logo

ఇరుముళ్లంటే ఇంత నిర్లక్ష్యమా!

‘దుర్గగుడికి తరలివచ్చే భవానీ భక్తుల కోసం కనీస ఏర్పాట్లు కూడా చేయకపోవడంతో.. పవిత్రమైన ఇరుముడి బియ్యాన్ని రోడ్ల పక్కనే పడేసి వెళ్లిపోయే పరిస్థితి దాపురించింది. అమ్మవారి దర్శనాలు చేసుకుని మహామండం నుంచి కిందకు వచ్ఛి. కనకదుర్గానగర్‌లో రాతి మండపాల పక్కన కుప్పలుగా బియ్యం పోసేసి వెళ్లిపోయారు.

Published : 08 Oct 2022 04:23 IST

ఈనాడు, అమరావతి

భక్తులు నడిచే దారిలో పోసిన ఇరుముడుల బియ్యం

‘దుర్గగుడికి తరలివచ్చే భవానీ భక్తుల కోసం కనీస ఏర్పాట్లు కూడా చేయకపోవడంతో.. పవిత్రమైన ఇరుముడి బియ్యాన్ని రోడ్ల పక్కనే పడేసి వెళ్లిపోయే పరిస్థితి దాపురించింది. అమ్మవారి దర్శనాలు చేసుకుని మహామండం నుంచి కిందకు వచ్ఛి. కనకదుర్గానగర్‌లో రాతి మండపాల పక్కన కుప్పలుగా బియ్యం పోసేసి వెళ్లిపోయారు. హోమగుండాలు పెట్టకపోయినా.. కనీసం భవానీ భక్తులు తీసుకొచ్చే ఇరుముడి బియ్యాన్నయినా ఏదో ఒకచోట ఉంచేసి వెళ్లిపోయేలా ఏర్పాటు చేసి ఉంటే బాగుండేది. ఆ ఏర్పాటు కూడా చేయకపోవడంతో దారి పక్కన మట్టిలో బియ్యాన్ని పోసేసి భవానీలు అసంతృప్తితో వెళ్లిపోయే పరిస్థితి వచ్చింది.’

విజయ దశమి తర్వాత గురు, శుక్రవారాల్లో రెండు రోజులు ఇంద్రకీలాద్రికి భవానీ భక్తులు పోటెత్తారు. రెండు రోజుల్లో కనీసం మూడు లక్షల మందికి పైగా భవానీలు తరలివచ్చారు. వీరు తలపై పెట్టుకుని తీసుకొచ్చిన ఇరుముడిలోని బియ్యాన్ని.. ఎక్కడ ఉంచాలో, ఎవరికి ఇవ్వాలో కూడా తెలియని అయోమయంలో పడిపోయారు. దాంతో.. గుడి ప్రాంగణంలోనే ఏదో ఒక మూల పెట్టేసి వెళ్లిపోవాలనే భావనతో రోడ్ల పక్కన పడేశారు. ఇరుమడిలోని బియ్యం, పసుపు కుంకుమ, పండ్లు, డబ్బులు.. ఇవన్నీ పడేశారు. నేతి కొబ్బరికాయలను మాత్రం హోమగుండంలో వేసేందుకు తమవెంట పట్టుకుని వెళ్లిపోయారు. ఈ ఏడాది దసరాలో ఇరుముడి స్వీకరణకు ఎలాంటి ఏర్పాట్లు చేయడం లేదంటూ ఆలయం తరఫున ఒక ప్రకటన చేసి వదిలేశారు. ఆ విషయం రెండు తెలుగు రాష్ట్రాల్లోని భవానీ భక్తులకు సరిగా చేరలేదు. దీంతో వాళ్లు ఇరుముళ్లతో ఇక్కడికి వచ్చారు. ఇక్కడ కనీస ఏర్పాట్లు చేయకపోవడంతో.. తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

న్యాయస్థానంలోనూ వాదోపవాదాలు..

దుర్గగుడిలో దసరా ఉత్సవాలకు ఈ దసరాలో లక్షల మంది భవానీలు తరలివస్తున్నారని, వారికోసం ఇరుముళ్ల స్వీకరణ, హోమగుండం ఏర్పాటు చేయాలంటూ.. సుంకర దుర్గారావు, మయూరి రాము, కోరాడ నాగదుర్గాప్రసాద్‌, మల్లెల బాలకృష్ణారెడ్డి, సల్లా శ్రీనివాసరావు, లక్కిరెడ్డి శ్రీనివాసరెడ్డి, పట్నాల లక్ష్మణరెడ్డి తదితర గురుభవానీల ఆధ్వర్యంలో న్యాయస్థానాన్ని సైతం ఆశ్రయించారు. దసరాలో ఏటా ఇరుముళ్ల స్వీకరణకు ఏర్పాట్లు చేస్తున్నారని, ఈసారి కూడా చేయాలంటూ కోరారు. దీనిపై దుర్గగుడి తరఫున వివరణ ఇస్తూ.. గత రెండేళ్లలో కొవిడ్‌ నేపథ్యంలో భక్తులు తక్కువ వచ్చారని, ఈసారి భారీగా తరలివచ్చే అవకాశం ఉందని, కనీసం ఐదు లక్షల మంది రావొచ్చని అంచనా వేస్తున్నట్టు తెలిపారు. అంతమందికి సంబంధించి ఇంత తక్కువ సమయంలో ఏర్పాట్లు చేయడానికి ఇబ్బంది అవుతుందని వివరణ ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని