logo

‘ప్రభుత్వ అనైతిక విధానాలతో ఆక్వా రైతులకు ఇక్కట్లు’

ప్రభుత్వ అనైతిక విధానాలతో దోపిడీకి గురవుతున్న ఆక్వా రైతులకు జనసేన పార్టీ అండగా ఉంటుందని ఆ పార్టీ పీఏసీ రాష్ట్ర కమిటీ సభ్యుడు పితాని బాలకృష్ణ, అమలాపురం నియోజకవర్గ ఇన్‌ఛార్జి శెట్టిబత్తుల రాజబాబు అన్నారు.

Published : 29 Nov 2022 04:46 IST

ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న నాయకులు

మలికిపురం, న్యూస్‌టుడే: ప్రభుత్వ అనైతిక విధానాలతో దోపిడీకి గురవుతున్న ఆక్వా రైతులకు జనసేన పార్టీ అండగా ఉంటుందని ఆ పార్టీ పీఏసీ రాష్ట్ర కమిటీ సభ్యుడు పితాని బాలకృష్ణ, అమలాపురం నియోజకవర్గ ఇన్‌ఛార్జి శెట్టిబత్తుల రాజబాబు అన్నారు. ఆక్వా రైతుల సమస్యల పరిష్కారం కోసం ‘ఆక్వా రైతు ఆక్రందన’ పేరుతో పార్టీ చేపట్టిన ఆందోళన కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం సోమవారం మలికిపురంలో గుండుబోగుల పెద్దకాపు నివాసం వద్ద పార్టీ నాయకులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జగన్‌ ప్రభుత్వం అన్ని వ్యవస్థలను నాశనం చేసినట్లే ఆఖరికి ఆక్వా రైతులను కూడా ట్యాక్స్‌ల పేరుతో దోపిడీకి గురి చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కోనసీమలో వరి పండక, కొబ్బరి ఆదాయం లేక ఆక్వా సాగుతో ఆదాయం పొందుతున్న నేపథ్యంలో ప్రభుత్వ విధానాలతో దురదృష్టకర పరిస్థితులు నెలకొన్నాయన్నారు. జగన్‌ చేస్తున్న మోసాలను ప్రజలకు తెలియచేయడం కోసం, ఆక్వా రైతుల తరఫున ఈ నెల 30న అమలాపురంలో జిల్లా కలెక్టరుకు సమస్యల వినతి పత్రం ఇవ్వడానికి అధిక సంఖ్యలో కార్యకర్తలు తరలిరావాలని సమావేశంలో విజ్ఞప్తి చేశారు. పార్టీ నాయకులు తాడి మోహన్‌కుమార్‌, గెడ్డం మహలక్ష్మీప్రసాద్‌, చిక్కం భీముడు, సతీశ్‌, గుబ్బల రవికిరణ్‌, ఫణికుమార్‌, రంగరాజు, పెద్దకాపు, మల్లిపూడి సత్తిబాబు, సూరిశెట్టి శ్రీనివాస్‌, పినిశెట్టి బుజ్జి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని