logo

AP News: ఒకే ఆస్తి.. ఇద్దరికి రాసిచ్చేశారు!

ఒకే సర్వే నంబరులో ఉన్న భూమిని ఇద్దరికి రిజిస్ట్రేషన్‌ చేసేశారు ఆత్రేయపురం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం సిబ్బంది. దీని విలువ రూ.60 లక్షల పైమాటే. దీనిపై బాధితులు సోమవారం నిలదీయడంతో ఇబ్బంది లేకుండా చర్యలు చేపడతామని సర్ది చెప్పి పంపేశారు. బాధితులు

Updated : 25 Jan 2022 08:00 IST

ఆత్రేయపురం సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో నిర్వాకం


సబ్‌ రిజిస్ట్రార్‌ను నిలదీస్తున్న బాధితులు

ఆత్రేయపురం, న్యూస్‌టుడే: ఒకే సర్వే నంబరులో ఉన్న భూమిని ఇద్దరికి రిజిస్ట్రేషన్‌ చేసేశారు ఆత్రేయపురం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం సిబ్బంది. దీని విలువ రూ.60 లక్షల పైమాటే. దీనిపై బాధితులు సోమవారం నిలదీయడంతో ఇబ్బంది లేకుండా చర్యలు చేపడతామని సర్ది చెప్పి పంపేశారు. బాధితులు తెలిపిన వివరాలు ప్రకారం... మండలంలోని వెలిచేరు గ్రామకంఠం రివిజన్‌ సర్వే నంబరు 96/9లో 16 సెంట్లు భూమి కోడూరి సురేష్‌కు 2021 మే 6న తన తల్లిదండ్రుల ద్వారా సంక్రమించింది. ఆ ఆస్తిని తన అవసరాల నిమిత్తం ఈనెల 19న అదే గ్రామానికి చెందిన కారుమూరి రాజాబాబుకు విక్రయించి, రిజిస్ట్రేషన్‌ చేశారు. ఇదే భూమిని గ్రామ స్థాయి అధికారి, దస్తావేజు లేఖరి ద్వారా వెలిచేరుకు చెందిన కాళ్లకూరి విజయ్‌గుప్తాకు తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించి రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారని బాధితుడు సురేష్‌ కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఆ స్థలానికి హక్కుదారులం మేమంటూ గుప్తా కుటుంబ సభ్యులు ఆదివారం ఫ్లెక్సీ ఏర్పాటు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో సురేష్‌ సోమవారం ఆత్రేయపురం సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయానికి చేరుకుని ఒకరికి అమ్మిన భూమి ఇంకొకరికి ఎలా రిజిస్ట్రేషన్‌ చేస్తారని విధుల్లో ఉన్న ఇన్‌ఛార్జి సబ్‌ రిజిస్ట్రార్‌ కె.శ్రీనివాస్‌ను ప్రశ్నించారు. ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో శాంతించారు. ఇటీవల ఆదాయానికి మించి ఆస్తులున్నాయని గుర్తించిన ఉన్నతాధికారులు ఇక్కడి సబ్‌ రిజిస్ట్రార్‌ ప్రసాదరావుపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడంతో ఆ స్థానంలో కె.శ్రీనివాస్‌ ఇన్‌ఛార్జిగా కొనసాగుతున్నారు.

రిజిస్ట్రేషన్‌ రద్దుకు చర్యలు

పరిశీలనా లోపం వల్ల తప్పిదం జరిగింది. ఉన్నతాధికారుల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లాం. రిజిస్ట్రేషన్‌ కోసం తప్పుడు ధ్రువపత్రాలు అందించినట్లు పరిశీలనలో తేలింది. రిఫ్యూజల్‌ ఆర్డర్‌ వేసి అసలు వారసులకు న్యాయం చేస్తాం. - కె.శ్రీనివాస్‌, ఇంఛార్జి సబ్‌రిజిస్ట్రార్‌, ఆత్రేయపురం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని