logo

జగన్‌.. పన్నుతో వేధించెన్‌

వైకాపా ప్రభుత్వం తెచ్చిన మూలధన విలువ ఆధారిత(సీవీ) ఆస్తిపన్ను విధింపుతో పట్టణ ప్రాంత భవనాలు, ఇళ్ల యజమానులపై మోయలేని భారం పడింది.

Published : 10 May 2024 03:07 IST

సీవీ విధానంతో ఆస్తిపన్ను పెంపు
మధ్యతరగతి ప్రజలపై మోయలేని భారం\

నగరపాలక కార్యాలయం

చిత్తూరు నగరంలోని సుందరయ్యర్‌ వీధిలోని ఓ వాణిజ్య భవనానికి ఏఆర్‌వీ విధానం ద్వారా ఆరు నెలలకు రూ.74,185 ఆస్తిపన్ను చెల్లిస్తుండగా.. సీవీ విధానం అమలుతో ఈ పన్ను రూ.87,947కు పెరిగింది. ఏకంగా రూ.13,762 పెరిగింది. ఏడాదికి రూ.27,524 అదనంగా చెల్లించాలి. పన్ను పెరుగుదలతో యజమాని ఖంగుతిన్నారు.

న్యూస్‌టుడే, చిత్తూరు నగరం, పుత్తూరు, నగరి: వైకాపా ప్రభుత్వం తెచ్చిన మూలధన విలువ ఆధారిత(సీవీ) ఆస్తిపన్ను విధింపుతో పట్టణ ప్రాంత భవనాలు, ఇళ్ల యజమానులపై మోయలేని భారం పడింది. గతంలో సాంవత్సరిక అద్దె విలువ(ఏఆర్‌వీ) విధానంతో పన్ను వసూలు చేస్తుండగా.. దీని స్థానంలో మూలధన విలువ ఆధారిత పన్ను విధించడంతో ప్రజలపై భారం తడిసి మోపెడైంది. చిత్తూరు నగరం, పుత్తూరు, నగరి మున్సిపాల్టీల పరిధిలో ఆస్తిపన్ను అసెస్‌మెంట్లు 66,454 ఉన్నాయి. మూలధన విలువ ఆధారిత ఆస్తిపన్ను విధింపు కారణంగా రూ.30 కోట్ల మేర భారం ప్రజలపై పడింది. ఈ ఏడాది మార్చిలో డిమాండ్‌ నోటీసులు జారీ చేయడంతో పెరిగిన మొత్తాన్ని చెల్లించలేక భవన యజమానులు గగ్గోలు పెట్టారు. ప్రభుత్వ నిర్ణయాలతో సొంతిల్లు విక్రయిం చుకుని అద్దె ఇంట్లో ఉండటమే ఉత్తమమని నగరవాసులు చెబుతున్నారు. గతేడాది రిజిస్ట్రేషన్‌, స్టాంపుల శాఖ సైతం పట్టణాలు, నగరాల్లో భవనాలు, స్ట్రక్చర్‌ విలువ పెంచిన ప్రభావం ఆస్తిపన్నుపై పడటంతో పన్నులు అమాంతం పెరిగాయి.


ప్రజల నడ్డి విరిచారు..

వైకాపా ప్రభుత్వం ఆస్తిపన్ను పెంచి సామాన్యుల నడ్డి విరిచింది. నిధులన్నీ వివిధ పథకాలకు మళ్లించి పన్ను పెంపుదల రూపేణా ప్రజలపై భారాన్ని మోపడం సబబు కాదు. పేద, మధ్యతరగతి ప్రజలకు ఆస్తిపన్ను పెంపుదల ఓ శరాఘాతం.

అట్లూరి శ్రీనివాసులు, చిత్తూరు


వైకాపాకు ప్రజలు బుద్ధి చెబుతారు..

సాధారణ ప్రజలపై వివిధ రకాల పన్ను భారాన్ని మోపే ఏ ప్రభుత్వమైనా ప్రజల మన్నన పొందదు. నిత్యావసర వస్తువులు, గ్యాస్‌, పెట్రోలు ధరల్ని పెంచిన వైకాపా ప్రభుత్వం.. అనేక రూపాల్లో ప్రజల రక్తం తాగుతోంది. పన్నుల పేరుతో ప్రజల నుంచి వసూలు చేసిన వైకాపా ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెబుతారు.

యువరాజులు, చిత్తూరు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని