logo

హంగుల బడిలో ఎనిమిది మంది విద్యార్థులే

పిట్టలవానిపాలెం మండలం చందోలు ప్రధాన ప్రాథమిక పాఠశాలను సుమారు రూ.16 లక్షలతో అందంగా తీర్చిదిద్దారు. అయితే ఇక్కడ చదువుతోంది ఎనిమిది మంది విద్యార్థులే.

Updated : 21 Mar 2023 07:27 IST

చందోలు ప్రాథమిక పాఠశాల

చందోలు(పిట్టలవానిపాలెం), న్యూస్‌టుడే: పిట్టలవానిపాలెం మండలం చందోలు ప్రధాన ప్రాథమిక పాఠశాలను సుమారు రూ.16 లక్షలతో అందంగా తీర్చిదిద్దారు. అయితే ఇక్కడ చదువుతోంది ఎనిమిది మంది విద్యార్థులే. ఈ పాఠశాలలో గతేడాది 72 మంది ఉన్నారు. 3, 4, 5 తరగతులకు చెందిన 51 మందిని స్థానిక జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో ఆ ఏడాదీ విలీనం చేశారు. మిగిలిన 21 మందిలో 15 మంది ఈ సంవత్సరం మూడో తరగతిలోకి వచ్చి ఉన్నత పాఠశాలకు వెళ్లిపోగా ఆరుగురే మిగిలారు. వీరికి తోడు ఒకటో తరగతిలో కొత్తగా ఇద్దరు విద్యార్థులు చేరడంతో ప్రస్తుతం ఎనిమిది మంది ఉన్నారని ప్రధానోపాధ్యాయిని తెలిపారు. ఇక్కడ పని చేసే ఇద్దరు ఉపాధ్యాయులు వేరే పాఠశాలకు వెళ్లారు. ఎనిమిది మంది విద్యార్థుల్లో వచ్చే ఏడాది ఆరుగురు మూడో తరగతిలోకి రావడంతో వారు కూడా ఉన్నత పాఠశాలకు వెళ్తారు. ఇక ఇక్కడ మిగిలేది ఇద్దరే. ఈ పాఠశాలలో 2021లో రూ.15.83లక్షలతో మొదటి విడత ‘నాడు-నేడు’లో భాగంగా అనేక పనులు చేపట్టారు. టైల్స్‌, బల్లలు, విద్యుత్తు, సీలింగ్‌, తాగునీరు వంటి అన్ని వసతులు సమకూర్చారు. రూ.లక్షలు ఖర్చుచేసినా విద్యార్థుల సంఖ్య బాగా తగ్గిపోవడంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని