logo

ప్రజలు ఎలాపోతే మనకేంటి..?

నగర ప్రజలకు ఆహ్లాదాన్ని కల్పించడానికి నిర్దేశించిన కట్టమంచి చెరువు పర్యాటక ప్రాజెక్టు అమలును వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వదిలేసింది..

Published : 10 May 2024 03:10 IST

చెరువు ప్రాజెక్టు బుట్టదాఖలు
ఐదేళ్లుగా దృష్టిపెట్టని వైనం
అమలులో వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం

కట్టమంచి చెరువు

న్యూస్‌టుడే, చిత్తూరు నగరం: నగర ప్రజలకు ఆహ్లాదాన్ని కల్పించడానికి నిర్దేశించిన కట్టమంచి చెరువు పర్యాటక ప్రాజెక్టు అమలును వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వదిలేసింది.. ప్రజలకు సంబంధించిన వ్యవహారం కదా.. వాళ్లు ఎలా పోతే మనకేంటి అన్న రీతిన వ్యవహరించింది.. ఫలితంగా సగటు నగరవాసికి ఆహ్లాదం ఆవిరిగా మారింది.. గత ప్రభుత్వ హయాంలో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రణాళిక రూపొందించినా.. వైకాపా అధికారంలోకి వచ్చిన తరవాత అసలు ఈ ప్రాజెక్టు గురించి పట్టించుకోనే లేదు.. దీంతో చిత్తూరు నగరవాసులు కాసింత ఆహ్లాదం కోసం వేకళ్ల ఎదురుచూస్తున్నారు.. ఈ ప్రాజెక్టు ఎప్పుడు పట్టాలెక్కుతుందా అని ఆశగా వేచిఉన్నారు.
చిత్తూరు నగరం నడిబొడ్డున 13.84 ఎకరాల విస్తీర్ణంలో కట్టమంచి చెరువు విస్తరించి ఉంది. గతంలో వందల ఎకరాల ఆయకట్టు భూములకు ఈ చెరువు నీరు ఉపయోగపడింది. కాలక్రమేణా సప్లై ఛానళ్లు మూసుకుపోవడంతో వ్యవసాయ అవసరాలకు పూర్తిగా దూరమైంది. ఈ నేపథ్యంలో చెరువును అహ్లాదకర ప్రాంతంగా తీర్చిదిద్ది నగర ప్రజలకు అందుబాటులో పెట్టడానికి తెదేపా ప్రభుత్వ హయాంలో నగరపాలక సంస్థ ఓ బృహత్తర ప్రణాళిక రూపొందించింది. కట్టమంచి చెరువు సుందరీకరణకు నగరపాలక సంస్థ రూ.2.6 కోట్లతో రూపొందించిన ప్రణాళికను.. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరవాత అసలు పట్టించుకోలేదు. ఆ ప్రతిపాదనను పూర్తిగా బుట్టదాఖలు చేసింది. చెరువు కట్ట ఆధునికీకరణ, పాదచారుల కోసం టైల్స్‌తో ప్రత్యేక రహదారి, మొక్కల పెంపకం, సిమెంటు బల్లల నిర్మాణం ఈ ప్రణాళికలో రూపొందించారు. దీంతోపాటు చెరువు చుట్టూ రెయిలింగ్‌, విద్యుత్తు దీపాల ఆధునికీకరణ, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు వేదిక నిర్మాణం తదితర అభివృద్ధి పనులతో ప్రణాళిక రూపొందించినా వీటిలో కొన్ని పనుల్ని మాత్రమే గత ప్రభుత్వంలో పూర్తిచేయాల్సి వచ్చింది.

అంతా నిరుత్సాహమే..

ఈ ప్రధాన ప్రాజెక్టు అమలుకు నోచుకోక పోవడంతో నగర ప్రజలు పెదవి విరుస్తున్నారు. ఆయా పనులు పూర్తయితే హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌ తరహాలో నగర ప్రజలకు కట్టమంచి చెరువు ఆహ్లాదాన్ని పంచే అవకాశం ఉంది. అయితే ఇప్పటివరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ చెరువు సుందరీకరణ పనులు ఆపరాదని నగరపాలక, నీటిపారుదల శాఖల అధికారులకు గతంలో కలెక్టర్‌గా పనిచేసిన ప్రద్యుమ్న ఆదేశించారు. అయినా ఇందుకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి చర్యలు ప్రారంభించ లేదు. అప్పట్లో చెప్పిన కలెక్టర్‌ ఇప్పుడు లేడు. పైగా దానిగురించి నగరవాసులు నోరెత్తి అడగలేరు. ఇక దీన్ని మనమెందుకు చేయాలనే తరహాలో వైకాపా సర్కారు చేతులెత్తేసింది.  పన్నుల వసూలుపై ఉన్న శ్రద్ధ కనీసం ప్రజలకు సేవలు అందించడంలో నగరపాలక సంస్థకు లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేసవిలో తామెక్కడికి వెళ్లాలని వాపోతున్నారు.  అభివృద్ధి పనులను ప్రారంభించి విహార అనుభూతిని కలిగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

చెరువు కట్ట అభివృద్ధికి రూపొందించిన నమూనా


చెరువును అభివృద్ధి చేయాలి..

నగరంలో ప్రధాన నీటి వనరుగా ఉన్న కట్టమంచి చెరువును అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ చక్కటి ఆహ్లాదకర వాతావరణం తీర్చిదిద్దాలి. తద్వారా ప్రజలకు ఓ కొత్త అనుభూతి కల్పించాలి. జిల్లా కేంద్రంలో ప్రజలు ప్రశాంతంగా సేద దీరే ప్రాంతాలు తక్కువగా ఉన్నాయి. తిరుపతి నగరంతో సమానంగా చిత్తూరును అన్ని విధాలా అభివృద్ధి చేయడానికి ప్రజాప్రతినిధులు సహకరించాలి.

లోచన్‌, చిత్తూరు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని