logo

గుర్తుల గందరగోళం

జనసేనకు కేటాయించిన గాజు గ్లాసు గుర్తును ఇతర పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులకు సైతం కేటాయించడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

Published : 30 Apr 2024 06:07 IST

ఇతర పార్టీల అభ్యర్థులకూ గాజుగ్లాసు కేటాయింపుపై చర్చ

జగ్గంపేట, న్యూస్‌టుడే: జనసేనకు కేటాయించిన గాజు గ్లాసు గుర్తును ఇతర పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులకు సైతం కేటాయించడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా    వ్యాప్తంగా కాకినాడ ఎంపీ, ఆరు ఎమ్మెల్యే స్థానాల్లో (పిఠాపురం, కాకినాడ గ్రామీణం, నిడదవోలు, రాజానగరం, పి.గన్నవరం, రాజోలు) జనసేన పార్టీ అభ్యర్థులు కూటమి నుంచి బరిలో నిల్చున్నారు. వారు పోటీలో లేని పలు నియోజకవర్గాల్లో ఇతర అభ్యర్థులకు ఇదే గుర్తును కేటాయించారు. ఉమ్మడి జిల్లాలో జనసేన కాకుండా ఏడుగురు ఎమ్మెల్యే అభ్యర్థులు, ఒక ఎంపీ అభ్యర్థి ఇదే గుర్తుపై పోటీ చేయనున్నారు.

ఈ నియోజకవర్గాల్లో ..: కోనసీమ జిల్లా రామచంద్రపురం- జై శ్రీసూర్యేంద్రనాథ్‌ బాబుజీ (స్వతంత్ర), మండపేట- మార్ని సత్యనారాయణ (స్వతంత్ర), కొత్తపేట- బొచ్చా శ్రీనివాస్‌రావు (స్వతంత్ర)కు గాజుగ్లాసు గుర్తు కేటాయించారు. కాకినాడ జిల్లాలో పెద్దాపురం- దువ్వాడ కన్నయ్య (స్వతంత్ర), జగ్గంపేట- పాటంశెట్టి సూర్యచంద్ర (స్వతంత్ర), తూర్పుగోదావరి జిల్లాలో కొవ్వూరు- కొయ్యే శేఖరబాబు (స్వతంత్ర), రాజమహేంద్రవరం నగరం ఎమ్మెల్యేగా, తూర్పుగోదావరి ఎంపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న మేడా శ్రీనివాస్‌ (రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్‌) గాజు గ్లాసు గుర్తు కేటాయించారు. కాకినాడ నగర నియోజకవర్గంలో ఒకరికి కేటాయించినట్లు తెలుస్తోంది. స్పష్టత రావాలి.

ఏరికోరి అడిగారు..

జగ్గంపేటలో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ పూర్తయిన తర్వాత 14 మంది పోటీలో నిలిచారు. అందులో ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు గాజుగ్లాసు గుర్తు కావాలని కోరారు. ఎన్నికల రిట్నరింగ్‌ అధికారి ఎం.శ్రీనివాసరావు సమక్షంలో లాటరీ తీయగా పాటంశెట్టి సూర్యచంద్రను ఆ గుర్తు వరించింది. ఈయన ఇదే నియోజకవర్గానికి జనసేన ఇన్‌ఛార్జిగా పనిచేశారు. సీటు రాకపోవడంతో స్వతంత్రంగా పోటీ చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని