logo

అనపర్తి బరిలో విశ్రాంత సైనికుడు

త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి అనపర్తి నియోజకవర్గం తెదేపా, భాజపా, జనసేన కూటమి అభ్యర్థిగా విశ్రాంత జవాన్‌ ములగపూడి శివకృష్ణంరాజు పేరును అధిష్ఠానం బుధవారం రాత్రి ప్రకటించింది.

Updated : 28 Mar 2024 07:05 IST

అభ్యర్థిగా శివకృష్ణంరాజును ప్రకటించిన భాజపా
21 స్థానాల్లో కూటమి అభ్యర్థుల ఖరారు

శివకృష్ణంరాజు

ఈనాడు, రాజమహేంద్రవరం, న్యూస్‌టుడే, బిక్కవోలు: త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి అనపర్తి నియోజకవర్గం తెదేపా, భాజపా, జనసేన కూటమి అభ్యర్థిగా విశ్రాంత జవాన్‌ ములగపూడి శివకృష్ణంరాజు పేరును అధిష్ఠానం బుధవారం రాత్రి ప్రకటించింది. దీంతో ఉమ్మడి జిల్లాలో కూటమి తరఫున మొత్తం 21 నియోజకవర్గాల్లోనూ అభ్యర్థులను ఖరారు చేసినట్లైంది. బిక్కవోలు మండలం రంగాపురానికి చెందిన ఈయన శివకృష్ణంరాజు ఆర్మీలో ఉద్యోగిగా దేశానికి సేవలు అందించారు. తండ్రి ఆరోగ్య పరిస్థితుల నేపథ్యంలో 2020లో స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేశారు. రెండేళ్లుగా భాజపా నియోజకవర్గం కన్వీనర్‌గా కొనసాగుతున్నారు. ఈయన తండ్రి మూడు దశాబ్దాలుగా భాజపాలో కొనసాగుతూ పార్టీలో వివిధ హోదాల్లో సేవలందించారు.

పొత్తు నేపథ్యంలో..

అనపర్తి నుంచి మాజీ ఎమ్మెల్యే నల్లమల్లి రామకృష్ణారెడ్డి(తెదేపా) బరిలో ఉంటారని ఆ పార్టీ అధిష్ఠానం విడుదల చేసిన తొలి జాబితాలోనే ప్రకటించింది. ఆ తరువాత భాజపాతో పొత్తు కుదిరిన నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో కొన్నిచోట్ల మార్పులతో అనపర్తి స్థానాన్ని భాజపాకు ఇవాల్సి వచ్చినట్లు చెబుతున్నారు. పార్టీ శ్రేణులు నల్లమిల్లికి టికెట్‌ ఇవ్వాలని కోరుతూ వివిధ రూపాల్లో నిరసన తెలిపాయి. రెండు రోజుల క్రితం రాజమహేంద్రవరం విమానాశ్రయానికి వచ్చిన చంద్రబాబు సతీమణి భువనేశ్వరిని కలిసి అనపర్తి స్థానాన్ని తెదేపాకే కేటాయించాలని కోరారు. ప్రస్తుత మార్పులు నేపథ్యంలో రామకృష్ణారెడ్డి పార్టీ క్యాడర్‌తో గురువారం సమవేశం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

నియోజకవర్గం: అనపర్తి పార్టీ: భాజపా
పేరు: మునగపాటి శివరామకృష్ణంరాజు
పుట్టిన తేదీ: 22071986
విద్యార్హత: బి.ఎ., బి.ఎల్‌. ఫైనల్‌ సంవత్సరం
వృత్తి నేపథ్యం: మిలటరీలో 2004 డిసెంబర్‌లో చేరిన ఈయన ఇంటెలిజెన్సు విభాగంలో వివిధ హోదాల్లో తొమ్మిది రాష్ట్రాల పరిధిలో సేవలందించారు. హవల్దారుగా ఉద్యోగ విరమణ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని