logo

వేళ్లూనిన వ్యాపకం

మొక్కలే ఆమెకు ప్రాణం.. పొద్దుపొడవక ముందే లేచి వాటిని చూడనిదే ఆమె రోజువారీ పనులు ప్రారంభం కావు. ఆ ఇంటి ఆవరణలో అడుగుపెట్టగానేే.. ఏదైనా నర్సరీలో ఉన్నామా.. నందనవనమా అన్న అనుభూతి కలుగుతుంది. ఎటుచూసినా వివిధ రకాల పూలమొక్కలు, క్రోట

Published : 21 Jan 2022 04:42 IST

ప్లాస్టిక్‌ టిన్నులతో బాతు ఆకారంలో తీర్చిదిద్దిన పూలకుండీ

న్యూస్‌టుడే, కాకినాడ(సాంబమూర్తినగర్‌) : మొక్కలే ఆమెకు ప్రాణం.. పొద్దుపొడవక ముందే లేచి వాటిని చూడనిదే ఆమె రోజువారీ పనులు ప్రారంభం కావు. ఆ ఇంటి ఆవరణలో అడుగుపెట్టగానేే.. ఏదైనా నర్సరీలో ఉన్నామా.. నందనవనమా అన్న అనుభూతి కలుగుతుంది. ఎటుచూసినా వివిధ రకాల పూలమొక్కలు, క్రోటన్‌ మొక్కలు, కాయగూరల మొక్కలు ఇలా సమస్తం నిండిన ఉద్యానవనమే ‘ఆ ఇల్లు’.

36 రకాల మొక్కలు..

యాపిల్‌, బత్తాయి, కమలా, డ్రాగన్‌ ఫ్రూట్‌, రామఫలక్కాయ, ఆవకాడ, పనస తదితర 36 రకాల చెట్లను పెంచుతున్నారు. ఇవికాక క్రోటన్‌ జాతికి చెందిన పీస్‌లిల్లీ, జడ్‌ప్లాంట్‌, స్నేక్‌ప్లాంట్‌ వంటి ఆక్సిజన్‌ మొక్కలు, మనీప్లాంటులో నాలుగురకాలు, సంక్లెంట్‌ తదితర క్రోటన్‌ జాతులు వీరివద్ద ఉన్నాయి. వంకాయ, టమాటా, చిక్కుడు, దొండ తదితర ఎనిమిది రకాల కూరగాయలు కుండీల్లోను, ఆకుకూరలను సేంద్రియ పద్ధతిలో పెంచుతున్నారు.

కాకినాడలోని కృష్ణానగర్‌లో నివాసముంటున్న జలవనరులశాఖ విశ్రాంత అధికారి కె.మురళీగోపాలకృష్ణ, రాధ దంపతులు 15 ఏళ్లుగా వివిధ రకాల మొక్కలు పెంచుతున్నారు. చదివింది తక్కువే అయినా ఇంటి బాధ్యతలు చూసుకుంటూ భర్త సహకారంతో ఆమె ఇంట్లో పనికిరాని నీటి సీసాలు, టర్కీ టవల్స్‌, వినియోగించిన బూట్లు, టైర్లు, పైపులు.. ఒకటేమిటి.. ఏ వస్తువునైనా తన చేతి మహిమతో ఇట్టే ఓ చక్కని ఆకృతిగా మలచగల మేటి మహిళ ఆమె. స్వయంగా సిమెంటుతో ఆకర్షణీయ డిజైన్‌తో కుండీలను తయారు చేసి వాటిలో మొక్కలు పెంచుతున్నారు. చిన్నచిన్న కుండీలను తయారుచేసి వాటిపై వివిధ డిజైన్లు వేస్తున్నారు.

మొక్కలతోనే దినచర్య..

మొక్కల సంరక్షణతోనే నా దినచర్య ప్రారంభమవుతుంది. ఖాళీగా ఉన్న సమయంలో భర్త సహకారంతో పాత వాటర్‌బాటిళ్లు, షూలను వివిధ రంగులతో అలంకరించి వాటిలో క్రోటన్‌ మొక్కలను పెంచుతున్నా. కడియం ప్రాంతంలోని నర్సరీల నుంచి ఈ మొక్కలు తెస్తున్నాం. కొన్నిరకాల క్రోటన్‌ మొక్కలను ఆన్‌లైన్‌లో చూసి తెప్పిస్తున్నా. ఇటీవల కార్పొరేషన్‌ సిబ్బంది ఇంటి ఆవరణలో ఏపుగా పెరిగిన చెట్టుకొమ్మను తొలగిస్తున్న సమయంలో చాలా బాధ అనిపించింది. తప్పనిసరి పరిసితుల్లో తొలగించిన ఆ కొమ్మ స్థానంలో ఓ కుండీ పెట్టి ‘నువ్వు నన్ను కాపాడు.. నేను నిన్ను కాపాడుతా’ అంటూ పెయింట్‌తో రాశాను. ఇది చూసినవారు వేరే ఎక్కడైనా కొమ్మలు తొలగించినప్పుడు ఆలోచిస్తారనే చిన్న నమ్మకం. -ఎ.రాధ, కాకినాడ

డబ్బాలకు రంగులద్ధి.

పాలిథిన్‌ సీసాలను కత్తిరించి పొద్దుతిరుగుడు పువ్వు ఆకారంలో మలిచి..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని