logo

ఇళ్ల నిర్మాణంలో తంటాలు

పేదల పక్కా గృహాల ప్రారంభోత్సవానికి సీఎం వైఎస్‌ జగన్‌ డిసెంబరులో బాపట్ల వస్తారన్న సమాచారంతో గృహ నిర్మాణానికి జిల్లా అధికార యంత్రాంగం అధిక ప్రాధాన్యం ఇస్తోంది. పక్కాగృహాల నిర్మాణంలో జిల్లా వెనకబడి ఉండటంపై ఇటీవల నిర్వహించిన వీసీలో సీఎం జగన్‌ ఆరా తీశారు.

Updated : 08 Oct 2022 05:31 IST

మహిళా సమాఖ్యలకు గృహ నిర్మాణ బాధ్యత

ప్యాడిసన్‌పేట లేఅవుట్‌ ప్రారంభోత్సవానికి డిసెంబరులో సీఎం రాక

న్యూస్‌టుడే, బాపట్ల

లేఔట్‌లో అంతర్గత రహదారి ఇలా..

పేదల పక్కా గృహాల ప్రారంభోత్సవానికి సీఎం వైఎస్‌ జగన్‌ డిసెంబరులో బాపట్ల వస్తారన్న సమాచారంతో గృహ నిర్మాణానికి జిల్లా అధికార యంత్రాంగం అధిక ప్రాధాన్యం ఇస్తోంది. పక్కాగృహాల నిర్మాణంలో జిల్లా వెనకబడి ఉండటంపై ఇటీవల నిర్వహించిన వీసీలో సీఎం జగన్‌ ఆరా తీశారు. ఈ నేపథ్యంలో ఇంత వరకు నిర్మాణ పనులు ప్రారంభించని లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణ బాధ్యతను మహిళా సమాఖ్యలకు అప్పగించాలని నిర్ణయించారు. అయితే జగనన్న లేఔట్లలో మౌలిక వసతులు లేక ఇళ్ల నిర్మాణానికి లబ్ధిదారులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చి మెరకలు వేయకపోవటంతో భారీ వర్షాలకు జల దిగ్బంధంలో చిక్కుకుంటున్నాయి.

* ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించని లబ్ధిదారుల స్థలాలు రద్దు చేసి వేరే వారికి ఇస్తామని కలెక్టర్‌ పేరుతో నోటీసులు జారీ చేశారు. నిరుపేదలు ఆర్థిక ఇబ్బందులతో గృహ నిర్మాణం తమ వల్ల కాదంటూ చేతులేత్తేస్తున్నారు. పక్కా గృహాల నిర్మాణంలో చీరాల, అద్దంకి పట్టణాలు, అద్దంకి మండలం, సంతమాగులూరు, యద్దనపూడి, జె.పంగులూరు, కొరిశపాడు, బల్లికురవ మండలాలు వెనుకబడి ఉన్నాయి. నియోజకవర్గ, మండల ప్రత్యేకాధికారులు, తహశీల్దార్లు, పురపాలక కమిషనర్లు, ఎంపీడీవోలను వారంలో రెండు సార్లు జగనన్న కాలనీలకు పంపించి క్షేత్రస్థాయిలో పరిశీలన చేయిస్తున్నారు. కాలనీల్లో పరిస్థితులను వీడియోకాల్‌ ద్వారా జిల్లా పాలనాధికారికి అధికారులు వివరిస్తున్నారు.

* ఇప్పటి వరకు పునాది వేయని, పునాది దశలో ఆగిన ఇళ్ల నిర్మాణ బాధ్యతను మహిళా సమాఖ్యలకు అప్పగించారు. మహిళా సమాఖ్యలే భవన నిర్మాణ కార్మికులను మాట్లాడి పనులు చేయించాలని ఆదేశించారు. ఈ విధంగా అయినా పక్కాగృహాల నిర్మాణంలో కదలిక వచ్చి పురోగతి కనిపిస్తుందని అధికారులు భావిస్తున్నారు. లబ్ధిదారుల ఆర్థిక ఇబ్బందులతో 16 వేలకు పైగా గృహాలు వివిధ దశల్లో అసంపూర్తిగా ఆగిపోయి ఉన్నాయి. వీరితోను అధికారులు మాట్లాడి పనులు తిరిగి ప్రారంభించాలని ఒత్తిడి తెస్తున్నారు.

* ఒక్కో ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం రూ.1.80లక్షలు అందిస్తోంది. ఇందులో భాగంగానే లబ్ధిదారులకు ఇసుక, స్టీలు, సిమెంటు బస్తాలను గృహనిర్మాణ శాఖ అధికారులు అందజేస్తున్నారు. భవన నిర్మాణ సామగ్రి ధరలు బాగా పెరిగాయి. పునాది నిర్మాణం చేపట్టాలంటే రూ.80 వేల వరకు ఖర్చు అవుతోంది. నిరుపేదలు పునాది నిర్మాణం చేపట్టలేని స్థితిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆర్థికంగా చేయూత అందించటానికి పొదుపు సంఘాల్లో సభ్యులుగా ఉన్న 16,343 మంది లబ్ధిదారులైన మహిళలు ఒక్కొక్కరికి గృహ నిర్మాణానికి రూ.35 వేల రుణం మంజూరు చేయించాలని నిర్ణయించారు. ఇప్పటి వరకు 10,473 మందికి రుణాలు మంజూరు చేయించారు. ఇంకా 5,870 మందికి రుణాలు అందాల్సి ఉంది. రుణం ద్వారా వచ్చిన సొమ్మును ఇంటి నిర్మాణానికే లబ్ధిదారులు వినియోగించేలా సచివాలయ సిబ్బంది చూస్తున్నారు.

ప్యాడిసన్‌పేట లేఔట్‌లో జగనన్న కాలనీ

* వ్యవసాయ భూములు, లోతట్టు ప్రాంతాల్లో జగనన్న కాలనీలు ఉండటంతో వర్షాలకు ముంపు బారినపడ్డాయి. చాలా చోట్ల మెరకలు వేయలేదు. అంతర్గత రహదారుల నిర్మాణం చేపట్టలేదు. భారీ వర్షాలకు నిర్మాణ సామగ్రి తరలించలేని దుస్థితి నెలకొంది. అన్ని కాలనీల్లో విద్యుద్దీకరణ పనులు పూర్తిస్థాయిలో జరగలేదు. పక్కా గృహాల పురోగతిపై రాష్ట్రస్థాయిలో బాపట్ల జిల్లా కింది నుంచి నాలుగో స్థానంలో ఉంది. ఉన్నతాధికారులు, కలెక్టర్‌ సమీక్షల మీద సమీక్షలు నిర్వహిస్తున్నా మౌలిక వసతుల కొరత, ప్రభుత్వం అందిస్తున్న సాయం సరిపోక ఇళ్ల నిర్మాణాలు నత్తనడక సాగతున్నాయి. బాపట్లలో ప్యాడిసన్‌పేట లేఅవుట్‌ జగనన్న కాలనీలో 1800లకు పైగా గృహాలు మంజూరు చేశారు. అంతర్గత రహదారులు బురదమయంగా మారి ఇసుక, సిమెంటు తరలింపు కష్టతరమవుతోంది.

గృహ నిర్మాణానికి అధిక ప్రాధాన్యం

పేదల పక్కా గృహాల నిర్మాణానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ప్రభుత్వ సాయానికి తోడు పొదుపు సంఘాల్లో సభ్యులుగా ఉన్న మహిళలకు బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేయిస్తున్నాం. దశలవారీగా జగనన్న కాలనీల్లో మౌలిక వసతుల కల్పన చేపడుతున్నాం. ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. డిసెంబరులోగా ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. - విజయకృష్ణన్‌, కలెక్టర్‌

జిల్లాకు కేటాయించిన గృహాలు 32,602

మొత్తం జగనన్న లేఔట్లు 282

నిర్మాణాలు ప్రారంభించని గృహాలు 522

పునాది దశలో ఆగినవి 17,743

పునాది పూర్తయిన గృహాలు 5261

గోడల వరకు నిర్మించిన ఇళ్లు 1132

శ్లాబ్‌ వేసినవి 2323

పూర్తయినవి 3109

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని