logo

జగనన్నకాలనీలో యువకుడిని బలిగొన్న విద్యుత్తు తీగలు

జగనన్నకాలనీలో చేతికందే ఎత్తులో ఉన్న అధిక సామర్థ్యపు విద్యుత్తు తీగ తగిలి పెయింటింగ్‌ పనులు చేసే కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడు.

Published : 28 Mar 2024 03:00 IST

చేతికి అందేంత ఎత్తులోనే హెచ్‌టీ పాశాలు

ఇంటి ముందున్న హెచ్‌టీ తీగలు (అంతరచిత్రం) మృతుడు బులివీర్రాజు

సామర్లకోట, న్యూస్‌టుడే: జగనన్నకాలనీలో చేతికందే ఎత్తులో ఉన్న అధిక సామర్థ్యపు విద్యుత్తు తీగ తగిలి పెయింటింగ్‌ పనులు చేసే కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడు. నిబంధనలకు విరుద్ధంగా ఇంటి ముందు స్తంభాలు, తీగలు ఏర్పాటుచేయడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. కాకినాడ జిల్లా సామర్లకోట రాగంపేటరోడ్డులోని ఈటీసీ లేఅవుట్‌లో నిర్మించిన జగనన్నకాలనీలోని ఓ ఇంటికి పెయింట్లు వేసేందుకు తూర్పుగోదావరి జిల్లా రంగపేట మండలం ముకుందవరం గ్రామానికి చెందిన ముప్పిడి బులివీర్రాజు (31) తన మేనల్లుళ్లు పవన్‌, మనోజ్‌తో బుధవారం వచ్చారు. మేడపై పిట్టగోడకు రంగులు వేసేందుకు అక్కడే ఉన్న ఇనుప రేకులను మరోచోట పెట్టాలని బులివీర్రాజు వాటిని పైకి ఎత్తడంతో ఇంటికి సమీపంలోనే ఉన్న 11 కేవీ  తీగలకు తగిలి విద్యుదాఘాతంతో అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. వెంటనే సామర్లకోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతునికి భార్య కీర్తన, ఏడాదిన్నర వయసున్న కుమార్తె మేన్సీ ఉన్నారు. భార్య ప్రస్తుతం గర్భిణి కావడంతో  బంధువుల రోదనలు మిన్నంటాయి. ఇళ్లకు దూరంగా ఉండాల్సిన విద్యుత్తు తీగలను నిబంధనలకు విరుద్ధంగా అతి దగ్గరలోనే ఏర్పాటుచేయడంతో ప్రమాదం జరిగిందని బంధువులు విలపిస్తూ చెప్పారు.

సీఎం ప్రారంభిస్తారని హడావుడి పనులు..

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఈ కాలనీని గత ఏడాది అక్టోబరు 12న ప్రారంభించారు. దీనికి ముందు అధికారులు హడావుడిగా పనులు పూర్తి చేయించారు. ఇళ్లు ప్రారంభించిన అయిదు నెలల్లోనే విద్యుత్తు తీగ తగిలి పెయింటింగ్‌ కార్మికుడు మృతిచెందడం గమనార్హం. ప్రస్తుతం కొందరు లబ్ధిదారులు కాలనీలో ఇళ్ల నిర్మాణాలు చేస్తున్నారు. కాలనీకి విద్యుత్‌ సరఫరా నిమిత్తం సమీపంలోనే సబ్‌స్టేషన్‌ నిర్మించి ఇళ్ల ముందు నుంచే 11 కేవీ తీగలు వేశారు.  నిబంధనల ప్రకారం ఇంటికి తీగలు కనీసం అయిదడుగుల దూరంలో ఉండాలి. ప్రమాదం జరిగిన ఇంటికి రెండు వైపులా మూడు, రెండడుగుల దూరంలోనే మృత్యుపాశాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభోత్సవం కావడంతో హడావుడిగా పనులు పూర్తిచేయించిన అధికారులు పెయింటింగ్‌ కార్మికుడి మృతికి కారకులయ్యారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని