logo

ఆడాలంటే భారీగా చెల్లించాల్సిందే

ప్రభుత్వం క్రీడా మైదానాల వినియోగ రుసుములను భారీగా పెంచింది. ఈ మేరకు రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ నుంచి వెలువడిన ఉత్తర్వులు జిల్లాలోని గుంటూరు, తెనాలి, పొన్నూరు క్రీడా మైదానాల పర్యవేక్షక అధికారులకు చేరాయి. మే నెల నుంచి పెంచిన

Published : 20 May 2022 04:15 IST

క్రీడా మైదానాల వినియోగ రుసుముల పెంపు
తెనాలి టౌన్‌, న్యూస్‌టుడే

తెనాలి స్టేడియంలో బ్యాడ్మింటన్‌ ఆడుతున్న క్రీడాకారులు

ప్రభుత్వం క్రీడా మైదానాల వినియోగ రుసుములను భారీగా పెంచింది. ఈ మేరకు రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ నుంచి వెలువడిన ఉత్తర్వులు జిల్లాలోని గుంటూరు, తెనాలి, పొన్నూరు క్రీడా మైదానాల పర్యవేక్షక అధికారులకు చేరాయి. మే నెల నుంచి పెంచిన రుసుములు వసూలు చేయడానికి అధికారులు ప్రయత్నించగా క్రీడాకారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. గుంటూరు, తెనాలి స్టేడియంల వద్ద నిరసనలు కూడా జరిగాయి.

జిల్లాలోని స్టేడియాల్లో బ్యాడ్మింటన్‌, టేబుల్‌ టెన్నిస్‌, టెన్నిస్‌, క్రికెట్, స్విమ్మింగ్‌, స్కేటింగ్‌ వంటి ఆటలను వసతులు అందుబాటులో ఉన్న చోట ఆసక్తి ఉన్న వారంతా వచ్చి అడుకునే వారు. ఇందుకుగాను శాశ్వత ప్రవేశ రుసుము కింద రూ.2 వేలు, నెలకు ఫీజు రూ.500 నుంచి రూ.800 వరకూ ఉండేవి. వాటిని ఇటీవల ఒక్కసారిగా అధికంగా పెంచారు. గతంలో లేనివిధంగా రద్దీ సమయాలు, రద్దీ తక్కువగా ఉండే వేళలంటూ విభజించారు. ఉదయం 5 నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 5  నుంచి రాత్రి 8 గంటల వరకు రద్దీ సమయాలుగానూ, ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు, రాత్రి 8 నుంచి 10 గంటల వరకు రద్దీ తక్కువగా ఉన్న సమయాలుగానూ నిర్ణయించారు. రద్దీ వేళల్లో ప్రవేశ రుసుమును రూ.3 వేలుగా, నెల వారీ ఫీజును రూ.1500కు, అలాగే రద్దీ తక్కువగా ఉండే వేళల్లో అయితే ప్రవేశ రుసుము రూ.2 వేలు, నెల వారీ ఫీˆజు రూ.1000గా పెంచేశారు.


యోగా సాధకులూ నెలకు రూ.1000 చెల్లించాల్సిందే

క్రీడా మైదానాల్లో యోగా చేసుకునేవారికి ఇప్పటివరకు ప్రత్యేకంగా ఎలాంటి రుసుము లేదు. స్టేడియం నిర్వహణ కమిటీలు కోరితే నెలకు రూ.100 చొప్పున నామమాత్రపు రుసుమును కొందరు ఇచ్చేవారు. అయితే ఇప్పుడు వచ్చిన ఉత్తర్వుల్లో యోగా సాధకులు కూడా నెలకు రూ.1000 రుసుము చెల్లించాలని స్పష్టం చేశారు. మైదానాల పర్యవేక్షకుల నుంచి ఈ సమాచారం విన్న యోగా సాధకులు నివ్వెరపోతున్నారు. ఉదాహరణకు తెనాలి స్డేడియం తీసుకుంటే ఇక్కడ గత కొన్ని సంవత్సరాలుగా 14 మంది యోగా సాధన చేస్తున్నారు. నెలకు రూ.1000 చెల్లించాలని చెప్పేసరికి వారు ఇకపై ఇళ్ల వద్దే సాధన చేసుకుంటామని స్పష్టం చేశారు. ఇదే తీరులో ఇక్కడ సుమారు 70 మందికి పైగా బ్యాడ్మింటన్‌ ఆటగాళ్లు ఇప్పటివరకూ నెలకు రూ.700 చెల్లించి ఉదయం సమయంలో ఆడుకునేవారు. నెలకు రూ.1500 చొప్పున కట్టాలని వారికి చెప్పడంతో తాము అంత చెల్లించలేమని విచారం వ్యక్తంచేశారు. వాస్తవానికి మే నెల తొలి వారంలోనే నెలవారీ రుసుములు వసూలయ్యేవి. ఈ మారు ఇప్పటివరకు ఎవరూ ఫీజలు కట్టలేదు. మొత్తం మీద ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మీద క్రీడాకారులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఆటలను కూడా వాణిజ్యపరంగా చూడడం దారుణమని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.


అందరి వినతి మేరకు రుసుములు తగ్గొచ్చు
- డాక్టర్‌ వి.శ్రీనివాస్‌, ముఖ్య కార్యనిర్వహణాధికారి, క్రీడాప్రాధికార సంస్థ, గుంటూరు జిల్లా

రుసుములు తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరుతూ క్రీడాకారులు వినతిపత్రాలు ఇచ్చారు. వాటిని రాష్ట్ర అధికారులకు పంపించాం. ఈ విజ్ఞప్తులను ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని, కొద్ది రోజుల్లోనే రుసుములు తగ్గించే అవకాశం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని