logo

అపరాల పంటపై ఆశలు

మెట్ట ప్రాంతానికి చెందిన రైతులకు ఆదాయాన్ని సమకూర్చే అపరాల సాగు ఈ ఏడాది ఆశలు రేకెత్తిస్తోంది. అనేక ఒడుదొడుకుల మధ్య ఖరీఫ్‌ పంట పూర్తయింది. ప్రారంభంలో వర్షాలు లేకపోవడం..తీరా పంట చేతికొచ్చాక వానలు ఇబ్బంది పెట్టడం, అనంతరం ఒబ్బిడిచేసి

Published : 20 Jan 2022 05:42 IST


కొత్తకొట్టాం సమీపంలో మినప చేను 

న్యూస్‌టుడే, కోటనందూరు, తొండంగి, రౌతులపూడి  మెట్ట ప్రాంతానికి చెందిన రైతులకు ఆదాయాన్ని సమకూర్చే అపరాల సాగు ఈ ఏడాది ఆశలు రేకెత్తిస్తోంది. అనేక ఒడుదొడుకుల మధ్య ఖరీఫ్‌ పంట పూర్తయింది. ప్రారంభంలో వర్షాలు లేకపోవడం..తీరా పంట చేతికొచ్చాక వానలు ఇబ్బంది పెట్టడం, అనంతరం ఒబ్బిడిచేసి ధాన్యాన్ని విక్రయించే వరకు అన్నదాతలకు ఇబ్బందులు తప్పలేదు. ఏటా ఖరీఫ్‌ అనంతరం అపరాల పంటలైన మినుము, పెసర సాగు చేస్తారు. ఈ ఏడాది అపరాల పంటకు కాలం కాస్త అనువుగా ఉండడంతో చేలు ఏపుగా పెరగడంతో పాటు పూత సైతం ఆశించిన స్థాయిలో వచ్చింది. మూడు రోజుల కిందట కురిసిన వర్షం సైతం పంట బాగా పెరిగేందుకు దోహద పడుతుందని వ్యవసాయఅధికారులు చెబుతున్నారు. కాలం ఇదే రీతిలో కొనసాగడంతో పాటు ధరలు సైతం ఆశించిన స్థాయిలో ఉన్నట్లయితే తమ ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు తెగుళ్లపై అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
మెట్ట ప్రాంతాలైన కోటనందూరు, తుని, తొండంగి, రౌతులపూడి, శంఖవరం, ప్రత్తిపాడు తదితర మండలాల్లో మినప సుమారు 2,608 హెక్టార్లులోను.. పెసలు సుమారు 2,162 హెక్టార్లులోను రైతులు సాగు చేశారు. ప్రస్తుతం అపరాలు మొక్కదశలో ఉండటంతో పాటు పెరుగుదల సైతం అనుకూలంగా ఉండటంతో పంట పూర్తిస్థాయిలో దక్కినట్లయితే ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ప్రారంభంలోనే తెగుళ్లు గుర్తించాలి.. 
ప్రస్తుతం పంట ఏపుగా పెరుగుతుండటంతో పాటు పూత దశకు చేరుకుంటోంది. ఈ దశలో ఆకుముడత, తలమాడు(మొవ్వుకుళ్లు), ఎండుతెగులు, బూడిద తెగుళ్లతో పాటు మచ్చల పురుగు వల్ల ప్రమాదం పొంచి ఉంది. పంటలో ఏవిధమైన మార్పువచ్చినా, గ్రామాల్లోని ఎంపీఈవోలతో పాటు కార్యాలయ సిబ్బంది సలహాలు తీసుకోవాలి. తెగులు ప్రారంభంలోనే నివారణ చేసినట్లయితే పంట అధిక దిగుబడి సాధించవచ్చు.    -నరసింహం, ఏవో, తొండంగి మండలం 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని