logo

ఈ సమస్య తీరనిది..?

నగరి పట్టణంలో నిత్యం ట్రాఫిక్‌ పద్మవ్యూహంలో ప్రజలు చిక్కుకుని సతమతం కావల్సిందే. పేరుకు పురపాలక సంఘం.

Published : 27 Mar 2023 03:25 IST

అవస్థల్లో ప్రజలు

పళ్లిపట్టురోడ్డులో నిత్యం అస్తవ్యస్తంగా..

న్యూస్‌టుడే, నగరి: నగరి పట్టణంలో నిత్యం ట్రాఫిక్‌ పద్మవ్యూహంలో ప్రజలు చిక్కుకుని సతమతం కావల్సిందే. పేరుకు పురపాలక సంఘం. ఒకవైపు నియోజకవర్గం కేంద్రం, మరోవైపు ఆర్డీవో, డీఎస్పీ, వ్యవసాయ శాఖ ఏడీ కార్యాలయాలకు నెలవు. మరి ఇంతమంది అధికారులు ఉన్నా.. పట్టణంలో ప్రజలు సాఫీగా రాకపోకలు సాగించడానికి  అడుగడుగునా ఆటంకాలే.. నిత్యం అస్తవ్యస్త వాహనాల రద్దీతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ప్రధానంగా పట్టణం నుంచి వెళ్లే పళ్ళిపట్టు రోడ్డులో ట్రాఫిక్‌ నియంత్రించే వారే లేరు. కారణం రోడ్డుకు ఇరువైపులా ఆక్రమణలతో ఇరుగ్గా మారడమే. దీంతో కనీసం నడిచి వెళ్ళే పరిస్థితి లేదు. ఒకవైపు అనుమతిలేని దుకాణాలు, మరోవైపు ఆక్రమణలు, సన్‌షెడ్‌లతో రోడ్డుపైకి చొచ్చుకొచ్చే దుకాణాలు. మధ్యలో వాహనాల రాకపోకలు సాగాలంటే అసాధ్యం.

కనిపించని క్రమబద్ధీకరణ..

పురపాలక సంఘ పరిధిలో రహదారులు, కాలువలు పూడ్చేసి దుకాణాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. సంబంధింత అధికారులు కనీస చర్యలు చేపట్టకపోవడంతో కాలువలపై శాశ్వత నిర్మాణాలు చేపడుతు న్నారు. మరోవైపు సంత మైదానం పక్కన రోడ్డు వెంట మూడంచల దుకాణాలు అనుమతిలేనివి ఇష్టానుసారంగా ఉన్నాయి. కనీసం ద్విచక్రవాహనాల పార్కింగ్‌ ప్రదేశం లేక రోడ్డుపైనే నిలిపివేస్తు న్నారు. ఇన్ని అవరోధాలను ఛేదించుకుని వాహనాలు రాకపోకలు సాగాలంటే నరకయాతనే. మున్సిపల్‌, పోలీసు శాఖ సమన్వయంతో క్రమబద్ధీకరణ చర్యలు చేపట్టకపోవడంతో ఎవరికి వారు యమునా తీరేగా వదిలేశారు. ఫలితంగా ప్రజల బాధలు చెప్పనలవికావు.

విద్యాలయాలకు వెళ్లాలంటే తిప్పలే..

నగరి బస్టాండ్‌ నుంచి ఏకాంబరకుప్పం వరకు పళ్లిపట్టురోడ్డులో నాలుగు ఉన్నత పాఠశాలలు, ఒక మహిళా జూనియర్‌ కళాశాల, నాలుగు ప్రాథమిక పాఠశాలలు, ఒక భవిత కేంద్రం, అర్బన్‌ ఆరోగ్య కేంద్రం, వ్యవసాయశాఖ డివిజన్‌ కార్యాలయాలు ఉన్నాయి. ఈ రోడ్డులో ఉదయం, సాయంత్రం విద్యార్థులు, చిన్నారులు పాఠశాలలకు వెళ్లాలంటే ఈ ట్రాఫిక్‌ పద్మవ్యూహాన్ని దాటాలి. నిత్యం తల్లిదండ్రులు చిన్నారులను పాఠశాలలకు పంపడానికి తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా శుక్రవారం వారపు సంత రోజున ఈ రోడ్డులో నడిచి వెళ్లటం చాలా కష్టమే. సంబంధింత అధికారులు చర్యలు చేపట్టి ట్రాఫిక్‌ సమస్యని పరిష్కరించాలి.

పుదుపేట మలుపు వద్ద ట్రాఫిక్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని