logo

అమ్మో.. అక్కడికి వెళ్లలేం!

జిల్లాలో ఉద్యోగుల బదిలీల ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. ఐదేళ్లు పూర్తయినవారికి బదిలీ తప్పనిసరి కావడం, చాలారోజుల తర్వాత బదిలీలకు అనుమతి ఇవ్వడంతో చాలామంది ప్రస్తుతం పనిచేస్తున్న ప్రాంతం నుంచి కొత్త ప్రాంతాలకు

Published : 28 Jun 2022 06:20 IST

ఈనాడు, అమరావతి: జిల్లాలో ఉద్యోగుల బదిలీల ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. ఐదేళ్లు పూర్తయినవారికి బదిలీ తప్పనిసరి కావడం, చాలారోజుల తర్వాత బదిలీలకు అనుమతి ఇవ్వడంతో చాలామంది ప్రస్తుతం పనిచేస్తున్న ప్రాంతం నుంచి కొత్త ప్రాంతాలకు వెళ్లడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. ఆయా ప్రాంతాల నేతల వద్దకు వెళ్లి సిఫార్సు లేఖలు తెచ్చుకుని దరఖాస్తుకు జతచేస్తున్నారు. ఈక్రమంలో జిల్లాలో డెల్టాలోని ఒక నియోజకవర్గంలో పనిచేయడానికి అక్కడికి బదిలీపై వెళ్లడానికి ఎవరూ ఇష్టపడటం లేదు. ఇప్పటికే అక్కడ పనిచేస్తున్న అధికారులను తన నియోజకవర్గంలో పనిచేయవద్దని లేఖలు ఇవ్వడంతో వారంతా ఇతర ప్రాంతాలకు బదిలీపై వెళ్లడానికి సిద్ధమయ్యారు. రవాణాసౌకర్యాలు, ఇతర అనుకూలతలు అన్నీ ఉన్నా అక్కడి పరిస్థితుల దృష్ట్యా పనిచేయడానికి ఎవరూ ఇష్టపడటం లేదన్న చర్చ ఉద్యోగుల్లో నడుస్తోంది. అక్కడి పనిచేసి ఇతర ప్రాంతాలకు బదిలీపై వెళుతున్నవారితో అక్కడి పరిస్థితిని తెలుసుకున్న ఉద్యోగులు అక్కడికి వెళ్లడానికి ఇష్టపడటం లేదు. ఆనియోజకవర్గంలో పనిచేస్తున్న పలువురు ఉద్యోగులు వివిధ కారణాలతో సస్పెన్షన్‌కు గురికావడంతో అందరిలోనూ చర్చనీయాంశమైంది. దీంతో అక్కడికి వచ్చేవారికి ఎలాంటి షరతులు ఉండవని చెబుతూ కొందరు ఉద్యోగులకు సోమవారం ఫోన్‌ చేసి రావాలని కోరడం గమనార్హం. ఈవిషయం ఉద్యోగులకు తెలియడంతో ఇలాంటి పరిస్థితి వస్తుందని ముందే అంచనా వేశామని ఒకరికొకరు చర్చించుకుంటున్నారు.

నేతల అభిప్రాయమే కీలకం....: ఒకప్పుడు ఉద్యోగుల బదిలీలు పరిపాలనా అవసరాలు, ఉద్యోగుల సామర్థ్యం, పనితీరు మదింపు చేసుకుని ఉన్నతాధికారులు బదిలీలు చేసేవారు. ఉద్యోగుల ఆరోగ్య, ఇతరత్రా సమస్యలను పరిగణనలోకి తీసుకుని కొందరికి బదిలీల్లో వెసులుబాటు ఇచ్చేవారు. ఉన్నతాధికారులు అన్ని విషయాలు పరిగణనలోకి తీసుకుని బదిలీలు చేయడంతో పరిపాలనాపై పట్టు ఉండేది. యంత్రాంగం కూడా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పనిచేసేవారు. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఉద్యోగులు బదిలీపై ఎక్కడికి వెళ్లాలన్నా అక్కడి నేత నుంచి లేఖ తీసుకోవడం సర్వసాధారణమైంది. బదిలీ కావాలన్నా.... కోరుకున్న స్థానం పొందాలన్నా అక్కడి నేత లేఖ కావాల్సిందే. దీంతో ఉన్నతాధికారులు నేతల సిఫార్సులకు అనుగుణంగా బదిలీలు చేయాల్సి వస్తోంది. దీనివల్ల పరిపాలనాలోనూ తరచూ ఇబ్బందులు వస్తున్నాయి. రెండేళ్ల కిందట బదిలీలపై నిషేధం ఉన్నా క్షేత్రస్థాయి యంత్రాంగాన్ని నేతల సిఫార్సులకు అనుగుణంగా బదిలీ చేయడం వల్ల ఏడాదిపాటు ఆ ఉద్యోగులకు వేతనాలు అందని పరిస్థితి ఏర్పడింది. ఇటీవల వారి సమస్య పరిష్కారమైంది. కొందరు నేతల ఒత్తిళ్లకు తలొగ్గి ఉన్నతాధికారులు తీసుకుంటున్న నిర్ణయాలు కొన్నిసార్లు ఉద్యోగులకు ఇబ్బందికరంగా మారుతున్నాయి. ఒకే కార్యాలయంలో ఐదేళ్లు పూర్తయితే తప్పనిసరిగా బదిలీపై వెళ్లాలని మార్గదర్శకాలు చెబుతున్నా కొందరు వాటిని అనుసరించకుండా నేతలతో సిఫార్సు చేయిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని