logo

బెంగళూరుకు మార్గం సుగమం

బెంగళూరు నుంచి విజయవాడకు ఆరు వరుసల రహదారి నిర్మాణానికి మార్గం సుగమమైంది. ఇది బాపట్ల జిల్లా అద్దంకి మీదుగా వెళుతుండటంతో ఇక్కడ విశ్రాంత ప్రాంతం నిర్మాణంతోపాటు ఇక్కడికి 15 కిలోమీటర్ల దూరంలో ప్రవేశమార్గం సైతం ఏర్పాటు చేయనున్నారు.

Published : 16 Dec 2022 03:34 IST

టెండర్ల ప్రక్రియ మొదలు పెట్టిన ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు
కడప మీదుగా విజయవాడ వరకు ఆరు వరుసల రహదారి
ఈనాడు-నరసరావుపేట

జాతీయ రహదారిలో కూడలి ఏర్పాటు చేసే ప్రాంతం

బెంగళూరు నుంచి విజయవాడకు ఆరు వరుసల రహదారి నిర్మాణానికి మార్గం సుగమమైంది. ఇది బాపట్ల జిల్లా అద్దంకి మీదుగా వెళుతుండటంతో ఇక్కడ విశ్రాంత ప్రాంతం నిర్మాణంతోపాటు ఇక్కడికి 15 కిలోమీటర్ల దూరంలో ప్రవేశమార్గం సైతం ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు అవసరమైన భూసేకరణ కోసం భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(ఎన్‌హెచ్‌ఏఐ) ప్రకటన ఇచ్చింది. గతేడాది సర్వే పనులు మొదలై కొలిక్కి రావడంతో ఇటీవల టెండర్లు పిలిచారు. గుత్తేదారులతో ఒప్పందాలు పూర్తయిన తర్వాత మూడేళ్ల కాలంలో నిర్మాణం పూర్తిచేయాలన్నది లక్ష్యం. ఇందుకు కేంద్ర ప్రభుత్వం సుమారు రూ.16వేల కోట్ల సొమ్ము వెచ్చించనుంది. ఈమార్గం పూర్తయితే విజయవాడ నుంచి బెంగళూరుకు 8 గంటల సమయంలో చేరుకోవచ్చు. కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంతో ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడకు అనుసంధాన రహదారి అభివృద్ధి చేయడం వల్ల ప్రగతికి బాటలు పడనున్నాయి. మొత్తం 342.5 కిలోమీటర్ల దూరం రహదారి నిర్మించనున్నారు. శ్రీసత్యసాయి జిల్లాలోని జాతీయ రహదారి 44కు చిలమత్తూరు మండలం కోడూరు వద్ద అనుసంధానం చేస్తారు. చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారి 16కు ముప్పవరం వద్ద కలుపుతారు. దీంతో విజయవాడ నుంచి బెంగళూరు వరకు మొత్తం జాతీయ రహదారిలోనే ప్రయాణించవచ్చు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో 342.5కిలోమీటర్ల దూరం మార్గాన్ని నిర్మించనున్నారు. అటవీప్రాంతంలో పర్యావరణానికి విఘాతం కలగకుండా 7.7 కిలోమీటర్ల మేర టన్నెల్‌ నిర్మిస్తారు.

118.76 హెక్టార్ల భూసేకరణ

బెంగళూరు-కడప-విజయవాడ  ఎకనమిక్‌ కారిడార్‌ నిర్మాణానికి బాపట్ల జిల్లాలో 118.76 హెక్టార్ల భూసేకరణ చేస్తున్నారు. ఈమార్గం బాపట్ల జిల్లాలో 325 కిలోమీటరు నుంచి 342.5 కిలోమీటరు వరకు ప్రయాణిస్తుంది. ఈక్రమంలో అద్దంకి వద్ద విశ్రాంతి ప్రాంతం, ముప్పవరం వద్ద జాతీయ రహదారిలోకి ప్రవేశమార్గం నిర్మాణం, టన్నెల్‌ ఏర్పాటుకు భూమి సేకరిస్తున్నారు. అద్దంకి మండలంలోని అద్దంకి, కొటికలపూడి, జె.పంగులూరు మండలంలోని ముప్పవరం, కొండమూరు గ్రామాల్లో భూసేకరణ చేయనున్నారు. ఎకనమిక్‌ కారిడార్‌ స్థానికులకు ఇబ్బంది లేకుండా 2మీటర్ల మేర ఎత్తులో నిర్మిస్తారు. గ్రామాల గుండా వెళ్లే మార్గం 5 మీటర్ల ఎత్తులో ఉంటుంది. గ్రామాల్లో రోడ్డును దాటడానికి అండర్‌పాస్‌లు నిర్మిస్తారు. ఈ మార్గంలోకి ఎక్కడికక్కడ ప్రవేశం లేకుండా అవసరాలకు అనుగుణంగా 15 నుంచి 20 కిలోమీటర్ల వ్యవధిలో ఒక ప్రవేశకూడలి(ఇంటర్‌ జంక్షన్‌) ఏర్పాటుచేస్తారు. ఈప్రాంతంలోనే రోడ్డులోకి ప్రవేశం ఉంటుంది. ఇది ఎకనమిక్‌ కారిడార్‌ కావడంతో స్థానికులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లతోపాటు వేగంగా వెళ్లే వాహనాలకు అడ్డంకులు లేకుండా నిర్మిస్తారు.

సమయం..  ఇంధనం ఆదా

విజయవాడ-కడప-బెంగళూరు నడుమ ఆరు వరుసల రహదారిని నిర్మిస్తారు. రోడ్డు 70 మీటర్ల వెడల్పుతో అత్యంత ఆధునికంగా నిర్మాణం చేపడతారు. బాపట్ల జిల్లాలో 17.5 కిలోమీటర్ల మేర నూతన రహదారి నిర్మించనున్నారు. ఈప్రాంతంలో అభివృద్ధికి అవకాశాలు మెరుగువుతాయి. స్థానికంగా పండే ఉద్యాన, వ్యవసాయ, వాణిజ్య పంటలను సులభంగా అటు బెంగళూరు, ఇటు విజయవాడకు రవాణా చేయవచ్చు. ప్రస్తుతం విజయవాడ నుంచి బెంగళూరుకు 15 నుంచి 16 గంటల సమయం పడుతోంది. ఈమార్గం అందుబాటులోకి వస్తే 8 గంటల్లోనే ప్రయాణం పూర్తవుతుంది. దీనివల్ల సమయం, ఇంధనం ఆదా అవుతుంది. వాహనాల మన్నిక కూడా పెరుగుతుంది. ప్రయాణ సమయం తగ్గడం వల్ల మార్టూరు తదితర ప్రాంతాల్లో విస్తారంగా పండే కూరగాయలను బెంగళూరుకు రవాణా సులభమవుతుంది. దీంతోపాటు వాణిజ్య, ఉద్యాన పంటలకు సంబంధించిన శుద్ధి యూనిట్లను ఈప్రాంతంలో ఏర్పాటుచేసుకుని అంతిమ ఉత్పత్తులు తయారుచేసే ప్లాంట్లు విస్తారంగా ఏర్పాటయ్యే వెసులుబాటు కలుగుతుంది. ఆహారశుద్ధి పరిశ్రమలు వస్తే పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు లభిస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని