logo

బాధితుల సంగతేంటి?

విజయవాడ నగరంలోని టయోటా కంపెనీ డీలర్లు చేసిన అక్రమాల కారణంగా వాహనదారుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. కొనుగోలుదారులు డీలర్‌కు అన్ని రకాల పన్నులు చెల్లించారు. కానీ ఆర్థిక సమస్యల కారణంగా షోరూమ్‌ నిర్వాహకులు

Published : 26 Sep 2022 06:01 IST

ఆ రెండు షోరూమ్‌లలో కొన్న కార్లపై అనిశ్చితి

ఈనాడు, అమరావతి: విజయవాడ నగరంలోని టయోటా కంపెనీ డీలర్లు చేసిన అక్రమాల కారణంగా వాహనదారుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. కొనుగోలుదారులు డీలర్‌కు అన్ని రకాల పన్నులు చెల్లించారు. కానీ ఆర్థిక సమస్యల కారణంగా షోరూమ్‌ నిర్వాహకులు ఏడాది నుంచి ప్రభుత్వానికి పన్నులు చెల్లించకుండా సొంతానికి వాడేసుకున్నారు. ఈ మొత్తాలు చెల్లించకపోవడం వల్ల కొన్న వాహనాలన్నీ అనధికారికమైనవిగానే పరిగణిస్తారు. నిబంధనల ప్రకారం ఇవి రోడ్డుపై తిరిగితే సీజ్‌ చేయాల్సి ఉంటుంది. ఈ విషయంలో ఎటువంటి ప్రమేయం లేని వాహనదారుల పరిస్థితి ఏమిటన్నది అగమ్యగోచరంగా తయారైంది. రాధామాధవ్‌ టయోటా, లీలాకృష్ణ టయోటా నుంచి కొని మోసపోయిన వారిలో చాలా మంది ప్రజాప్రతినిధులు, నేతలు, ఉన్నతాధికారులు కూడా ఉన్నారు. ఇప్పటికే ఈ షోరూమ్‌లను రవాణా శాఖ అధికారులు మూసివేశారు. వారి డీలర్‌షిప్‌లపై ఎటువంటి క్రయవిక్రయాలు జరగకుండా లాగిన్‌లను నిలుపుదల చేశారు. మరి కొనుగోలుదారులకు ఏ విధంగా న్యాయం చేస్తారన్నది తేలాల్సి ఉంది.

* సాధారణంగా ఏదైనా కొత్త వాహనం కొనుగోలు చేస్తే.. జీవిత పన్ను, బీమా, ఇన్వాయిస్‌, వంటి వాటిని సంబంధిత డీలర్‌ రవాణా శాఖ సైట్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంది. అనంతరం ఆ వాహనానికి తాత్కాలిక రిజిస్ట్రేషన్‌ నెంబరును కేటాయిస్తారు. అప్పుడే అధికారికం అవుతుంది, రోడ్డుపైన తిరిగేందుకు అవకాశం ఉంది. దీనికి భిన్నంగా విజయవాడలోని ఈ డీలర్లు వ్యవహరించారు. కొనుగోలుదారుల నుంచి నిబంధనల ప్రకారం పన్నులు వసూలు చేశారు. కానీ ఆ మొత్తాన్ని రవాణా శాఖకు జమ చేయకుండానే స్వాహా చేశారు. కానీ వాహనాన్ని కొనుగోలుదారుడికి ఇచ్చేశారు. మరికొంత మంది నుంచి వాహనం డెలివరీ ఇస్తానని చెప్పి ముందస్తుగా డబ్బు తీసుకుని ఆనక చేతులెత్తేశారు. ఈ విధంగా నగరంలోని రాధా మాధవ్‌ టయోటా, లీలాకృష్ణ టయోటా షోరూమ్‌ల నిర్వాహకులు అందినకాడికి వసూలు చేశారు. ఇలా పలు వాహనాలను అంటగట్టినట్లు సమాచారం. ఎన్ని వాహనాలు?, ఎంత మొత్తానికి అక్రమాలకు పాల్పడ్డారన్నది తెలియడం లేదు. రూ.కోట్లలోనే ఉంటుందని అంచనా వేస్తున్నారు.

* నగరంలోని పలు స్టేషన్లలో డీలర్ల మోసంపై ఫిర్యాదులు నమోదు అయినట్లు తెలిసింది. ఇప్పటి వరకు పటమట పోలీసుస్టేషన్లలో రెండు కేసులు ఉన్నట్లు వెలుగు చూసింది. గుంటూరు జిల్లా మేడికొండూరుకు చెందిన శాంతిరాజు.. ఈ ఏడాది జనవరి ఆరో తేదీన విజయవాడ శివారు ప్రసాదంపాడులోని రాధామాధవ్‌ టయోటా షోరూమ్‌కు వెళ్లాడు. ఇన్నోవా క్రిస్టా కారు కోసం బుక్‌ చేసుకున్నాడు. 3 విడతలుగా రూ.29.04లక్షలు చెల్లించాడు. వాహనాన్ని జనవరి నెలాఖరు నాటికి డెలివరీ ఇస్తామని డీలరు చెప్పారు. కానీ గుంటూరు షోరూమ్‌ వారు ఎంతకీ కారు ఇవ్వకుండా దాటవేత ధోరణితో వ్యవహరించేవారు. జూన్‌లో గుంటూరు షోరూమ్‌ మూసివేశారు. అనంతరం విజయవాడ ప్రసాదంపాడు షోరూమ్‌కు వచ్చి టయోటా కంపెనీకి చెందిన కోస్తా ప్రతినిధి అయిన చంద్రను, షోరూమ్‌ ఎండీని కలిశారు. ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో శాంతిరాజు ఫిర్యాదు చేశారు. పోలీసుల జోక్యంతో మేనేజరు వెంకటశ్రీనివాసరావు మూడు దఫాలుగా రూ.10లక్షలు చెల్లించారు. ఆ తర్వాత స్పందన లేకపోవడంతో బాధితుడు పటమట స్టేషనులో ఫిర్యాదు చేశాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని