logo

రహదారి విస్తరణకు వేళాయే

మార్కెట్‌ యార్డు నుంచి బాపట్ల ఇంజినీరింగ్‌ కళాశాల వరకు 216 జాతీయ రహదారిని వంద అడుగుల వెడల్పున నాలుగు వరుసలుగా విస్తరించాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. విస్తరణ పనులకు అవసరమైన భూసేకరణకు అయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. సీఎం వైఎస్‌ జగన్‌కు రోడ్డు విస్తరణ పనుల

Published : 26 Jan 2022 06:24 IST

బాపట్లలో భవనాల యజమానులతో అధికారుల చర్చలు

150 కట్టడాల తొలగింపునకు ప్రతిపాదన


విస్తరించనున్న రహదారి

బాపట్ల, న్యూస్‌టుడే మార్కెట్‌ యార్డు నుంచి బాపట్ల ఇంజినీరింగ్‌ కళాశాల వరకు 216 జాతీయ రహదారిని వంద అడుగుల వెడల్పున నాలుగు వరుసలుగా విస్తరించాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. విస్తరణ పనులకు అవసరమైన భూసేకరణకు అయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. సీఎం వైఎస్‌ జగన్‌కు రోడ్డు విస్తరణ పనుల ఆవశ్యకత వివరించి ఉప సభాపతి రఘుపతి అనుమతి మంజూరు చేయించారు. ఈ మార్గంలో మార్కెట్‌ యార్డు నుంచి పాత బస్టాండ్‌ వరకు రహదారి 90 నుంచి 100 అడుగుల వెడల్పు ఉంది. పాత బస్టాండ్‌ నుంచి గడియార స్తంభం సెంటర్‌ వరకు 36 అడుగుల నుంచి 58 అడుగుల వెడల్పు మాత్రమే ఉంది.

సిబ్బందితో సర్వే..: పాత బస్టాండ్‌ నుంచి గడియార స్తంభం, బీఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయం వరకు 80 అడుగులు, మిగిలిన ప్రాంతంలో 100 అడుగుల వెడల్పున రోడ్డు విస్తరించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత రహదారి కొలతలు, విస్తరణకు కావాల్సిన భూమి సేకరణకు సర్వేయర్లు, సిబ్బందితో సర్వే చేయించారు. తొలి దశలో పాతబస్టాండ్‌ నుంచి గడియార స్తంభం సెంటర్‌ వరకు 150 కట్టడాలు తొలగించాల్సి ఉంటుందని అంచనావేశారు. త్వరలో పోలేరమ్మ ఆలయం నుంచి శ్రీనివాస మహల్‌ వరకు భూసేకరణపై కొలతలు వేయనున్నారు.

బాపట్లలో 216-ఎ జాతీయ రహదారి విస్తరణ పనులకు వేగంగా అడుగులు పడుతున్నాయి. రోడ్డు విస్తరణకు చేపట్టాల్సిన భూసేకరణపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ మార్గం ఇరుకుగా ఉండే పాతబస్టాండ్‌ నుంచి గడియార స్తంభం వరకు 80 అడుగుల వెడల్పున విస్తరించటానికి 150 కట్టడాలు తొలగించాల్సి ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేశారు. భవనాల యజమానులు ఉప సభాపతి కోన రఘుపతిని కలిసి రహదారి విస్తరణ అరవై అడుగులకే పరిమితం చేయాలని కోరారు. అంతకు మించి తొలగిస్తే తాము జీవనోపాధి కోల్పోతామని వాపోయారు. భూసేకరణ నష్ట పరిహారాన్ని టీడీఆర్‌ బాండ్ల రూపంలో కాకుండా నగదు రూపంలో చెల్లించాలని యజమానులు కోరుతున్నారు.

నష్టపరిహారంగా నగదు ఇవ్వాలని వినతి..

పట్టణంలో ఇప్పటి వరకు రైల్వేస్టేషన్‌- డీఎస్పీ కార్యాలయం మార్గం, రథంబజారు, సూర్యలంక రోడ్డు, శివాలయం బజారు విస్తరించారు. రహదారి విస్తరణలో స్థలాలు కోల్పోతున్నవారికి టీడీఆర్‌ బాండ్లను పురపాలక అధికారులు అందజేశారు. అదేవిధంగా, 216 జాతీయ రహదారి విస్తరణంలో కట్టడాలు, స్థలాలు కోల్పోయేవారికీ బాండ్లు ఇవ్వాలని నిర్ణయించారు. ఇటీవల వ్యాపారులు, భవనాల యజమానులు క్యాంప్‌ కార్యాలయంలో ఉప సభాపతిని కలిశారు. రహదారిని 80 అడుగుల వెడల్పున విస్తరిస్తే తీవ్రంగా నష్టపోతామని తెలిపారు. విస్తరణను అరవై అడుగుల వరకు మాత్రమే పరిమితం చేయాలని కోరారు. స్థలాలు కోల్పోయేవారికి టీడీఆర్‌ బాండ్లు బదులు నష్టపరిహారంగా నగదు అందజేయాలని విజ్ఞప్తి చేశారు. వారు చెప్పి విషయాలు సావధానంగా ఉన్న ఉప సభాపతి పరిశీలించి త్వరలో నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. అధికారులతో ఆయన సోమవారం సమావేశమై భూసేకరణకు చేస్తున్న ప్రతిపాదనలపై చర్చించారు. వ్యాపారులు, యజమానులతో అధికారులు ఈ నెల 27న సమావేశం నిర్వహించి రహదారి విస్తరణ పనులు, భూసేకరణపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది.

పట్టణాభివృద్ధికి సహకరించాలి

పట్టణాభివృద్ధికి రహదారుల విస్తరణ తప్పనిసరి. బాపట్ల- చీరాల రోడ్డు విస్తరణకు భవన యజమానులు, వ్యాపారులు సహకరించాలి. ఆర్థిక వనరుల పరిమితి దృష్ట్యా ప్రభుత్వ ఆదేశాల మేరకు భవనాలు, స్థలాలు కోల్పోయేవారికి టీడీఆర్‌ బాండ్లు కేటాయిస్తున్నాం. గతంలో ఆస్తి విలువకు రెండు రెట్లు సమానమైన బాండ్‌ ఇచ్చాం. ప్రధాన మార్గం కావటంతో యజమానులకు ఎక్కువ ప్రయోజనం కలిగేలా ఆస్తి మార్కెట్‌ విలువకు నాలుగు రెట్లు సమానమైన బాండ్లు అందజేయాలని నిర్ణయించాం. - భానుప్రతాప్‌, పురపాలక కమిషనర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని