logo

వసూళ్లలో ఎగుమతి, దిగుమతి సంఘాల నేతలు

వ్యాపారుల సంక్షేమాన్ని గాలికి వదిలేసిన మిర్చి ఎగుమతి, దిగుమతి సంఘాల నాయకులు అధికార పార్టీ నేతల సేవలో మునిగి తేలుతున్నారు.

Published : 30 Apr 2024 06:14 IST

బెంబేలెత్తుతున్న మిర్చి వ్యాపారులు

మిర్చియార్డు(గుంటూరు), న్యూస్‌టుడే: వ్యాపారుల సంక్షేమాన్ని గాలికి వదిలేసిన మిర్చి ఎగుమతి, దిగుమతి సంఘాల నాయకులు అధికార పార్టీ నేతల సేవలో మునిగి తేలుతున్నారు. దివాళా తీసిన వారి నుంచి వసూళ్లు చేసి వ్యాపారులకు రావాల్సిన సొమ్ము ఇప్పించడం చేతగాని సంఘాల నాయకులు ఎన్నికల సందర్భంగా కోట్లాది రూపాయలు వసూళ్లు చేస్తున్నారు. ఓ శీతలగిడ్డంగిలో దిగుమతి సంఘ నాయకుల సమావేశం సోమవారం జరిగింది. ఓ మిర్చి వ్యాపారికి చెందిన సంస్థ నుంచి రావాల్సిన పద్దులు, వడ్డీల గురించి చర్చిద్దామని దిగుమతి సంఘం నేతల నుంచి వ్యాపారులకు కబురు అందింది. ఆమేరకు సదరు సంఘం పేరుపై కార్యదర్శి సంతకంతో ఆహ్వానం పంపారు. దీని ముసుగులో చందాలు వసూళ్లు చేస్తున్నారని తెలుసుకున్న అధిక శాతం మంది వ్యాపారులు ముఖం చాటేశారు. ఈ సమావేశానికి స్పందన అంతంతమాత్రంగా ఉండటంతో మంగళవారం మిర్చియార్డు సమీపంలోని ఓ కల్యాణ మండపంలో వైకాపా ఎంపీ, ఎమ్మెల్యేల అభ్యర్థులతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి అల్పాహార విందు ఉంటుందని కబురు పంపారు. మిర్చి వ్యాపారులు అందరికీ ఫోన్లు చేసి ఈ సమావేశానికి రావాలని ఆహ్వానించారు.

పార్టీలతో సంబంధం ఏమిటని ప్రశ్నించడంతో..

ఇందులో తెదేపా, జనసేన, భాజపా అనుకూల వ్యాపారులు సదరు మిర్చి దిగుమతి సంఘం నాయకుల్ని నిలదీశారు. రాజకీయ పార్టీలతో సంబంధం ఏమిటని ప్రశ్నించడంతో నేతలు ఖంగుతిన్నారు. ఇచ్చే చందాలేవో అన్ని పార్టీల అభ్యర్థులకు సమానంగా ఇద్దామని చెప్పడంతో సదరు సంఘ నేత మారు మాట్లడకుండా మిన్నకుండిపోయారు. మిర్చి ఎగుమతి సంఘాల నాయకులు మాత్రం ఇప్పటికే కోట్లాది రూపాయలు వసూళ్లు చేసినట్లు సమాచారం. చందాలు ఇవ్వని మిర్చి ఎగుమతి వ్యాపారుల్ని జీరో, కటింగ్‌ వ్యాపారం ఏవిధంగా చేస్తారో బెదిరింపులకు దిగుతున్నారు. దిగుమతి వ్యాపారుల నుంచి అంతగా స్పందన లేకపోవడంతో అల్పాహార విందు పేరుతో వసూళ్లకు దిగుతున్నారు. లైసెన్స్‌లు లేకుండా వ్యాపారం చేసే వారిని ఎంతో కొంత ఇవ్వాలని పట్టుబడుతున్నారు. మా అండ లేకపోతే బిల్లు టు బిల్లు వ్యాపారం ఏవిధంగా చేస్తారో చూస్తామని బెదిరిస్తున్నారు. ఈ వ్యవహారానికి ప్రత్యేకంగా మూడు సంఘాల్లోని కొందరు నేతలు కీలకంగా వ్యవహరిస్తున్నారని వ్యాపారులు పేర్కొంటున్నారు. తాము కష్టపడ్డ సొమ్ము వారికి ఎందుకు ఇవ్వాలని వ్యాపారులు ప్రశ్నిస్తున్నారు. సంఘాల నేతల నుంచి ఫోన్‌ వస్తే భయపడాల్సి వస్తోందని మరికొందరు వాపోతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని