logo

దళితులపై దాడులు చేసేవారికి జగన్‌ పదోన్నతులు

దళితులపై దాడులు చేసేవారికే ముఖ్యమంత్రి జగన్‌ పదోన్నతులు ఇస్తున్నారని తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి మహాసేన రాజేష్‌  ఆరోపించారు.

Published : 18 Apr 2024 06:18 IST

మహాసేన రాజేష్‌ విమర్శ

కాకినాడ నగరం: దళితులపై దాడులు చేసేవారికే ముఖ్యమంత్రి జగన్‌ పదోన్నతులు ఇస్తున్నారని తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి మహాసేన రాజేష్‌  ఆరోపించారు. కాకినాడలోని జిల్లా తెదేపా కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశంలో రాజేష్‌ మాట్లాడారు. దళితులకు శిరోముండనం చేయించిన తోట త్రిమూర్తులుకు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టడంతో పాటు మండపేట అసెంబ్లీ స్థానానికి వైకాపా అభ్యర్థిగా ప్రకటించారన్నారు. దళిత యువకుడు సుబ్రహ్మణ్యాన్ని హతమార్చి డోర్‌ డెలివరీ చేసిన అనంతబాబును ఎమ్మెల్సీగా కొనసాగించడంతో పాటు వెంట తిప్పుకొంటున్నారన్నారు. శిరోముండనం కేసులో తన పార్టీకే చెందిన త్రిమూర్తులుకు విశాఖ ప్రత్యేక న్యాయస్థానం జైలు శిక్ష విధిస్తే సీఎం జగన్‌ కనీసం నోరుమెదపకపోవడం గమనార్హమన్నారు. బాధితులు కోటి చినబాబు, గణపతి 28 ఏళ్లుగా సాగించిన పోరాటానికి తగిన న్యాయం జరిగిందన్నారు. 2024 ప్రజాతీర్పు దళిత ద్రోహులను తరిమికొట్టేలా ఉండాలన్నారు. గత ఎన్నికల్లో జగన్‌ కోడికత్తి శ్రీనును బలి చేయగా.. అతను అయిదేళ్లు జైల్లో మగ్గాడన్నారు. వివేకా హత్య కేసులో నిందితుడైన అవినాష్‌రెడ్డి జైలుకు వెళ్లకుండా జగన్‌ కాపాడుకున్నారని, రానున్న రోజుల్లో జగన్‌ జైలుకు వెళ్లనున్నారని చెప్పడానికి కోర్టు తీర్పులే నిదర్శనమన్నారు. శిరోముండనం కేసు తీర్పుపై వైకాపాలో కీలక నేతలు, ఆ పార్టీలోని ఎస్సీ నాయకులు స్పందించకపోవడం దారుణమన్నారు. రాష్ట్ర హోం మంత్రి దళిత వర్గానికి చెందిన వ్యక్తే అయినప్పటికీ ఈ తీర్పుపై స్పందించలేదన్నారు. ప్రభుత్వం స్పందించి ఎమ్మెల్సీలు తోట త్రిమూర్తులు, అనంత బాబును తక్షణం పదవుల నుంచి తప్పించాలన్నారు. విలేకరుల సమావేశంలో జిల్లా తెదేపా ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు కొల్లాబత్తుల అప్పారావు, పలువురు నాయకులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని