logo

ఒంటిపై పెట్రోలు పోసుకుని.. హల్‌చల్‌

దంపతుల మధ్య వివాదాల నేపథ్యంలో కేసు నమోదైన ఓ ఆటోడ్రైవరు తెనాలి న్యాయస్థానాల ప్రాంగణంలో పెట్రోలు సీసాతో గురువారం హడావుడి చేశాడు. వన్‌టౌన్‌ పోలీసులు తెలిపిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. పట్టణంలోని రైస్‌ కాలనీకి చెందిన ఆటోడ్రైవర్‌ ప్రదీప్‌ జయచంద్రకు

Updated : 21 Jan 2022 06:09 IST

తెనాలి న్యాయస్థానాల ప్రాంగణంలో ఓ ఆటోడ్రైవర్‌ హడావుడి


ఒంటిపై పెట్రోలు పోసుకొంటున్న ప్రదీప్‌ జయచంద్ర

తెనాలి టౌన్‌, న్యూస్‌టుడే: దంపతుల మధ్య వివాదాల నేపథ్యంలో కేసు నమోదైన ఓ ఆటోడ్రైవరు తెనాలి న్యాయస్థానాల ప్రాంగణంలో పెట్రోలు సీసాతో గురువారం హడావుడి చేశాడు. వన్‌టౌన్‌ పోలీసులు తెలిపిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. పట్టణంలోని రైస్‌ కాలనీకి చెందిన ఆటోడ్రైవర్‌ ప్రదీప్‌ జయచంద్రకు 2012లో నాజరుపేటకు చెందిన అరిత అనే యువతితో వివాహమైంది. మద్యానికి బానిసైన అతని వేధింపులకు తాళలేక భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. అయినా అతను తరచూ మద్యం తాగి ఆమె వద్దకు వెళ్లి గొడవ చేసేవాడు. దాంతో ఆమె 2019లో భర్త వేధింపులపై పోలీస్‌స్టేషన్లో కేసు పెట్టారు. ఇది న్యాయస్థానంలో నడుస్తోంది. కాగా బుధవారం రాత్రి ప్రదీప్‌ మద్యం తాగి మరోమారు అరిత ఇంటికి కత్తితో వెళ్లి గొడవ చేయసాగాడు. వాలంటీరుగా పనిచేస్తున్న ఆమె దిశ యాప్‌ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు ఘటనా స్థలికి వెళ్లగా.. ప్రదీప్‌ వారిపై తిరగబడ్డాడు. అతను మద్యం మత్తులో ఉన్నందున పోలీసులు అతని బంధువులను పిలిపించి, వారికి అప్పగించి, సమస్యను పరిష్కరించి వచ్చేశారు. కాగా గురువారం ఉదయం అతను మరోమారు భార్య ఇంటికి పెట్రోలు సీసాతో వెళ్లి.. తనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తావా అంటూ ఆమె మీద పెట్రోలు పోసి, నిప్పు అంటించడానికి ప్రయత్నించాడు. ఆమె కేకలు విని, చుట్టుపక్కల వారు రావడంతో అక్కడి నుంచి ఆటోలో పరారై, న్యాయస్థానాల ఆవరణకు చేరుకొని హడావుడి చేయసాగాడు. అదే సమయంలో అతని భార్య వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని జరిగిన విషయాన్ని పోలీసులకు వివరించారు. కాగా న్యాయస్థానాల ఆవరణలో గొడవ చేస్తున్న ప్రదీప్‌ను న్యాయవాది హరిదాసుగౌరీశంకర్‌ తదితరులు, పోలీసులు అదుపు చేసి, పెట్రోలు సీసాను అతని నుంచి లాగివేసి, అతన్ని వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఇదే ఆవరణలో కొద్ది రోజుల క్రితం ఓ అధ్యాపకుడు పెట్రోలు పోసుకుని ఆత్మహత్య చేసుకున్న క్రమంలో ఈ ఘటన కూడా చర్చనీయాంశమైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని