logo

అతివేగం.. నిద్ర మత్తు

ఏర్పేడు మండలం మేర్లపాక సమీపంలో ఈనెల 1వ తేదీ తెల్లవారుజామున శ్రీకాళహస్తి నుంచి తిరుపతి వెళుతోన్న ఆర్టీసీ బస్సును కారు ఢీ కొనడంతో తెలంగాణ రాష్ట్రం మహబూబాబాద్‌ జిల్లాలోని ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాత పడ్డారు.

Published : 04 Jun 2023 03:08 IST

జిల్లాలో తరచూ ప్రమాదాలు
పోలీసులు, రవాణా శాఖ సంయుక్తంగా పనిచేస్తేనే నివారణ
ఈనాడు డిజిటల్‌, చిత్తూరు, న్యూస్‌టుడే, తిరుపతి(నేరవిభాగం)

చంద్రగిరి మండలం కాశిపెంట్ల వద్ద గతనెలలో జరిగిన రోడ్డు ప్రమాదం

* ఏర్పేడు మండలం మేర్లపాక సమీపంలో ఈనెల 1వ తేదీ తెల్లవారుజామున శ్రీకాళహస్తి నుంచి తిరుపతి వెళుతోన్న ఆర్టీసీ బస్సును కారు ఢీ కొనడంతో తెలంగాణ రాష్ట్రం మహబూబాబాద్‌ జిల్లాలోని ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాత పడ్డారు.

* ఈ ఏడాది జనవరి 25న తిరుమల శ్రీవారిని దర్శించుకుని కాణిపాకం బయలుదేరిన మహారాష్ట్ర భక్తులకు చెందిన కారు అదుపు తప్పి రహదారి పక్కనే ఉన్న డివైడర్‌ గోడను ఢీ కొట్టడంతో నలుగురు ప్రమాదస్థలిలోనే దుర్మరణం చెందగా మరొకరు ఆసుపత్రిలో ప్రాణాలు విడిచారు. అతివేగంతోనే ఈ ఘటన జరిగింది.

అతివేగం.. నిద్రమత్తుకు తోడు అవగాహన లేమితో జిల్లాలోని రహదారులు రక్తమోడుతున్నాయి. మృతుల్లో ఎక్కువమంది స్థానికేతరులే ఉంటున్నారు. తాజాగా శనివారం ఇదే తరహాలో పులిచెర్ల మండలంలో ప్రమాదం చోటుచేసుకుని నలుగురు మృతిచెందారు. అధిక శాతం ప్రమాదాలకు మానవ తప్పిదాలే కారణమైనప్పటికీ జాతీయ రహదారులపై విధులు నిర్వర్తించే పెట్రోలింగ్‌ సిబ్బంది వాహనదారులను అప్రమత్తం చేస్తే కొంతవరకు ప్రాణనష్టాన్ని తప్పించవచ్చు. పోలీసులు, రవాణా శాఖ సంయుక్తంగా పనిచేస్తేనే ప్రమాదాలు నివారించవచ్చు.

ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని తిరుమల, శ్రీకాళహస్తి, కాణిపాకం ఆలయాల సందర్శనకు నిత్యం వేలాది మంది జిల్లాకు వస్తుంటారు. పౌర్ణమి రోజు గిరి ప్రదక్షిణకు అరుణాచలానికీ వెళుతుంటారు. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకతోపాటు రాష్ట్రంలోని సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న ప్రయాణికులకు జిల్లా రోడ్లపై ఏమాత్రం అవగాహన ఉండదు. త్వరగా గమ్యాన్ని చేరుకునేందుకు 100 కి.మీ.లపైగా వేగంతో వాహనాలు నడుపుతున్నారు. కొందరైతే సొంతంగానే వాహనాలు నడుపుతూ వస్తుండటం.. అందులోని ఒక్కరికే డ్రైవింగ్‌ రావడంతో అలసిపోయినా.. అతనే స్టీరింగ్‌ పట్టాల్సి వస్తోంది. నిద్ర లేమితో కంటి రెప్పలు మూతపడుతున్నాయి. ఈలోపే నష్టం జరిగిపోతోంది. మరికొందరు ముందుగా వెళుతున్న వాహనాలను తప్పించబోయి వాటినే ఢీ కొడుతున్నారు. ఈ తరహా ప్రమాదాలు చంద్రగిరి- నేండ్రగుంట మధ్య ఎక్కువగా జరిగాయి. కల్లూరు, భాకరాపేట, మొగిలి ఘాట్‌లో లారీలు మిట్ట ఎక్కేటప్పుడు ఒక్కసారిగా నిదానిస్తున్నాయి. వెనుక వస్తున్న కారు, బస్సు డ్రైవర్లు వేగాన్ని అదుపు చేయలేక లారీలను ఢీ కొడుతున్నారు.

పులిచెర్ల మండలం ఎంజేఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాల సమీపంలో
శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నుజ్జునుజ్జయిన వాహనం

అరకొరగా స్పీడ్‌ గన్‌లు

జాతీయ రహదారులపై స్పీడ్‌ గన్‌లు అంతంతమాత్రంగానే ఉన్నాయి. అవి కూడా తిరుపతి- చిత్తూరు రోడ్డులో రెండు చోట్ల  ఏర్పాటు చేశారు. ఇక్కడ వీటి సంఖ్య పెంచడంతోపాటు చెన్నై- బెంగళూరు జాతీయ రహదారిపై కొత్తవి ఏర్పాటు చేసేలా రవాణా శాఖ అధికారులు చొరవ చూపాలి. తద్వారా అధిక వేగంతో వెళుతోన్న వాహనదారుడికి జరిమానా పడితే ఆ తర్వాత డ్రైవింగ్‌ చేసే విధానంలో మార్పు వచ్చి ప్రాణాలను కాపాడొచ్చు.

‘వాష్‌ అండ్‌ డ్రైవ్‌’ అమలు చేస్తే..

గతంలో రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు జాతీయ రహదారులపై విధులు నిర్వర్తించే పెట్రోలింగ్‌ సిబ్బంది దూర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలను నిలిపేవారు. డ్రైవర్‌ నీటితో ముఖాన్ని కడుక్కున్న తర్వాత ప్రయాణానికి అనుమతించేవారు. సిబ్బంది సక్రమంగా పనిచేస్తున్నారా? లేదాని తెలుసుకునేందుకు సీఐలు, డీఎస్పీలు అకస్మాత్తుగా వెళ్లే పరిస్థితి ఉంది. దీంతో ప్రమాదాల సంఖ్య కొంతవరకు తగ్గింది. ప్రస్తుతం ఈ విధానాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని