logo

తేల్చలేదు... తేల్చేశారు!

వడ్డించేది మనోడైతే... కడ బంతిలో కూర్చున్నా కడుపారా భోజనం చేయవచ్చంటారు.. అలాగే చర్యలు తీసుకునేవాళ్లు మనోళ్లయితే.. ఎంత పెద్ద శిక్ష నుంచైనా తేలిగ్గా తప్పించుకోవచ్ఛు. జగ్గంపేట మండలంలోని అక్రమ క్వారీల వ్యవహారంలో ఇదేతంతు సాగుతోంది. అడ్డగోలుగా గనులు కొల్లగొడుతున్నా.. రాజకీయ దన్ను పుష్కలంగా ఉండడంతో ప్రతిసారీ చర్య

Published : 27 Jan 2022 04:40 IST


జగ్గంపేట: రామవరం శివారులో అక్రమ తవ్వకాలు జరిపిన సుద్ద క్వారీ

ఈనాడు - కాకినాడ: వడ్డించేది మనోడైతే... కడ బంతిలో కూర్చున్నా కడుపారా భోజనం చేయవచ్చంటారు.. అలాగే చర్యలు తీసుకునేవాళ్లు మనోళ్లయితే.. ఎంత పెద్ద శిక్ష నుంచైనా తేలిగ్గా తప్పించుకోవచ్ఛు. జగ్గంపేట మండలంలోని అక్రమ క్వారీల వ్యవహారంలో ఇదేతంతు సాగుతోంది. అడ్డగోలుగా గనులు కొల్లగొడుతున్నా.. రాజకీయ దన్ను పుష్కలంగా ఉండడంతో ప్రతిసారీ చర్యలు తేలిపోతున్నాయి. స్థానిక ముఖ్య నాయకులకు బెదిరి అక్రమ క్వారీల వైపు భూగర్భ గనుల శాఖ కన్నెత్తి చూడడంలేదు. ఒకవేళ అక్రమాలు రచ్చకెక్కి గనుల శాఖ అధికారులు తనిఖీలు చేసి చర్యలకు ఉపక్రమిస్తున్నా.. ముందరి కాళ్లకు రాజకీయ బంధం అడ్డు పడుతోంది. తాజాగా రామవరం సుద్ద క్వారీలో భూగర్భ గనుల శాఖ చర్యలు తేలిపోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది. అక్రమ తవ్వకాల కేసులో అపరాధ రుసుములో ఏకంగా రూ.1.01 కోట్ల మినహాయింపు ఇవ్వడం విమర్శలకు తావిస్తోంది.

అంతన్నారు.. ఇంతన్నారు...

జగ్గంపేట మండలంలోని రామవరంలో సర్వే నంబరు 107లో 1.16 ఎకరాల్లో సుద్ద అక్రమ తవ్వకాలు జరిగాయి. ప్రభుత్వ భూమిలో అనధికారిక తవ్వకాలపై అప్పట్లో నిర్ధారణకు వచ్చిన భూగర్భ గనుల శాఖ అధికారులు అక్రమ తవ్వకాలకు పాల్పడినందుకు రూ.1,27,22,435 అపరాధ రుసుము విధించారు. ఈ మొత్తం 15 రోజుల్లో చెల్లించాలని నీలాద్రిరావుపేటకు చెందిన మూతిన శ్రీనివాసరావుకు నిరుడు ఏప్రిల్‌, మే నెలల్లో డిమాండ్‌ నోటీసులు జారీచేశారు. సాధారణ సీనరేజీ, 10 రెట్ల అపరాధ రుసుము, జిల్లా మినరల్‌ ఫండ్‌ అన్నింటితో కలిపి ఆ మొత్తాన్ని నిర్దేశిత గడువులోగా చెల్లించాలని నోటీసులో పేర్కొన్నారు. చెల్లించకపోతే రెవెన్యూ రికవరీ చట్టం ప్రయోగిస్తామని అప్పటి భూగర్భ గనుల శాఖ సహాయ సంచాలకులు కుమార్‌ స్పష్టంచేశారు. దీనిపై నిందితుడు వివరణ ఇచ్చినా గనుల శాఖ అప్పట్లో సంతృప్తి చెందలేదు.

రూ.26.07 లక్షలతో సరి

ఈ క్రమంలో శ్రీనివాసరావు ప్రభుత్వానికి రివిజన్‌ దరఖాస్తు చేసుకున్నారు. దీంతో రివిజన్‌ అథారిటీ ప్రభుత్వ మెమో నంబర్‌ 4096/ ఎం.ఐ.(2)/2020, తేదీ: 16.11.2021 ద్వారా రూ.11,23,890 సాధారణ సీనరేజీ రుసుము.. రూ.3,37,167 మినరల్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్‌ (ఎండీఎఫ్‌).. రూ.22,478.. రూ.11,23,890 అపరాధ రుసుము కింద చెల్లిస్తే సరిపోతుందని తేల్చిచెప్పింది. మిగిలిన మొత్తాన్ని రద్దుచేస్తున్నట్లు వెల్లడించింది. మొత్తమ్మీద రూ.1.27 కోట్ల అపరాధ రుసుమును రూ.26.07 లక్షలకు కుదించింది. తాజాగా జగ్గంపేటకు చెందిన మేకా వీర వెంకటరమణ స.హ. చట్టం ద్వారా రామవరం అక్రమ క్వారీ వ్యవహారంపై తీసుకున్న చర్యల వివరాలు కోరారు. అప్పట్లో భూగర్భ గనుల శాఖ విధించిన అపరాధ రుసుమును రివిజన్‌ అథారిటీ తగ్గించిన విషయాన్ని రాజమహేంద్రవరంలోని భూగర్భ గనుల శాఖ ఏడీ విష్ణువర్థనరావు గణాంకాలతో సహా వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని