని ప్రైవేటు పాఠశాల విద్యార్థి మిస్బా ఆత్మహత్య కేసులో అధికారులు అలసత్వం ప్రదర్శించారని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఫరూక్‌ షుబ్‌లి ఆరోపించారు. ఆ మేరకు ఆయన విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్‌కు ఫిర్యాదు పంపారు. ఆ కాపీని ఇక్కడ విడుదల చేశారు. 2022 మార్చి నెలలో మిస్బా అనే 10వ తరగతి విద్యార్థి పాఠశాలలో ఒత్తిడి కారణంగా ఆత్మహత్య చేసుకున్న సంగతి విదితమే. అప్పట్లో ఈ సంఘటనపై ఆందోళనలు, నిరసనలు వెల్లువెత్తాయి. పాఠశాలను తన కుటుంబ సభ్యుల పేరుతో నడుపుతున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు రమేష్‌పై జిల్లా అధికారులు ఉదాసీనంగా వ్యవహరించారని ఆరోపించారు. పాఠశాలలో అతని ప్రమేయం ఎక్కువగా ఉన్నట్లు అప్పట్లో చేపట్టిన విచారణలో వెల్లడైందన్నారు. ఈ సంఘటన అనంతరం కొంతకాలం సస్పెండ్‌ అయిన ఉపాధ్యాయుడికి గంగవరం ప్రధాన పాఠశాలలో మళ్లీ పోస్టింగ్‌ ఇవ్వడంపై తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఈ విషయంలో విద్యాశాఖలో ఉపాధ్యాయుడికి అధికారులు అండగా నిలబడ్డారని పేర్కొన్నారు. అత పెద్ద సంఘటనకు కారకుడైన ఉపాధ్యాయుడిని మళ్లీ అక్కడే పోస్టింగ్‌ ఇవ్వడం వెనుక ఆంతర్యం ఏమని ప్రశ్నించారు. దీనిపై సమగ్రంగా విచారణ చేపట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని