logo

ఈ వెదురుకు ఎదురేలేదు

తక్కువ పెట్టుబడితో లాభసాటి సాగులో రైతుల నిరంతరం అన్వేషణలో ఎన్నో పంటలు వచ్చిపోతున్నాయి. ఏదీ నికరమైన ఆదాయం ఇవ్వడం లేదు. ప్రకృతి వైపరీత్యాలు, చీడపీడలు, మార్కెట్‌ ఒడిదొడుకులు మధ్య నష్టభయం లేని పంటల కోసం వెతుకుతూనే ఉన్నారు.

Published : 18 Aug 2022 06:15 IST

ఈనాడు, గుంటూరు


సాగులో ఉన్న వెదురు పంట

తక్కువ పెట్టుబడితో లాభసాటి సాగులో రైతుల నిరంతరం అన్వేషణలో ఎన్నో పంటలు వచ్చిపోతున్నాయి. ఏదీ నికరమైన ఆదాయం ఇవ్వడం లేదు. ప్రకృతి వైపరీత్యాలు, చీడపీడలు, మార్కెట్‌ ఒడిదొడుకులు మధ్య నష్టభయం లేని పంటల కోసం వెతుకుతూనే ఉన్నారు. ఈక్రమంలో వెదురు పంటకు ఆదరణ, గిరాకీ, భవిష్యత్తు ఉంటుందని భావించి ప్రయోగాత్మక సాగుకు శ్రీకారం చుట్టారు పల్నాడు జిల్లా పెదకూరపాడు మండలం గారపాడుకు చెందిన విశ్రాంత బ్యాంకు ఉద్యోగి వీరగంధపు వెంకటేశ్వర్లు.

మనదేశంలో వినియోగిస్తున్న వెదురు ఉత్పత్తుల అవసరాలకు ఈశాన్య రాష్ట్రాల్లో పండిస్తున్న పంట సరిపోవడం లేదు. దీంతో విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. దీనివల్ల విలువైన విదేశీమారక ద్రవ్యాన్ని చెల్లించాల్సి వస్తోంది. బహిరంగ మార్కెట్‌లో 20 అడుగుల పొడవు ఉన్న ఒక బొంగు సుమారు రూ.80 ధర పలుకుతోంది. వెదురు ఆధారిత పరిశ్రమలు వృద్ధి చెందడం, వెదురు ఉపయోగించే అవసరాలు పెరిగిపోవడంతో భవిష్యత్తులో మంచి డిమాండ్‌ ఉంటుందని మార్కెట్‌వర్గాల అంచనా. ప్లాస్టిక్‌కు పలు అంశాల్లో ప్రత్యామ్నాయంగా వెదురు కనిపిస్తోందని నిపుణులు చెబుతుండటం భవిష్యత్తుపై అంచనాలను పెంచుతోంది. వెదురు దిగుమతులు ఎక్కువగా ఉన్నందున కేంద్రప్రభుత్వం కూడా నేషనల్‌ బ్యాంబూ మిషన్‌ ప్రవేశపెట్టి దేశవ్యాప్తంగా వెదురుసాగును ప్రోత్సహిస్తోంది. సాగుదారులకు మూడేళ్లపాటు మొక్కల పెంపకానికి ప్రోత్సాహం ఇస్తోంది.

తక్కువ పెట్టుబడి.. నికర ఆదాయం
ఎకరాకు 450 వెదురు మొక్కలు నాటితే నాలుగేళ్ల తర్వాత ఏడాదికి 4వేల బొంగులు దిగుబడి వస్తుంది. తర్వాత ఏటికేడు పిలకలు పెరిగి బొంగుల సంఖ్య పెరుగుతుంది. తొలిఏడాది మొక్కల కొనుగోలు, రవాణా, మొక్కలు నాటడం, వేసవిలో నీటితడులు అందించి కాపాడటానికి మాత్రమే సొమ్ము వెచ్చించాలి. పొలం చుట్టూ కంచె, నీటిపారుదలకు బిందు సేద్యపరికరాలకు అయ్యే ఖర్చు కలిపి ఎకరాకు రూ.లక్ష దాకా వెచ్చించాలి. సహజ కంచె, వేసవిలో మాత్రం నీటిపారుదలకు ఖర్చు నామమాత్రమే. ఎకరాకు రూ.30వేలతోనే సాగు చేపట్టవచ్చు. రెండో ఏడాది నుంచి నిర్వహణ ఖర్చు పెట్టుబడి అవసరముండదు. కూలీల ఖర్చు ఉండదు. ఎరువులు, క్రిమిసంహారకాలు, కలుపు నివారణ వంటి అంశాలకు తావులేదు. ప్రకృతి వైపరీత్యాల వల్ల పెద్దగా నష్టం ఉండదు. వెదురులో అంతరపంటలు సాగుతో అదనపు ఆదాయం పొందవచ్చు. మొక్కకు మొక్కకు మధ్య 12 అడుగులు వెడల్పు, 5 అడుగుల పొడవున చొప్పున నాటుకోవాలి. ఉమ్మడి జిల్లాలో పెదకూరపాడు, దుగ్గిరాల, కొల్లూరు, వినుకొండ తదితర ప్రాంతాల్లో వెదురు సాగు చేస్తున్నారు.


ప్రయోజనాలు ఎన్నో..

వెదురు పేదవారి కలప.. ఆకుపచ్చ బంగారం అని పిలుస్తారు. హస్తకళలు, కళాఖండాలు, గృహోపకరణాలు, కాగితం, అగరుబత్తీలు, సంగీత వాయిద్యాల తయారీకి ఉపయోగిస్తారు. కాగితపు కప్పులు, పశువుల దాణా, బొగ్గు తయారీ, బయోమాస్‌గా ఉపయోగించే బ్రికెట్లు, బుల్లెట్‌ రైళ్లలో కోచ్‌ల తయారీ, ప్లైవుడ్‌, ప్లేట్లు, భవననిర్మాణం, పేపరు తయారీలో ముడిపదార్థం, సీఎన్‌జీ గ్యాస్‌, ఇథనాల్‌ తయారీకి వెదురు ఉపయోగపడుతుంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో గృహనిర్మాణం, పెన్సింగ్‌, బుట్టలు, ధాన్యాగారాలు, వంతెనలు, పడవలు, మార్కెట్‌షెడ్‌లు వంటి వివిధ ప్రయోజనాల కోసం వెదురు ఉపయోగిస్తారు. ఒక ప్రత్యేకమైన రైజోమ్‌ ఆధారిత వ్యవస్థ కారణంగా కొన్ని రకాల వెదురు 24గంటల వ్యవధిలో 91 సెంటీమీటర్లు పెరుగుతాయి.


నేల ఆరోగ్యం బాగు

వెదురు మొక్క కార్బన్‌డైఆక్సైడ్‌ను తీసుకుని ఆక్సిజన్‌ ఎక్కువ మోతాదులో విడుదల చేస్తుంది. వాతావరణ సమతుల్యతను కాపాడేందుకు దోహదం చేస్తుంది. ఏడాదికి ఎకరా విస్తీర్ణంలో 4టన్నుల ఆకు రాలుతుంది. ఇది సహజ ఎరువుగా మారి నేల ఆరోగ్యాన్ని పెంచుతుంది. ఒక్కొక్క వెదురు చెట్టు 50వేల లీటర్లు నీటిని నిల్వఉంచుకునే సామర్థ్యాన్ని కలిగి ఉండటంతో భూగర్భజలాలు పెరుగుతాయి. నేల కోతను నివారిస్తుంది.  ఉద్యోగ విరమణ తర్వాత వెదురు సాగు చేపట్టా. వెదురుపై సుధీర్ఘ అధ్యయనం చేసిన తర్వాత రెండేళ్ల కిందట రెండెకరాలు వేశా. ఈ ఏడాది సెప్టెంబరులో మరో 4.5 ఎకరాలు వేయడానికి సిద్ధమయ్యా. మా గ్రామంలో ఈసారి 20 ఎకరాలు వేయడానికి రైతులు ముందుకొచ్చారు. వంద ఎకరాలకుపైగా సాగు చేస్తే నేరుగా కంపెనీలు ఇక్కడికే వచ్చి కొనుగోలు చేస్తాయి.

-వీరగంధపు వెంకటేశ్వర్లు, విశ్రాంత బ్యాంకు ఉద్యోగి, గారపాడు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని