logo

గల్లీ నుంచి వెండితెర వరకు..!

సాధారణ మధ్య తరగతి కుటుంబానికి చెందిన సుధీర్‌బాబు తెనాలిలో 2006లో ‘అమ్మ డాన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌’ ఏర్పాటు చేసుకుని పిల్లలు, యువతకు ఆధునిక నృత్యాల్లో శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు.

Published : 23 May 2022 05:11 IST

సినీ నృత్య దర్శకుడిగా రాణిస్తున్న సుధీర్‌బాబు

‘ముక్కు పుడక’ పాటతో ప్రశంసలందుకొంటున్న తెనాలి కుర్రోడు

తెనాలి టౌన్‌, న్యూస్‌టుడే


సినీ నటుడు అలీ, ఇతర బృందంతో స్టెప్పుల వేయిస్తూ..

సాధారణ మధ్య తరగతి కుటుంబానికి చెందిన సుధీర్‌బాబు తెనాలిలో 2006లో ‘అమ్మ డాన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌’ ఏర్పాటు చేసుకుని పిల్లలు, యువతకు ఆధునిక నృత్యాల్లో శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు. పలు పాఠశాలల సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణలోనూ పాలుపంచుకొంటూ వేలాది మంది పిల్లలకు నృత్యాన్ని నేర్పించారు. ఈ క్రమంలోనే తన ఇన్‌స్టిట్యూట్‌ పేరు తన పేరు ముందుకు చేరి, స్థానికంగా అందరికీ ‘అమ్మ సుధీర్‌’గా సుపరిచితుడయ్యారు. విభిన్న, వైవిధ్య నృత్యాలతో అందరినీ ఆకట్టుకుంటూ సామాజిక మాధ్యమాల సాయంతో 100కు పైగా పాటలకు నృత్య దర్శకుడిగా వ్యవహరించారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు చెందిన యువ కళాకారులతో స్టెప్పులు వేయించారు.

తొలిగా అలీతో..

తెనాలికి చెందిన దర్శకుడు దిలీప్‌రాజా తన ‘పండుగాడి ఫొటో స్టూడియో’ చిత్రంలో నృత్య దర్శకుడిగా సుధీర్‌కు అవకాశం ఇవ్వడంతో ‘మాది తెనాలి.. మీది తెనాలే’ పాటకు ప్రముఖ సినీ నటుడు అలీ, ఇతర బృందంతో వేయించిన స్టెప్పులు అందరినీ ఆకట్టుకున్నాయి. ఆపై ‘రాంగ్‌ నంబర్‌’, ‘మిథున గోపాలకృష్ణ’, ‘భానుమతి’, ‘రాంనాయక్‌’ చిత్రాలకు కొరియోగ్రాఫర్‌గా పనిచేశారు. తాజాగా ‘కల్యాణమస్తు’ చిత్రంలో చేసిన ‘ముక్కు పుడక’ పాట సామాజిక మాధ్యమాల ద్వారా విశేష ప్రాధాన్యం తీసుకొచ్చింది. ఇన్‌స్టాగ్రామ్‌లో 60 లక్షలకు పైగా, ‘యూ ట్యూబ్‌’లో 5 లక్షలకు పైగా అభిమానులను అలరించిన ఈ పాటను తమదైన శైలుల్లో వేలాది మంది యువత సామాజిక మాధ్యమాల్లో పంచుకొంటున్నారు. ఈ పాటలోని ‘లుంగీ’ స్టెప్‌ బాగా వైరల్‌ అయింది. కొద్ది రోజుల క్రితం ఈ పాట ప్రచారం కోసం చిత్ర బృందం వడ్లమూడిలోని విజ్ఞాన్‌ కళాశాలకు వచ్చినప్పుడు యువత నుంచి మంచి ఆదరణ లభించింది.

పట్టణంలోని ఒక వీధిలో చిన్న డాన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ పెట్టుకుని పిల్లలకు నృత్యాన్ని నేర్పుతున్న గోగినేని సుధీర్‌బాబు నేడు సినీ గీతాలకు స్టెప్పులు సమకూరుస్తున్నాడు. వెండి తెరపై కొరియోగ్రాఫర్‌గా రాణిస్తూ, విభిన్న నృత్య రీతులతో కళాకారులు, నృత్య ప్రేమికుల ప్రశంసలు అందుకొంటున్నాడు. కలలు సాకారం చేసుకున్న ఈ యువకుడి స్ఫూర్తిదాయక ప్రస్థానాన్ని తెలుసుకుందామా..?


మరింత గుర్తింపునకు ప్రయత్నం

ప్రతి డాన్స్‌ మాస్టర్‌ సినీ కొరియోగ్రాఫర్‌ కావాలని కలలు కంటాడు. నేనూ అలానే కలలు కంటూ ముందుకు సాగి, అనేక సంవత్సరాల ప్రయత్నం తర్వాత ముందడుగు వేశాను. ఈ పునాదిని మరింత బలోపేతం చేసుకుంటూ మరింత గుర్తింపునకు ప్రయత్నిస్తా. తాజా పాట ముక్కు పుడకకు లభిస్తున్న ఆదరణ ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని ఇచ్చింది.

- సుధీర్‌బాబు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని