logo

రెండ్రోజులకోసారి డ్రమ్ము నీరు సరిపోతుందా?

రేపల్లె శివారు ప్రాంతమైన 28వ వార్డు ప్రజలకు తాగునీరు అందడం లేదని ఆరోపిస్తూ వారు ప్రధాన రహదారిపై సోమవారం ఆందోళనకు దిగారు. ట్యాంకరుతో రెండ్రోజులకోసారి సరఫరా చేస్తున్న నీరు అందరికీ సరిపోవడంలేదని మండిపడ్డారు.

Published : 30 Apr 2024 06:19 IST

తాగునీటి కోసం రోడ్డెక్కిన రేపల్లె వాసులు

రేపల్లెలో ప్రధాన రహదారిపై ఆందోళన చేస్తున్న స్థానికులు

రేపల్లె అర్బన్‌, న్యూస్‌టుడే: రేపల్లె శివారు ప్రాంతమైన 28వ వార్డు ప్రజలకు తాగునీరు అందడం లేదని ఆరోపిస్తూ వారు ప్రధాన రహదారిపై సోమవారం ఆందోళనకు దిగారు. ట్యాంకరుతో రెండ్రోజులకోసారి సరఫరా చేస్తున్న నీరు అందరికీ సరిపోవడంలేదని మండిపడ్డారు. ఇంటి, నీటి పన్నులు వసూలు చేస్తున్న మున్సిపల్‌ అధికారులు నీరందించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్యాంకర్ల నీరొద్దని పైపులైను ద్వారా ఎందుకు సరఫరా చేయరని అధికారులను నిలదీశారు. రెండ్రోజులకోసారి ఒక డ్రమ్ము నీరు ఎలా సరిపోతాయని ప్రశ్నించారు. ట్యాంకరును రోడ్డుపై నిలిపి డ్రమ్ముల్లో నింపి వెళ్తుంటే వాటిని ఇళ్లకు మోసుకొని వెళ్లలేక పోతున్నామని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇరుకు రోడ్డన్న సాకుతో ప్రధాన రహదారిపైనే ట్యాంకరు ఆపి పోయడం ఎంతవరకు న్యాయమని నిలదీశారు. 28వ వార్డు అంటే ఎందుకు మీకింత కక్ష అని నిప్పులు చెరిగారు. నోరులేని జీవాలకు కడుపునిండా నీరు పెట్టలేక పోతున్నామని నిట్టూర్చారు. ప్రధాన రహదారిపై డ్రమ్ములు పెట్టి 30 నిమిషాలు నిరసన ప్రదర్శన చేయడంతో రెండు వైపులా వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న కమిషనర్‌ శేషాద్రి, ఏఈ రోహిణి ఘటనా స్థలానికి చేరుకున్నారు. వాహన రద్దీ సమస్య తలెత్తకుండా సహకరించాలని కోరారు. అందరికీ సరిపడినన్ని తాగునీరు ట్యాంకర్లతో సరఫరా చేయిస్తామని నచ్చజెప్పడంతో స్థానికులు శాంతించారు. 28వ వార్డుకు ప్రత్యేకంగా ట్యాంకరు ఏర్పాటు చేసి రోజుకు ఆరు ట్రిప్పులు నీరు పంపుతామని భరోసా ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని