logo

ఇసుక కొనలేం బాబోయ్‌..!

 గోదావరి వరదలకు ముందు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో టన్ను ఇసుక ధర రూ.475గా ఉండేది. ప్రస్తుతం స్టాక్‌ యార్డుల నుంచే అవసరమైన ఇసుక తీసుకోవాలి. ఇక్కడ గతంలో టన్ను రూ.625 ఉండగా ప్రస్తుతం రూ.850కు పెంచి విక్రయిస్తున్నారు.

Published : 12 Aug 2022 05:51 IST

కాతేరు వద్ద యార్డులో ఇసుక నిల్వలు

న్యూస్‌టుడే, సీతానగరం: గోదావరి వరదలకు ముందు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో టన్ను ఇసుక ధర రూ.475గా ఉండేది. ప్రస్తుతం స్టాక్‌ యార్డుల నుంచే అవసరమైన ఇసుక తీసుకోవాలి. ఇక్కడ గతంలో టన్ను రూ.625 ఉండగా ప్రస్తుతం రూ.850కు పెంచి విక్రయిస్తున్నారు. ఇసుక టన్ను రూ.677 అని బోర్డులు మాత్రం యార్డుల వద్ద కనిపిస్తాయి. దీంతోపాటు లారీ కిరాయిలను పెంచారు. ఉమ్మడి జిల్లాలో రావులపాలెం, గండేపల్లి, లాలాచెరువు, కాతేరు, ఆలమూరు, బోడసుకుర్రురేవు, పెద్దాపురం, రాచపల్లి తదితర ప్రాంతాల్లో స్టాకు యార్డులు ఏర్పాటుచేశారు. వరదలకు ముందు 8.25 లక్షల టన్నుల ఇసుకను నిల్వచేయగా సుమారుగా 1.50 లక్షల టన్నులు విక్రయించారు. ప్రస్తుతం యార్డుల్లో 6.75 లక్షల టన్నుల వరకు అందుబాటులో ఉన్నట్లు జేపీ సంస్థ ప్రతినిధులు తెలిపారు.

నాణ్యత అంతంతే..
నిల్వ చేసిన ఇసుకలో నాణ్యత కొరవడిందంటున్నారు. వరదలకు ముందు ఓపెన్‌ రీచ్‌ల్లో గండ్రు ఇసుకతోపాటు మెత్తని తౌడులాంటి దాన్ని కూడా సేకరించి యార్డులకు తరలించారు. దీంతో నిర్మాణాలకు, శ్లాబ్‌, ప్లాస్టరింగ్‌లకు వేర్వేరుగా కావాల్సిన ఇసుకంతా కలిసిపోయిందంటున్నారు. కొన్నిచోట్ల తీసుకెళ్లిన ఇసుక తమకు వద్దు అని వినియోగదారులు తిరస్కరిస్తున్నట్లు వాహనదారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం గోదావరి వరదలు కారణంగా యార్డుల ద్వారానే ఇసుకను తీసుకోవాలి. వరదలకు ముందు 20 టన్నుల ఇసుక రూ.9,500 లకు దొరికేదని, ప్రస్తుతం అదే ఇసుక యార్డుల్లో రూ.17 వేలు అవుతుందని కాకినాడకు చెందిన నాగేశ్వరరావు వాపోయారు. గతంలో రూ.7,500 తీసుకునే లారీ కిరాయి రూ.10 వేలకు పెంచారంటున్నారు.

సాంకేతిక సమస్యలతో..
గృహనిర్మాణాలకు అవసరమైన ఇసుకను వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేసినా సాంకేతికపరమైన సమస్యలు రావడంతో చాలాచోట్ల ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు ఇసుక దొరకడం లేదు. ఒకసారి అర్డర్‌ పెట్టే సమయంలో సాంకేతికపరమైన సమస్య ఏర్పడితే మరోసారి ప్రయత్నించినా వీలుకావడం లేదు. చరవాణి నంబరు ఎంటర్‌ చేయగానే మీ పేరున ఇసుక బుక్‌ అయిందని చెబుతుందే తప్ప ఎప్పటికీ ఆ ఇసుక రాదు. బయట వ్యక్తులను ఆశ్రయిస్తే రెట్టింపు ధరలు తీసుకుంటున్నారని వినియోగదారులు వాపోతున్నారు.

నిర్ణయించిన ధరకే ఇసుక
యార్డుల్లో ఉన్న ఇసుక డీఎంజీ నిర్ణయించిన ధరకే విక్రయిస్తున్నాం. ధరలను నిర్ణయించడం, తగ్గించడం అనేది డీఎంజీ తీసుకునే నిర్ణయం. నాడు-నేడు పనులకు యార్డుల నుంచే ఇసుకను సరఫరా చేస్తున్నాం. ప్రస్తుతం రెండు యార్డులే పనిచేస్తున్నాయి. నాలుగైదు రోజుల్లో మిగతా వాటిల్లో కూడా ఇసుకను లోడింగు చేస్తాం.  - శ్రీకాంత్‌రెడ్డి, జేపీ సంస్థ ప్రతినిధి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని