logo

రెడ్‌ సిగ్నల్‌ పడేనా?

జిల్లాలోని రైలు పట్టాలపై మృతదేహాల సంఖ్య పెరిగిపోతోంది.. జిల్లాలోని రైలు మార్గాల్లో కొన్ని సూసైడ్‌(ఆత్మహత్య) స్పాట్‌లను తలపిస్తున్నాయి.. నెలకు కనీసం నాలుగైదయినా పట్టాలపై వెలుగు చూస్తున్నాయి..

Published : 31 May 2023 04:16 IST

ఏటా పెరుగుతున్న ప్రమాదాలు
ఆత్మహత్యలకు అడ్డాగా రైలుపట్టాలు
గుర్తించలేని మృతదేహాలూ అధికమే

రైలు పట్టాలపై ప్రమాదం(పాత చిత్రం)

న్యూస్‌టుడే, చిత్తూరు(క్రైమ్‌): జిల్లాలోని రైలు పట్టాలపై మృతదేహాల సంఖ్య పెరిగిపోతోంది.. జిల్లాలోని రైలు మార్గాల్లో కొన్ని సూసైడ్‌(ఆత్మహత్య) స్పాట్‌లను తలపిస్తున్నాయి.. నెలకు కనీసం నాలుగైదయినా పట్టాలపై వెలుగు చూస్తున్నాయి.. ఆయా స్టేషన్ల పరిధిలో పట్టాలపై లభ్యమవుతోన్న మృతదేహాలను పరిశీలిస్తే పరిస్థితి నానాటికీ భయానకంగా మారుతోంది.. చివరకు కనీసం ఆనవాళ్లు సైతం దొరకని పరిస్థితి.. అవి ప్రమాదవశాత్తూ జరిగిన మరణాలా..? ఆత్మహత్యలా..? సాధారణంగా జరిగిన ప్రమాదాలా..? అనే విషయం తేలడం లేదు.. ఆ దిశగా ఎవరూ దృష్టి సారించడం లేదు.. ఏళ్ల తరబడి కొన్ని మృత దేహాల వివరాలు నేటికీ తెలియడం లేదు.. వీటికి అడ్డుకట్ట పడేదెన్నడేది ప్రశ్నార్థకంగా మారింది.

నేటికీ తెలియనివి ఎన్నో..?

రైలు పట్టాలపై వెలుగుచూసే మృతదేహాల్లో కొన్ని నేటికీ ఎవరిదనేది తెలియదంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కొన్ని వివరాలు తెలిసినా.. మరి కొన్ని మృతదేహాల వివరాలు సంవత్సరాలైనా తెలియడం లేదు. అవి ఎవరివనేది తెలిస్తే దర్యాప్తు ముమ్మరం చేసి కేసు ఛేదించవచ్చు. రైల్వే పోలీసులకు.. మృతుల వేలిముద్రల ద్వారా ఆధార్‌ పరిశీలించే అవకాశం కల్పించినా.. అవి  ఎవరివనేది గుర్తించవచ్చు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు రైలు పట్టాలపై జరిగే మరణాలపై దృష్టి పెట్టి రైల్వే అధికారులకు ఆధార్‌ పరిశీలనకు అవకాశం కల్పించి, ప్రమాదాలకు జరగకుండా చూడాలి.  


రైలు పట్టాలపై ఆత్మహత్యలు

బెట్టింగ్‌ యాప్‌లో రూ.లక్షలు పోగొట్టుకుని, రుణ యాప్‌లో నగదు తీసుకుని, ప్రేమలో విఫలమై.. పరీక్షలో తప్పి.. ఇలా పలు కారణాలతో యువతీయువకులు రైలు పట్టాలపై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో చిన్న నుంచి పెద్ద వరకు అవగాహనా లోపంతో పొలాల వద్ద ఉన్న రైల్వే లైను దాటుతూ ఊహించని రీతిన ప్రమాదానికి గురవుతున్నారు. ఇలాంటి వాటిపై సంబంధిత అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


తల్లిదండ్రులు పిల్లలను గమనిస్తుండాలి..
- ప్రవీణ్‌కుమార్‌, ఎస్సై, జీఆర్‌పీఎఫ్‌, చిత్తూరు

ఆత్మహత్యలకు పాల్పడే యువకుల్లో చాలామంది చరవాణి, బెట్టింగ్‌ యాప్‌, రుణయాప్‌లు వినియో గిస్తూ నష్టపోతూ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తల్లిదండ్రులు నిత్యం పిల్లల్ని కనిపెడుతూ, వారి ప్రవర్తనలో మార్పు కనిపించిన వెంటనే కౌన్సెలింగ్‌ ఇవ్వాలి. ముఖ్యంగా రైలు ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించి జాగ్రత్తలు పాటించాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని