logo

నమ్మించడం.. వంచించడం.. ఇదే జగన్‌ నైజం

రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత ఉండాలని విపక్ష నేత హోదాలో జగన్‌ పదేపదే నాయకులకు హితబోధ చేశారు. అవి లేనప్పుడు అటువంటి నేతలను ఇంటికి పంపాలని కూడా ఆయనే సెలవిచ్చారు.

Updated : 10 May 2024 05:58 IST

విపక్ష నేత హోదాలో ఇచ్చిన హామీలు నెరవేర్చని వైనం
మరోసారి ఓటర్లను మోసగించేందుకు పుత్తూరు పర్యటన

నాటి మాటలు 

‘మీ అండదండలతోనే సుదీర్ఘ పాదయాత్ర చేశా. నేను వెళ్తున్న దారి పొడవునా ఎంతోమందిని కలిశా. వారి సాధక బాధలు విన్నా. ఐదేళ్ల పాలనలో పడిన ఇబ్బందులు చూశా. మీ అందరికీ నేను ఒక్కటే చెప్పదలచుకున్నా. నేను విన్నాను.. నేను ఉన్నాను.. మన పార్టీ అధికారంలోకి రాగానే సహకార చక్కెర కర్మాగారాలను తిరిగి తెరిపిస్తా. గాలేరు- నగరి సుజల స్రవంతిని పరుగులు తీయిస్తా’

ప్రతిపక్ష నాయకుడి హోదాలో జగన్‌ చిత్తూరు జిల్లా పర్యటనలో చేసిన వ్యాఖ్యలివి.

చేతలు ఇలా..

జగన్‌ విన్నారు.. అధికారంలోకి వచ్చారు. ఆపై వంచన పర్వానికి తెరలేపారు. సమస్యలు తీరుస్తాడని ఆశించిన ప్రజలను నమ్మకంగా మోసగించారు. ముఖ్యమంత్రి అయ్యాక జనానికి ముఖం చాటేశారు. సహకార చక్కెర పరిశ్రమలను పునరుద్ధరించాల్సింది పోయి అమ్మేసేందుకు ప్రణాళిక రచించారు. ప్రైవేటు కర్మాగారాలు బకాయిలు ఇవ్వకపోయినా ఆయన ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు.


రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత ఉండాలని విపక్ష నేత హోదాలో జగన్‌ పదేపదే నాయకులకు హితబోధ చేశారు. అవి లేనప్పుడు అటువంటి నేతలను ఇంటికి పంపాలని కూడా ఆయనే సెలవిచ్చారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత గతంలో ఇచ్చిన హామీలు, చేసిన వాగ్దానాలు గాలికి వదిలేశారు. నమ్మించడం.. వంచించడం మాత్రమే తన నైజమని అసలు స్వరూపాన్ని బయటపెట్టారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం నగరి నియోజకవర్గం పుత్తూరు వస్తున్నారు. మరోసారి అబద్దాలు చెప్పి ప్రజలను మోసగించాలనే తలంపుతో ఉన్న జగన్‌కు ఈసారి ఓటుతో గట్టిగా బుద్ధి చెబుతామని ఓటర్లు అంటున్నారు.

ఈనాడు, చిత్తూరు; న్యూస్‌టుడే, పుత్తూరు


రేణిగుంటలో మూతపడిన సహకార చక్కెర కర్మాగారం

రేణిగుంట మండలం గాజులమండ్యంలో 1978లో సుమారు 167 ఎకరాల్లో ఎస్వీ సహకార చక్కెర కర్మాగారాన్ని స్థాపించారు. చంద్రగిరి, శ్రీకాళహస్తి, సత్యవేడు, నగరి, గంగాధరనెల్లూరు నియోజకవర్గాల్లోని దాదాపు 13 వేల మంది రైతులు ఇందులో సభ్యులుగా ఉన్నారు. ఏటా 2.50 లక్షల టన్నుల క్రషింగ్‌ జరిగే ఈ పరిశ్రమ మూతపడింది. ఈ కర్మాగారం పునః ప్రారంభానికి చర్యలు తీసుకుంటానని పాదయాత్రలో జగన్‌ హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి అయ్యాక పూర్వ వైభవం రాకపోగా లిక్విడేటర్‌ను ఏర్పాటు చేసి ఆస్తులు విక్రయించేందుకు సిద్ధమయ్యారు. రైతుల న్యాయ పోరాటంతో దీనికి బ్రేకులు పడ్డాయి. ఎస్వీ చక్కెర కర్మాగారానికి రూ.110 కోట్ల నష్టాలున్నాయని చూపుతూ దాదాపు రూ.వెయ్యి కోట్ల విలువైన భూములను తన అనుచరగణానికి కట్టబెట్టాలని సీఎం ప్రయత్నిస్తున్నారు.

నేటమ్స్‌ బకాయిలు ఎప్పుడిప్పిస్తారు?

నిండ్రలో మూతపడిన నేటమ్స్‌ చక్కెర పరిశ్రమ

నిండ్ర మండలం నేటమ్స్‌ చక్కెర కర్మాగారం అన్నదాతలకు బకాయిలు చెల్లించనందున 2019లో క్రషింగ్‌ ఆపేశారు. అంతకుముందు నగరి, సత్యవేడు నియోజకవర్గాల్లో కలిపి దాదాపు 3వేల మంది రైతులకు రూ.35.50 కోట్లు యాజమాన్యం బకాయి ఉంది. వైకాపా అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో ఏపీఐఐసీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన నగరి ఎమ్మెల్యే రోజా సమస్య పరిష్కరిస్తానని స్పష్టం చేశారు. కొంతకాలానికి ఆమె బకాయిల చెల్లింపు తన బాధ్యత కాదన్నట్లుగా చేతులెత్తేశారు. మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత కూడా పట్టించుకోలేదు.

గాలేరు- నగరిని గాలికొదిలేసి

వైకాపా అధికారంలోకి రాగానే యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టులు పూర్తి చేస్తామని ప్రతిపక్ష నాయకుడిగా జగన్‌ చెప్పారు. గతేడాది ఆగస్టులో నగరిలో పర్యటించినప్పుడు సైతం ఇవే మాటలు వల్లించారు. వైకాపా అధికారంలోకి వచ్చిన ఐదేళ్లలో ఒక్క అడుగూ పడలేదు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని తూర్పు ప్రాంతంలో 1.03 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందుతాయని తెలిసినా నిధులు విడుదల చేసేందుకు ముఖ్యమంత్రికి మనసు రాలేదు. అంచనాలు మాత్రం పెంచేశారు. ఇందులో భాగమైన బాలాజీ, మల్లెమడుగు, వేణుగోపాలసాగర్‌ జలాశయాల నిర్మాణం పూర్తి కాలేదు. చిత్తూరు జిల్లాకు ఏం చేశారని ఆయన ఇప్పుడు పుత్తూరులో ఓట్లు అడుగుతారు?

నేతన్నలను మగ్గానికి దూరం చేసి..

2019 ఎన్నికల ప్రచారంలో జగన్‌ నగరి నియోజకవర్గానికి వచ్చినప్పుడు మరమగ్గాల కార్మికులు అష్టకష్టాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలోకి రాగానే యూనిట్‌కు 6 పైసలుగాన్న విద్యుత్తు సుంకాన్ని రూపాయికి పెంచారు. ఎన్నికలు సమీపించడంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో తిరిగి ఆరు పైసలు చేసినా కార్మికులకు ఎటువంటి ప్రయోజనం లేదు. ట్రూ అప్‌, సర్దుబాటు ఛార్జీలంటూ మూడింతల విద్యుత్తు బిల్లు చేతికి అందిస్తున్నారు. గతంలో రూ.600 బిల్లు వస్తే అది రూ.2వేలకు చేరిందని కార్మికులు వాపోతున్నారు.
ః  నగరిలో టెక్స్‌టైల్‌ పార్కు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన కలగానే మిగిలింది. ఇది ఏర్పాటయితే నేతన్నల తలరాతలు మారుతాయని, నగరి పట్టణంలో రంగునీటి కాలుష్యం తగ్గుతుందని ఆశలు పెట్టుకున్నారు. దీన్ని కూడా జగన్‌ సాకారం చేయలేదు. ః  ఏ ప్రభుత్వమైనా పారిశ్రామికవేత్తలు తమ రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టాలని వెంటపడతారు. జగన్‌ జమానాలో మాత్రం పరిస్థితి తిరగబడింది. విజయపురం మండలం కోశలనగరాన్ని అభివృద్ధి చేస్తే పరిశ్రమలు నెలకొల్పుతామని తమిళనాడులోని యాజమాన్యాలు ముందుకొచ్చినా పారిశ్రామిక పార్కును అభివృద్ధి చేయలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని