logo

జెనీవా అసెంబ్లీ బరిలో శ్రీపాద ఫణిశాస్త్రి

గోదావరి తీరంలో పుట్టి పెరిగిన శ్రీపాద ఫణి శాస్త్రి జెనీవా అసెంబ్లీ బరిలో నిలిచి పోటీకి సై అంటూ ప్రచారంలో దూసుకుపోతున్నారు.

Published : 27 Mar 2023 05:16 IST

రాజమహేంద్రవరం సాంస్కృతికం: గోదావరి తీరంలో పుట్టి పెరిగిన శ్రీపాద ఫణి శాస్త్రి జెనీవా అసెంబ్లీ బరిలో నిలిచి పోటీకి సై అంటూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఏప్రిల్‌ 2న జరిగే పోలింగ్‌ కోసం అక్కడి ప్రజలతో మమేకమై విస్తృతంగా ప్రచారం చేస్తున్న ఫణి శాస్త్రి ఫోన్‌లో మాట్లాడి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. నటుడు, గాయకుడు జిత్‌మోహన్‌మిత్రా రెండో కుమారుడైన ఫణి మెకానికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేసి 20 ఏళ్లుగా యునైటెడ్‌ నేషన్స్‌ ఏజెన్సీలో చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌గా వ్యవహరిస్తూ స్విట్జర్లాండ్‌లో ఉంటున్నారు. వంద స్థానాలున్న జెనీవా అసెంబ్లీకి 690 మంది పోటీ పడుతుండగా మొత్తం 12 పార్టీలకు చెందిన అభ్యర్థులు అందులో ఉన్నారు. జెనీవాలో ప్రధాన రాజకీయ పార్టీలలో ఒకటైన గ్రీన్‌ పార్టీ తరఫున ఆయన పోటీ చేస్తున్నారు. ఇక్కడ 70 శాతం ఓటర్లు ప్రవాసీయులే. ‘మొదటి నుంచి రాజకీయాలపై ఆసక్తి. భారతదేశంలో జరిగే ప్రతి ఎన్నికలకు సంబంధించి ఆయా నాయకుల ప్రచార శైలిని బట్టి వారి గెలుపు అంచనా వేసేవాడిని. అలా మొదలైన రాజకీయ ఆసక్తితో ప్రస్తుతం స్విట్జర్లాండ్‌ జెనీవా స్టేట్‌ కౌన్సిల్‌కు(ఇక్కడ ఎమ్మెల్యే హోదా) పోటీ చేస్తున్నా. ఈ దేశంలో ఎన్నికల బరిలో నిలిచిన తొలి భారతీయుడిని నేనే. ప్రవాసీల సంక్షేమం, వారి ప్రయోజనాల పరిరక్షణ ప్రధాన ఎజెండాతో ప్రజలతో మమేకమవుతున్నా’ అని ఫణిశాస్త్రి చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని