logo

పల్నాడును రావణకాష్టంగా మార్చారు

వైకాపా నేతలు హత్యలకు, దాడులకు పాల్పడుతూ పల్నాడు ప్రాంతాన్ని రావణకాష్టంగా మార్చారని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు మండిపడ్డారు. జొన్నలగడ్డ ఘటనలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డాక్టర్‌ అరవిందబాబును ఆదివారం మాజీ మంత్రులు నక్కా ఆనందబాబు, ఆలపాటి రాజేంద్రప్రసాదు,

Published : 17 Jan 2022 02:33 IST

మాజీమంత్రి నక్కా ఆనందబాబు ధ్వజం

డాక్టర్‌ అరవిందబాబును పరామర్శించిన నేతలు

నిరసన ప్రదర్శనలో పాల్గొన్న తెదేపా శ్రేణులు

నరసరావుపేట పట్టణం, న్యూస్‌టుడే: వైకాపా నేతలు హత్యలకు, దాడులకు పాల్పడుతూ పల్నాడు ప్రాంతాన్ని రావణకాష్టంగా మార్చారని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు మండిపడ్డారు. జొన్నలగడ్డ ఘటనలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డాక్టర్‌ అరవిందబాబును ఆదివారం మాజీ మంత్రులు నక్కా ఆనందబాబు, ఆలపాటి రాజేంద్రప్రసాదు, అశోక్‌బాబు, మాణిక్యాలరావు తదితరులు పరామర్శించారు. ఈసందర్భంగా ఆనందబాబు మాట్లాడుతూ మాచర్ల ఇన్‌ఛార్జిగా బ్రహ్మారెడ్డిని నియమించిన అనంతరం వైకాపా ప్రభుత్వానికి భయం పట్టుకుందన్నారు. జొన్నలగడ్డలో రాజశేఖరరెడ్డి విగ్రహం మాయం అయితే తెదేపా కార్యకర్తలను అరెస్టు చేసి రిమాండ్‌ పెట్టడం సరికాదన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలుపుతున్న డాక్టర్‌ అరవిందబాబు, పార్టీ కార్యకర్తలపై పోలీసులు, వైకాపా కార్యకర్తలు దాడులకు పాల్పడి హత్యాయత్నం చేశారని దీనికి పోలీసు శాఖ సమాధానం చెప్పాలన్నారు. ఎన్ని తప్పుడు కేసులు మోపినా భయపడేది లేదన్నారు.

తెదేపా ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన : జొన్నలగడ్డలో అరవిందబాబుపై పోలీసులు జులుం ప్రదర్శించటాన్ని ఖండిస్తూ తెదేపా ఆధ్వర్యంలో ఆదివారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. గుంటూరు రోడ్డులోని పార్టీ కార్యాలయం నుంచి అంబేడ్కర్‌ విగ్రహం వరకు ప్రదర్శన సాగింది. ఈసందర్భంగా మాజీమంత్రి రవీంద్ర మాట్లాడుతూ ఈ ప్రభుత్వం పల్నాడులో 100మందిని హత్య చేయించిందన్నారు. మాచర్ల నియోజకవర్గంలో తెదేపా బీసీ నేత చంద్రయ్యను ఉదయం వేళలో నడివీధిలో హత్య చేశారని, ఎన్ని ఇబ్బందులు పెట్టినా భయపడేదిలేదన్నారు. మాజీమంత్రి జవహర్‌ మాట్లాడుతూ బలహీన వర్గాలను లక్ష్యంగా చేసుకుని పోలీసులు వైకాపా నేతలు దాడులు చేస్తున్నారన్నారు. డాక్టర్‌ అరవిందబాబును హతమార్చేందుకు పోలీసులు కుట్రపన్నారన్నారు. ముఖ్యమంత్రి జైలుకెళ్లిన మరుక్షణం ఇలాంటి పోలీసులు అంతా జైలుకు వెళ్లక తప్పదన్నారు. నరసరావుపేట ఎమ్మెల్యే దోపిడిదారుడీగా మారారని ఆరోపించారు. అలాంటి ఎమ్మెల్యే దగ్గర పనిచేస్తున్న పోలీసులు అలాగే వ్యవహరిస్తున్నారని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ గురజాల నియోజకవర్గంలో తొమ్మిది మందిని హత్య చేశారన్నారు. వైకాపా ప్రభుత్వం పూర్తిగా భ్రష్టుపట్టిందని తప్పులను కప్పిపుచ్చుకునేందుకు హత్య రాజకీయాలు చేయిస్తుందన్నారు. డాక్టర్‌ అరవిందబాబుపై పోలీసులు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సీఐ భక్తవత్సలరెడ్డి నిన్నటి దాకా మాచర్లలో అరాచకాలు చేసి ఇక్కడకి వచ్చారన్నారు. వైకాపా ప్రభుత్వం పతనమవుతుందని సీఐ ఉద్యోగం కావాలో, వ్యవసాయం చేసుకుంటావో తేల్చుకోవాలన్నారు. వైకాపా ఎమ్మెల్యేలు, నాయకులు చెప్పినట్లు చేస్తే పోలీసులకు ఇబ్బందులు తప్పవన్నారు.

దాడి చేసిన వారిపై కేసు నమోదుకు డిమాండ్‌

జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ జొన్నలగడ్డలో వైఎస్‌ విగ్రహం మాయం చేయటంలో వైకాపా ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పాత్ర ఉందన్నారు. ఆయన చేస్తున్న అక్రమాలతో వైకాపా కార్యకర్తలు దూరమయ్యారని ఎమ్మెల్యే గోపిరెడ్డి కుట్ర పన్ని విగ్రహం మాయం చేయించారని పేర్కొన్నారు. ఇలాంటి చిల్లర రాజకీయాలు చేసిన గోపిరెడ్డి ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. అరవిందబాబుపై జులుం ప్రదర్శించిన పోలీసులపై కేసు నమోదు చేయాలని, ఆయనను ఆసుపత్రికి తీసుకొస్తున్న అంబులెన్స్‌పై వైకాపా కార్యకర్తలు దాడి చేసి హత్యాయత్నం చేస్తే పోలీసులు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేసి హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. తెనాలి శ్రావణకుమార్‌ మాట్లాడుతూ ఎమ్మెల్యే గోపిరెడ్డి అకృత్యాలకు ఇద్దరు తెదేపా కార్యకర్తలపై పోలీసులు అక్రమ కేసులు మోపారన్నారు. ఎమ్మెల్యే గోపిరెడ్డి నిజస్వరూపం నియోజకవర్గ ప్రజలు గుర్తించాలన్నారు. పార్టీ నేతలు రాజా మాస్టారు, నల్లపాటి రామచంద్రప్రసాదు, కడియాల రమేష్‌, కొట్టాకిరణ్‌కుమార్‌, తదితరులు పాల్గొన్నారు. అనంతరం వివేకానంద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డాక్టర్‌ అరవిందబాబును పరామర్శించారు.

తెదేపా నేతలపై కేసు నమోదు

నరసరావుపేట పట్టణం, న్యూస్‌టుడే: జొన్నలగడ్డ వద్ద ధర్నా చేసి రాకపోకలకు ఆటంకం కలిగించిన తెదేపా నేతలు, కార్యకర్తలపై కేసు నమోదు చేసినట్లు గ్రామీణ పోలీసులు ఆదివారం తెలిపారు. డాక్టర్‌ అరవిందబాబు, నల్లపాటి రామచంద్రప్రసాదుతో పాటు మరికొందరు నేతలు, జొన్నలగడ్డకు చెందిన కార్యకర్తలపై కేసు నమోదు చేశామని ఎస్సై బాలనాగిరెడ్డి తెలిపారు.

చికిత్స పొందుతున్న అరవిందబాబును పరామర్శిస్తున్న నేతలు కొల్లు రవీంద్ర,

జీవీ ఆంజనేయులు, శ్రావణకుమార్‌, యరపతినేని శ్రీనివాసరావు, జవహర్‌ తదితరులు
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని