logo

మాటల్లో నిషేధం.. మత్తులో ఆధ్యాత్మిక నగరం

నిత్యం వేల సంఖ్యలో భక్తులు వచ్చే ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో మద్యం మత్తులో పలువురు చేస్తున్న వికృత చేష్టలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి.

Updated : 09 Jun 2023 06:19 IST

రహదారులపై మందుబాబుల వికృత చేష్టలు
భక్తులు, స్థానికుల్లో భయాందోళనలు

అన్నమయ్య కూడలి సమీపంలో బుధవారం మందుబాబుల వీరంగం

నిత్యం వేల సంఖ్యలో భక్తులు వచ్చే ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో మద్యం మత్తులో పలువురు చేస్తున్న వికృత చేష్టలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. మద్య నిషేధం అమలు చేసే అంశాన్ని పక్కనబెట్టి విక్రయాలపైనే ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. అధికార, ప్రజాప్రతినిధులు ఒత్తిళ్లతో చర్యలు తీసుకోవట్లేదన్న విమర్శలున్నాయి.

ఈనాడు-తిరుపతి: జిల్లా పరిధిలో 27 బార్లకు ప్రభుత్వానికి లైసెన్సు రూపేణా ఏకంగా రూ.29.99 కోట్ల ఆదాయం వచ్చింది. ఇందులో తిరుపతి కార్పొరేషన్‌ పరిధిలో మొత్తం 16 బార్లు ఉండగా.. వీటికి రూ.24.30 కోట్లు చెల్లించి దుకాణాల లైసెన్సులు తీసుకున్నారు.


‘కాపురాల్లో మద్యం చిచ్చుపెడుతోంది... మానవ సంబంధాలు మంట కలిసిపోతున్నాయి... అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు దశల్లో మద్యాన్ని నిషేధిస్తాం... మద్యాన్ని 5 నక్షత్రాల

హోటళ్లకే పరిమితం చేస్తాం.

మానిఫెస్టోలో ఎన్నికల సమయంలో జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్న అంశం.


‘అలిపిరి నుంచి 10 కి.మీ.ల వ్యాసార్థంలో మద్యపానంపై సంపూర్ణ నిషేధం విధించాలి. ఇది ఒక్కసారి సాధ్యం కాకుంటే దశలవారీగా చేపట్టాలి. తొలి దశలో కనీసం రెండు కి.మీ.ల పరిధిలోని ఆర్టీసీ బస్టాండు - అలిపిరి రహదారి, చెర్లోపల్లి-అలిపిరి రహదారి, టౌన్‌ క్లబ్‌ - అలిపిరి రహదారి ప్రాంతాల్లో చేపట్టాలని ప్రభుత్వానికి నివేదిస్తున్నాం.’

2019 అక్టోబరు 23న తితిదే ధర్మకర్తల మండలి తీర్మానం


‘నగరంలోని యువత డ్రగ్స్‌, గంజాయికి బానిసయ్యారు. మాదక ద్రవ్యాలను వదలకుంటే జీవితాలు నాశనమవుతాయి.’

2021 జూన్‌లో స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి పలు కాలనీల్లో తనిఖీలు చేసిన సందర్భంలో చేసిన వ్యాఖ్యలు


ఏరులై ప్రవహిస్తేనే ఆదాయం

నగరంలో ఓ బారును రూ.1.59 కోట్లకు, మరోదాన్ని రూ.1.55 కోట్లకు దక్కించుకున్నారు. రోజు తప్పనిసరిగా రూ.43,562 విలువైన మద్యాన్ని విక్రయించాలి. ఇది కేవలం లైసెన్సు రూపంలో చెల్లించాల్సిన సొమ్ము మాత్రమే. దీనికి అదనంగా దుకాణం నిర్వహణ, సిబ్బందికి వేతనాలు అన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే కచ్చితంగా ఒక రోజుకు రూ.60 వేల విలువైన చేసే మద్యం విక్రయించాలి. ఇదీ కేవలం ఎటువంటి లాభం లేకుండానే. ఈ లెక్కన నగరంలోని బార్ల ద్వారా ఎంత మద్యం విక్రయమవుతుందో అర్థం చేసుకోవచ్చు.


హద్దులు మీరి..

ఇది అన్నారావు కూడలిలోని  మద్యం దుకాణం. ఇది కపిలతీర్థం, ఇస్కాన్‌, వరదరాజస్వామి ఆలయాలకు సమీపంలో ఉంది.  ప్రధాన ప్రాంతంలో ఉన్న ఈ దుకాణం వద్దే తాగిన సీసాలను పడేస్తున్నా ఎవరూ నియంత్రించడం లేదు. ఇదే పరిస్థితి నగరం అంతటా నెలకొంది.

తిరుపతి నగరంలో బుధవారం రహదారిపై వెళ్తున్న మహిళపై బీరు సీసా విసిరిన ఘటనలో జరిగిన అల్లర్లలో ఒకరు మృతి చెందారు. ఇలాంటివి రోజూ నగరంలోని పలు ప్రాంతాల్లో చోటుచేసుకుంటున్నాయి. మందుబాబులు చేస్తున్న అరాచకాలు అనేకం ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. బజారులో వెళ్తున్న మహిళలు, చిన్నపిల్లలతో అసభ్యంగా మాట్లాడటం. వాహనాలను ఇష్టానుసారంగా నడిపి ఇతరులకు తీవ్ర ఇబ్బందులు కల్పిస్తున్నారు.ఇలాంటి వాటిపై పోలీస్‌ స్టేషన్లలో ఫిర్యాదు చేసినా రాజకీయ నేతల నుంచి వచ్చే ఒత్తిళ్లతో వదిలేస్తున్న సందర్భాలు అనేకం ఉన్నాయి.


బహిరంగంగా తాగుతున్నా..

నగరంలోని కొన్ని ప్రాంతాల్లో బహిరంగంగానే మద్యం తాగుతున్నా పోలీసులు, సెబ్‌ అధికారులు పట్టించుకోవడం లేదు. ఎవరినైనా పట్టుకుంటే అధికార పార్టీ పేరు చెప్పి బెదిరింపులకు పాల్పడుతున్నారని సమాచారం.  


ప్రోత్సాహం ఎంతలా అంటే..

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో  2022లో రూ.302.23 కోట్ల మద్యం విక్రయాలు జరిగితే, 2023లో ఇప్పటి వరకు రూ.126.15 కోట్ల విలువైన మద్యం విక్రయించారు.  ఈ లెక్కలు పరిగణనలోకి తీసుకుంటే ఏ మేరకు మద్యం విక్రయాలను ప్రోత్సహిస్తున్నారన్నది తెలుస్తోంది. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు ఆధ్యాత్మిక నగరంలో మద్య నిషేధాన్ని అమల్లోకి తీసుకురాకుంటే రానున్న రోజుల్లో రహదారిపై నడిచేందుకు ప్రజలు, భక్తులు భయపడాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుతుంది.


 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని